ప్రియమైన స్నేహితులారా,
- ఇంతగొప్ప ఆకాశమును, సూర్యుడిని ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తున్న ప్రతి సృష్ట్యాన్ని ఆయన కేవలం తన నోటి మాటతో చేసి, ఇంతలో కనబడి అంతలో ఆవిరై పోయే మనుషులమైన మనలను ప్రత్యేకించి తన స్వహస్తాలతో ఎందుకు చేసారు?
- సమస్త సృష్టి ఆయన మాటకు లోబడి వణుకుతూ ఉంటే, ఏమాత్రం ఆయనంటే భయం లేకుండా జీవిస్తున్న మెడలు వంచని ఈ జనాంగము కొరకు తన ప్రియమైన కుమారుణ్ణి శ్రమలు పొంది ప్రాణం అర్పించడానికి ఎందుకు పంపించారు?
- సృష్టి కర్త ఆయనే అని ఎన్నో ఆధారాలు కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా చెట్టు పుట్ట పట్టుకుని అదే దేవుడు ఇదే దేవుడు అంటూ జీవిస్తున్న మనుషుల కోసం ఎందుకు ఇంకా ఎదురు చూస్తున్నారు?
ఇన్ని doubts వచ్చాక ఇంకెందుకు ఆలస్యం.. లేఖనాలను పరిశీలించి సత్యాలను తెలుసుకుందాం రండి.
దేవుడు మనిషిని చేశారు!
దేవుడు తన స్వరూపమందు అనగా తన పోలికలోనే మనిషిని సృష్టించాలని నిశ్చయించుకున్న తరువాత, నేలమట్టిని తీసుకుని నరుని నిర్మించి అతని నాసికారంధ్రాలలో జీవవాయువు ను ఊదగా నరుడు జీవాత్మగా మారాడు అని ఆదికాండము 2:7 చెబుతుంది.
యోబు కూడా 33:4 వ వచనంలో "దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవ మిచ్చెను" అని స్పష్టం చేస్తున్నాడు.
అయితే దేవుడు నోటితో నరుని నాసికారంధ్రాలలో తన ఊపిరిని ఊదితే నడయాడే మనిషిగా ఆ మట్టి బొమ్మ మారిపోయింది అని అంటే ఆ ఊపిరి అంత సామాన్యమైనదంటారా? కాకపోతే మరి ఎలాంటిది? అయితే ఊపిరి బిగబట్టి వినాల్సిందే!
1. ఆకాశమహాకాశముల పైనుండి ఆయన కోపంతో తన శ్వాసను గట్టిగా వదిలితే భూమిలో ఉన్ననీటి అడుగు భాగం కనిపిస్తుందట. "యెహోవా తన నాసికారంధ్రముల శ్వాసము వడిగావిడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. 2 సమూయేలు 22:15. "
2. అంతేకాదు ఆయన ఊదితే చాలు మనుషులు పిట్టల్లా రాలిపోతారు. "దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు. యోబు 4:9", "దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు. యోబు 15:30"
3. ఆయన ఊపిరి ఊదితే భూమి మీద మంచుకూడా పుడుతుందట. "దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును. Job 37:10"
4. వీటన్నిటికంటే కూడా గొప్ప సంగతేమిటంటే ఇప్పుడు మనకంటికి కనిపిస్తున్నవి ఇంకా కనపడని ఈ ఆకాశ సమూహములన్నీ కూడా ఆయన నోటి ఊపిరితోనే కలిగాయని కీర్తనాకారుడు అంటున్నాడు. "యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. కీర్తన 33:6"
అయితే మరి మనిషి మట్టి నుండి పుట్టాడు అనడానికి ఋజువేంటి?
- కొత్త శాస్త్రీయ పరిశోధనల ప్రకారం భూమిపై ఉన్న ప్రాణులన్నీ బైబిల్లో తెలియజేయబడినట్లు మట్టి నుండి వచ్చి ఉండవచ్చు అని నమ్మక తప్పడం లేదు. మట్టి ప్రాథమికంగా భూమిలోని ఖనిజాలు, చిన్న చిన్న అణువులు మరియు రసాయనాల పెంపకమునకుఅనుకూలంగా ఉంటూ రసాయనాలు ఒకదానికొకటి స్పందించి ప్రోటీన్లు, డిఎన్‌ఎ మరియు చివరికి జీవకణాలను ఏర్పరుస్తాయి అని శాస్త్రవేత్తలు సైంటిఫిక్ రిపోర్ట్స్ లో చెప్పారు.
- న్యూయార్క్ రాష్ట్రంలోని నానోస్కేల్ Science కోసం కార్నెల్ విశ్వవిద్యాలయం యొక్క బయోలాజికల్ ఇంజనీర్లు మట్టి 'భూమిపై జీవన జన్మస్థలం (అనగా మట్టి నుండి మనిషి తయారు చేయబడ్డాడు) అయి ఉండవచ్చు' అని నమ్ముతారు.

నేలలో ఉండే పోషకాలు మానవశరీర పోషకాలతో సమానముగా ఉన్నాయి అని ఋజువు చేసే కొన్ని పరిశోధనలనుండి సేకరించిన విషయాలు.
ఆయన ఊపిరి యొక్క శక్తిని చూసారా? మన శరీరం అరోగ్యంగా ఉండడానికి ఏది ఎంత అవసరమో ఖచ్చితముగా అమర్చబడ్డాయి. ఇప్పుడు మనకు ఆక్సిజన్ శాతం తగ్గిందనుకోండి అది మనకు ప్రమాద హెచ్చరిక.
పొటాషియం శాతం తగ్గిందనుకుందాం అప్పుడు కూడా ప్రమాదమే. మన రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదకరం. పొటాషియం మన గుండె కండరాలు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు కారణమవుతుంది.
అందువల్ల ఆయన మన శరీరాన్ని లెక్కప్రకారం ఎక్కడాతేడా లేకుండా ఎంత బాగా నిర్మించారో అర్ధమవుతుంది కదా!
ఒక మట్టి ముద్దలోనికి ఆయన గాలి ఊదితే మనిషిగా మారాము కదా. మరి ఒకవేళ ఆ ఊపిరిని ఆయన వెనక్కు తీసుకుంటే ఆ మట్టి ముద్ద తిరిగి మట్టి గా అయిపోతుంది కదా!
మరి అలాంటప్పుడు ఆ మట్టిని మనిషిగా ఎందుకు మార్చారు? ఈ జీవన్మరణ పోరాటం ఎందుకు?
మరణించిన తరువాత మనము మట్టికి చేరిపోవడమే ముగింపా? కాదంటుంది దేవుని వాక్యం.
"ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు. 1 కొరింధి 15:22,23" అంటే మట్టి నుండి మనిషి గా మారిన మనము మట్టిలోకి చేరడం అనగా నిద్రించడం అని అర్ధం. మరి ఆ నిద్ర పనుష్యులు లేపితే లేచేది కాదు గాని యేసయ్య తన దూతలతో పాటు వచ్చినప్పుడు ఆకాశంలో నుండి కడబూర శబ్దం మ్రోగుతుంది. అప్పుడు మెలకువవస్తుంది వాళ్ళకి. ఆ తరువాత మరణం లేని శరీరంతో లేపబడి మహిమ శరీరం పొందుకొని ఆయన ప్రణాళిక ప్రకారం పరలోకంలోకి ప్రవేశిస్తామంట. ఎంత అద్భుతమైన ప్రేమ సంకల్పం.
మన యొక్క మరణం, తిరిగి లేపబడడం, తీర్పు తరువాత పరలోకంలో ప్రభువు తో మరణం లేని సంతోష జీవితం....ఈ ప్రణాళిక వాక్యాలను క్రమ పద్దతిలో ఒకసారి చదువుదామా?
మరణం:
మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆయన వచ్చేటప్పటికి ఇంకా బ్రతికి ఉన్నవారు మహిమ శరీరంగా మార్చబడతారు. "ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 1 కొరింధి 15:51-52."
తీర్పు:
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీ 9:27
ప్రకటన 20:12-15 - 12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.
15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ప్రభువుతో జీవితం:
ప్రకటన 20:11 - మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
21:1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.
2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
అంటే ప్రభువు తమ పోలికలో మనుషులను చేసుకొని వారికి స్వచిత్తమును ఇచ్చి ప్రేమతో తమ రూపులోనికి మార్చుకొని రాజులైన యాజక సమూహము గా చేసి ఆయనతో ఆ నిత్యపరలోకంలో మనము కూడా ఉండాలని ప్రభువు సంకల్పమై ఉన్నది. అందుకనే దేవుడు మనిషిని నోటిమాటతో కాక స్వయంగా తన హస్తాలతో చేసారు. సృష్టిలో దేనికిలేని ఆ గొప్ప ధన్యత నరులమైన మనకు మాత్రమే ఇచ్చారు. పరలోకంలో ప్రవేశించి ఆయనను చూస్తూ, ఆయన మాటలు వింటూ ఆయననే ఆరాధిస్తూ జీవిస్తామంట. కన్నీరు గాని కలతలు గాని లేని యుగయుగముల పరమానందాన్ని మనకు ప్రభువు బహుమతి గా ఇవ్వబోతున్నారంట. హల్లెలూయ!
మనిషి కూడా దేవుడిని చేసాడు!
ఇంత గొప్ప ప్రణాళికలతో దేవుడు మనుషుల కొరకు సమస్తము సిద్దపరుస్తూఉంటే మరి ఆ మనిషి ఏంచేస్తున్నాడు? ఆయన ప్రేమను పక్కన పెట్టి, ఆ పరిశుద్ధుని ప్రణాళికలను విడిచిపెట్టి, ఆయన చేతులలో మనిషిగా మారిన మట్టియైన మానవుడు ఆ మట్టిలోనే దేవుని వెతుకుతున్నాడు. మట్టి బొమ్మను చేసి దేవునిగా ఆరాధిస్తున్నాడు.
నిజానికి... చూడను, వినను, మాట్లాడను శక్తిలేని ఆ మట్టి బొమ్మ కంటే, ఆ మట్టిలోనే పుట్టి ప్రభువు ఊపిరితో ప్రాణం పోసుకున్న మనకే power ఎక్కువ కదా! మరి మట్టిలో, చెట్టులో, పుట్టలో దేవునిని వెదకడం ఎంతవరకు న్యాయం?అనుక్షణం మనలను ప్రేమిస్తూ, తన కంటి పాపలా కాపాడుతూ మనకళ్ల ముందే కనిపిస్తున్న మనకన్న తండ్రిని కాదని వేరే వ్యక్తిని 'నాన్నా' అని పిలవగలమా? ఆలా చేస్తే మన నాన్న గుండె తట్టుకోగలదా? మనిషి అదే చేస్తున్నాడు. ఆయన ఏది చేయవద్దని ఆజ్ఞాపించారో ఖచ్చితంగా దానినే చేస్తూ నరక పాత్రుడౌతున్నాడు. "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. నిర్గమ కాండము 20:3-4."
- కొంతమంది వారు చేస్తున్న పనిని దేవుడుగా భావిస్తారు.
- మరికొంతమంది వారి కడుపే వారి దేవుడిగా భావించి దానిని తృప్తి పరచడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు.
- చాలా మంది వారి ధనమే వారి దేవునిగా భావిస్తారు. కష్టపడి పని చేసి మనం బ్రతకడానికి డబ్బులు సంపాదించుకోవచ్చు గాని దానినే దేవుడు అంటే అది బుద్దిహీనత.
- కొంత మంది వారు ఇతరులకు చేస్తున్న సహాయాన్ని బట్టి వారిని దేవునితో పోల్చుకుంటారు, అది కూడా correct కాదు. ఆయనను పోలి జీవిస్తూ ఆయన వెలకట్టలేని ప్రేమను ఇతరులకు చూపించాలి గాని, అక్కడా ఇక్కడా దేవునిని చూపించే ప్రయత్నం చేయకూడదు.
- మనపనిని ప్రభువుగా భావించకూడదు గాని, ప్రభువు కోసం పనిచేయాలి.
- ప్రతి పనిని, ఇతరులకు చేసే సహాయాన్ని ప్రభువుకు చేసినట్లే చేయాలి. తండ్రి మనలను ప్రేమించనట్లే మనము కూడా మనపొరుగువారిని ప్రేమించాలి.
ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.. 2 కొరింధి 5:8,10
మనము దేవుని స్వహస్తాలలో మట్టినుండి ఎందుకు నిర్మించబడ్డామో స్పష్టముగా అర్ధమైపోతుంది కదా! తండ్రి మట్టి నుండి మనిషిని చేసి అతనిని ఎంతో ప్రేమించి నిత్యము తనతో పాటు పరలోకంలో జీవించాలని మన కొరకు తన అనాది సంకల్పం చొప్పున ప్రణాలికను సిద్ధం చేసారు.
ఈ విషయాన్ని గ్రహించిన మనము ఏంచేయాలి? ఈ మట్టి ఒకదినాన మహిమ దేహముగా మార్చబడి ఆయన మనకొరకు సిద్ధపరచిన పరలోక ప్రవేశము కొరకు ఆశతో కనిపెట్టుచూ ఈ క్షణబంగురమైన జీవితం కోసం కాక "నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము" అని పౌలు చెప్పినట్టు మనము కూడా ఆబాటలోనే నడుద్దామా? తప్పకుండా నడుద్దాం.
కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
లేఖనాలలో ఇన్ని గొప్ప సంగతులను మనకోసం దాచిపెట్టిన ప్రభువునకు కీర్తనాకారుడితో పాటు మనము కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అంశాన్ని ముగించుకుందాము.
తండ్రీ....
నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
పై అంశమునకు సంభందించిన వచనాలన్నిటిని క్రింద ఇస్తున్నాను గమనించండి. మీరు కూడా ధ్యానము చేసి ప్రభువులో పరవశించి సర్వ సత్యములోనికి నడవాలని ఆశ పడుతున్నాను.
1. ఆదికాండము 1:26; 2:7; 6:6
2. 2 సమూయేలు 22:15
3.యోబు 4:9; 12:10; 15:30; 37:10; 14:3; 27:1-2; 32:8; 33:4; 34:14; 42:2
4. కీర్తన 18:15, 19; 22:10, 25:14; 28:5; 31:5;33:6 37:23; 68:20; 78:39; 135:17; 139:13-16
5. యెషయా 11:4; 30:28; 30:33; 42:5
6. యిర్మియా 1:5; 10:14; 11:20
7. యెహెఙ్కేలు 37:5
8. జెకర్యా 12:1
9. మలాకి 3:17.
10. అపొస్తలుల కార్యములు 17:25
11.1 పేతురు 2:9
12. 2 థెస్స 1:8
13. ప్రకటన 11:11; 2:10, 23