15, నవంబర్ 2020, ఆదివారం

6. పనిముట్లు ( Part 1)

ప్రియమైన స్నేహితులారా, 

మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. 

ఈ Topical studies ద్వారా మీ వాక్య అధ్యనానికి నేను కొంతవరకు సహాయపడగలుగుతున్నానని నమ్ముతూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రభువు కృప మీకు తోడై ఉండును గాక.
లేఖనాలలోని కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ  ఉంటాయి. అదే సమయంలో మనకు పాఠము కూడా  నేర్పిస్తుంటాయి.  దేవుడు మనుషులమైన మనలను ఎంతో ప్రేమించి మన కొరకు ఆయన చేసిన ప్రణాళికలను గురించి గత topics లో  తెలుసుకున్నాము.  అందులో ఈ సృష్టిని కూడా మనకోసమే చేసి దానిని ఏలమని చెప్పారు.  దేవుడు మనిషిని సృష్టించి వానిని తన రాజ్యములో చేర్చుకోవాలని తలంచినప్పుడు, బుద్ది పూర్వకముగా పాపము చేసిన మనిషిని తిరిగి బుద్ది పూర్వకంగానే   తన రూపులోనికి మార్చుకోవడానికి ఆ సర్వశక్తిమంతుడు ఈ సృష్టినే తన పనిముట్లుగా వాడుకున్నారు. ఆయన రూపులోనికి మారిన మనుషులను కూడా తన పనిముట్లుగా వాడుకుంటారు. 
ఆయన చేతులలో వాడబడాలంటే ఆ పనిముట్టు జీవము గలదియే కానక్కరలేదు. మహాఘనత కలిగినదే అవ్వనక్కరలేదు.  ఆయన వాడుకోవాలి అని అనుకుంటే దేనినైనా ఎవరినైనా వాడుకోగలరు,  అదేవిధంగా అయన చేతిలో వాడబడితే  ఎలాఉంటుందో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం.

ఈ topic లో ప్రత్యేకించి ప్రకృతిని ప్రభువు పనిముట్లుగా ఎలావాడుకున్నారో, అవి ఆయన మాటకు ఏవిధంగా లోబడ్డాయో లేఖనాల నుండి మరియు నాకు లభించినంతవరకు చారిత్రక ఆధారాలతో మీముందు ఉంచడానికి ప్రయత్నము చేస్తాను. 
మొదటగా ఎఱ్ఱ సముద్రంతో ప్రారంభిద్దాము. 
1. ఎఱ్ఱ సముద్రం
  • ఎర్ర సముద్రం  పొడవు సుమారు 2250 కిమీ (1398 మైళ్ళు), 
  • వెడల్పు 355 కిమీ, 
  • లోతు (గరిష్ట) 8,200 అడుగులు (2,500 మీ) మరియు సగటు లోతు 1,640 అడుగులు (500 మీ).   
మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా సముద్రము రెండు పాయలుగా చీలి ఆరిననేల మీద ఇశ్రాయేలు జనాంగము నడిచివెళ్ళారని మనకు తెలుసు. (నిర్గమ కాండము 14:16-22) అయితే ఈ సంఘటనని (అద్భుతాన్ని) కాస్త లోతుగా ఆలోచిస్తే ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తున్నాయి. 
అంతేకాకుండా ఆ గొప్ప కార్యము జరగడానికి  ఎన్ని పనిముట్లు వాడబడ్డాయో జాగ్రత్తగా ఆలోచిస్తే దేవున్ని స్తుతించకుండా ఉండలేము.
దేవుడు చెప్పినట్లుగా "మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నిర్గమ కాండము 14:22" అని వాక్యం చెబుతుంది.
  • అంటే మోషే చెయ్యి చాపడానికి ముందే దేవుడు "గాలి" ని పిలిచి దానికొక వేగాన్ని నిర్ణయించి ఎర్ర సముద్రము విభాగింపబడి అక్కడ కనిపిస్తున్న ప్రదేశము పొడి నేలగా అయిపోవాలి కాని నీ వేగము అక్కడే ఉన్న నా జనాంగానికి  ఏమాత్రం ఇబ్బంది కలిగించ  కోడదు అని చెప్పిఉంటారు.  
  •  తరువాత దేవుడు 8,200 అడుగులు (2500 మీటర్ల) లోతులో ఉన్న సముద్రము గడ్డకట్టి ఆరిన నేలగా మారిపోవాలి అని అంటే అది భూమికి సమాంతరముగా ఆరిన నేల కనబడాలి అనగా  దేవుని ప్రజలు మైదానము మీద నడిచినట్లుగా ఒడ్డు నుండి చీలిన సముద్ర మార్గముగుండా వెళ్ళాలి. "నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను." నిర్గమకాండము 14:22      "నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను" నిర్గమకాండము 15:8. అది ఖచ్చితముగా జరిగిన నట్టు వాక్యం నిర్దారిస్తుంది. 
  • సముద్ర్రాన్ని పిలిచి గాలి నిన్ను కలవరపెట్టినప్పుడు రెండుగా చీలిపోవాలి. అటు ఇటు రెండు గోడల వలె రాసిలా నిలబడాలి అన్నారు. అంటే ice గడ్డలా అయిందనమాట. అలాంటప్పుడు ప్రజలు చలిలో నడవలేరుకదా అందుకని వెచ్చదనం పుట్టించే "అగ్నిస్తంభం" వారితోనే ఉంది.
  • మరలా దేవుడు సముద్రపు నీరు యధాస్థితికి రమ్మనిచెప్పిన ఖచ్చితమైన సమయానికి అది వెనక్కు రావాలి.
అంతలో యెహోవా మోషేతో-ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నిర్గమ కాండము 14:26,27. 
చారిత్రక ఆధారాలు:
Chariot Wheels in the Red Sea
(first published in newsletter # 3 in 1993)

పురావస్తు శాస్త్రఘ్నుడైన Ron మరియు అతని team వారు 1978వ సంవత్సరంలో Gulf of Aqaba లో dive కి వెళ్లినప్పుడు పగడపు మొక్కలతో(Coral) కప్పబడిన రధాల యొక్క అవశేషాలను కనుగొన్నారు.  పగడపు మొక్కలతో (Corals) కప్పబడి ఉండడం వలన యెంతో కష్టతరం అయినప్పటికి వారు అనేక చక్రాలను కనుగొన్నారట. అందులో కొన్ని ఇప్పటికీ వాటి ఇరుసులపై మరికొన్నిభూమిలో దిగబడి ఇంకా చక్రాలు లేని రధాల క్యాబ్లు ఉన్నాయట. అందులో అనేకమైన 6-spoked wheels మరియు 8-spoked wheels ఉన్నాయని ఆ పరిశోధకులు చెబుతున్నారు.
తరువాత 1988 లో, రాన్ దాదాపుగా స్పష్టంగా కనిపిస్తున్న 4-స్పోక్డ్ బంగారు రథ చక్రంను కనుగొన్నాడు, పగడపు మొక్క బంగారంపై పెరగక పోవడమే ఇది బాగా సంరక్షించబడటానికి కారణం అయ్యింది అని వివరించాడు. మొత్తం ఆ చక్రాలన్నిటిని రాన్ Cairo లోని  అతను పనిచేస్తున్న పురాతన వస్తువుల డైరెక్టర్ నాసిఫ్ మొహమ్మద్ హసన్ కార్యాలయానికి తీసుకువెళ్ళాడట. మిస్టర్ హసన్ పరిశీలించి, వెంటనే దీనిని పురాతన ఈజిప్ట్ యొక్క 18 వ రాజవంశంది అని ప్రకటించారు. రాన్ అతనిని ఇంత సులభంగా ఎలా తెలుసు అని అడిగినప్పుడు, మిస్టర్ హసన్ 8-స్పోక్డ్ వీల్ 18 వ రాజవంశంలో మాత్రమే ఉపయోగించబడిందని వివరించాడు.
ఈ ఆధారాలన్నిటిని బట్టి ఎర్రసముద్రం పాయలుగా చీల్చబడిన సంఘటన ఖచ్చితముగా జరిగినదని వాక్యం తెలియక పోయినప్పటికి నమ్మసఖ్యముగా ఉండవచ్చు.  కాని మనకైతే మన సర్వశక్తుడైన దేవుడు వీటన్నిటిని చేయగల శక్తిమంతుడని మనకు తెలుసు. లేనివాటిని ఉన్నట్టుగా పిలువగల సమర్ధుడని మనకి తెలుసు.  
దేవుడు 6 లక్షలకు పైగా ఉన్న  తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా ఆరిన నేల మీద నడిచి వెళ్లాలంటే,  తన ధర్మానికి విరుద్ధంగా లేచి నిలువబడి ఆయన చిత్తం అంతటిని నెరవేర్చిన గొప్ప పనిముట్టుగా  ఈ ఎఱ్ఱసముద్రం వాడబడింది అని మనకి స్పష్టముగా అర్దమవుతుంది కదా! 

2. మోషే చేతి కర్ర.  
ఇశ్రాయేలు జనాంగమునకు నాయకత్వము వహించడానికి దేవుడు మోషేను పిలిచి అతని చేతి కర్రను వాడుకొని అతనిలో విశ్వాసపు పునాదులు వేసారు. 

 యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను. అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.
అప్పుడు యెహోవా-నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.  నిర్గమ కాండము 4:2-4
1. ఆ తరువాత నుండి అది దేవుని కర్రగా పిలువబడింది. ఆయన చేస్తున్న ప్రతిఅద్భుతానికి ఆ కర్రను ఒక పనిముట్టు గా వాడుకొని ఏమాత్రం శక్తి బలములు లేని ఒక చేతి కర్ర పైకెత్తినప్పుడు,  అలాగే  దేనినైన ముట్టినప్పుడు అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించారు.  "మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను. నిర్గమ కాండము 4:20".
2. ఇశ్రాయేలియులకు అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు మోషే దేవుని కర్రను కొండ మీద నుండి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. "రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను. నిర్గమ కాండము 17:9".
3. దేవుడు చెప్పినట్టు మోషే తన చేతి కర్రతో ధూళిని కొట్టినప్పుడు ఆ ధూళిఅంతా పేలుగా మారిపోయాయి.  "అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. నిర్గమ కాండము 8:16"
4. మరలా ప్రభువు ఆజ్ఞతో ఐగుప్తు దేశము మీద కర్రను చాపగా దేవుడు ఆదేశము మీదకు మిడతలను రప్పించారు. "మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. నిర్గమ కాండము 10:13".
5. దేవుడు మరలా మోషేను పిలిచి హోరేబులోని బండను కొట్టమనగా, అతను ఆవిధంగా చేయగానే ఆ బండలోనుండి నీరు ఉబికి వచ్చినట్టు మనకు తెలుసు. "అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేత పట్టుకొని పొమ్ము.  ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.నిర్గమ కాండము 17:5".
ఇక్కడ జరిగిన కార్యములన్నీ చేసింది ప్రభువే అయినప్పటికీ ఆయన మోషే చేతిలో ఒక చిన్నకర్రను తన పనిముట్టుగా వాడుకున్న విధానం నిజంగా ఆశ్చర్యమే.

3. గార్దభము 
దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమును శపించాలని మోయాబు రాజైన బాలాకు, ప్రవక్త అయిన  బిలాము ను పిలిపించగా అతఁడు దానికి సిద్దపడి వెళ్తున్నప్పుడు దేవుడు గాడిదకు మానవ స్వరం ఇచ్చి అతనికి బుద్ధిచెప్పారు.
అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అదినీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా సంఖ్యాకాండము 22:28,31

2 పేతురు  2:16. ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.

ఈ ప్రవక్త కు బుద్ది చెప్పడానికి గాడిదను దేవుడు ఒక పనిముట్టుగా వాడుకొని అతనితో మాట్లాడారు.

4. సూర్యుడు మరియు చంద్రుడు 
దేవుడు మనకొరకు సూర్యుడిని చంద్రుడిని చేసి పగటిని మరియు రాత్రిని ఏలమని అప్పగించినప్పటి నుండి ఇంతవరకు దేవుని చేతిలో పనిముట్లుగా అవి వాడబడుతూనే ఉన్నాయి. ఆయన ఉద్దేశమును నెరవేరుస్తూనే ఉన్నాయి.  - ఆదికాండము 1:14,15
యెహోషువ అమోరీయులతో యుద్ధమునకు దిగినప్పుడు వారు ఓడించవలసిన శత్రువులు ఇంకా మిగిలిఉన్నప్పుడు యెహోషువ దేవునికి ప్రార్ధన చేసి సూర్యచంద్రులతో మాట్లాడి మీరు ముందుకి వెళ్లొద్దు అని చెప్పినప్పుడు,  దేవుడు అతని ప్రార్ధన అంగీకరించి వాటిని కదలవద్దని ఆజ్ఞాపిస్తే అవి ఒక రోజంతా అలాగే కదలకుండా ఉండిపోయాయంట. దీనికి సంబంధించిన పూర్తి వివరణ "4. సూర్యుడు(నీతి సూర్యుడు)" అనే article లో చారిత్రక ఆధారాలతో సహా వివరించబడ్డాయి.

 యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.  సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోషువ 10:12, 13

5. గాడిద దవడ ఎముక 
దేవుడు సమ్సోను ను ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నియమించిన దినములలో అతనిని ఫిలిష్తీయులు చంప నుద్దేసించినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగి రాగా అతడు గాడిద పచ్చిదవడ యెముక తీసుకొని వెయ్యి మందిని చంపి యెహోవా నాకు విజయము కలుగజేసెను అని కొనియాడాడు.
  అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను. అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టి నీవు నీ సేవకుని చేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత... న్యాయాధిపతులు 15:15-18

దేవుడు సమ్సోనును కాపాడి తన ప్రజలకు రక్షణ కలుగజేయడానికి ఇక్కడ గాడిద దవడ యెముకను పనిముట్టుగా వాడుకున్నారు.

6. దావీదు వదిసెలలో రాయి
ఫిలిష్తీయులు ఇశ్రాయీలీయులతో  ఏలా లోయలో 
యుద్దమునకు దిగినప్పుడు వారిలోనుండి గొల్యాతు అనబడే ఒక శూరుడు పైకివచ్చి, జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించి దూషిస్తూ ఉండగా దానిని గమనించిన దావీదు సౌలు యొక్క అనుమతితో ఆ ఫిలిష్తీయుని సమీపించి, సైన్యములకు అధిపతియైన యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను, ఆయన కత్తిచేతను ఈటెచేతని రక్షించువాడు కాడు.. యుద్ధం  యెహోవాదే అని చెప్పి తనకర్ర చేతపట్టుకొని ఏటిలోయలోనుండి ఐదు నున్నని రాళ్ళను ఏరుకొని అందులో ఒకటి తీసుకొని వడిసెలతో విసరి ఆఫిలిష్తీయుని నుదుటి మీద కొట్టగా ఆ రాయి అతని నుదురులోనికి దూరి అతడు నేలను బొర్లపడి చనిపోయెను.
 ఒక చిన్న రాతితో ఒక బలవంతుని చంపడం సాధ్యమేనా? ఆ రాయి దేవుని చేత ఆజ్ఞపొందితే, ఆయన చేతిలో పనిముట్టుగా మారితే.. అది ఖచ్చితముగా సాధ్యమే.

సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను. 1 సమూయేలు 17:37
తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. 1 సమూయేలు 17:49

7. కాకులు
 యెహోవా కొరకు మహారోషముకలిగి యెహోవా ప్రవక్తగా పిలువబడిన ఏలియాను ప్రభువు పిలిచి తాను ఉన్న
 చోటునుండి బయలుదేరి యొర్దాను యెదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసముచేయమని చెప్పారు. మరి అతనికి ఆహారము? దానికి ఆయన దగ్గర ఒక plan ఉంది.  
తన సేవకుడైన ఏలియాకు ఆహారం పెట్టడానికి దేవుని చేతిలో వాడబడిన పనిముట్లు ఏమిటో తెలుసా?  ఏలియాకు రెండు పూటలా  సమృధ్దిగ రొట్టెను, మాంసమును తెచ్చి ఇవ్వడానికి తిండిలేక తిరుగులాడుచు ఉండే కాకోలములకు (కాకులు) దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. 1 రాజులు 17:6
ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా 1 రాజులు 17:4
వాటికే తిండిలేక ఎక్కడ ఆహారము దొరుకుతుందా అని కావ్ కావ్ మని అరుచుకుంటూ తిరిగే కాకులకు రెండుపూటలా ఏలియా కోసం రొట్టె  మాంసము యెక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికినా ఏలియాకు తెచ్చి ఇస్తాయా? 
ఖచ్చితముగా ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు  ఆ కాకులు ఏలియాకి భోజనం పెట్టడానికి దేవుని చేతిలో వాడబడిన పనిముట్లు. 
ఆహారమును చూడగానే వాటికి తినాలనిపించినా అవి తినవు. ప్రభువు చిత్తమును నెరవేర్చిన తరువాత ఆయనే వాటికి తగిన ఆహారం పెడతారని వాటికి తెలుసు.
తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? యోబు 38:41
 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. కీర్తన 147:9
కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిన పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. లూకా 12:24
ఈ సందర్బాలన్నీ మనకు చిన్నప్పటినుండీ తెలిసినవే అయినప్పటికి వాటిని మరలా మరలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు 
జీవం లేని కర్ర, విశ్వాశం అంటే తెలియని జీవులనే దేవుడు మనకు సహాయం చేయడానికి ఇంకా ఆయన చిత్తమును గ్రహించడాని పనిముట్లుగా వాడితే మనల్ని ఇంక ఎక్కువగా వాడుకోవచ్చుకదా. 
ఆయన చేతి పనులను గురించి ధ్యానం చేసినప్పుడు  మనము ఆయన ప్రేమను గ్రహించి ఆయనయందు విశ్వాశంలో బలపడతాము అదే  ఆయన ఉద్దేశం. 

దేవుని మాటకు లోబడి ఆయన పనిముట్లు గా వాడబడిన మరికొన్ని పనిముట్లను  తరువాతి article లో ధ్యానించుకుందాం. 

ఇంతవరకు ఇవ్వబడిన పనిముట్లకు సంభందించిన వచనాలను క్రింద ఇస్తున్నాను గమనించండి.

1. ఆది కాండము:   3:14; 9:10; 1:14,15
2. నిర్గమకాండము:   4:2-3,20; 17:9; 14:16-22; 15:5,8,19,25; 10:12
3. సంఖ్యాకాండము:   22:23,28,31
4. ద్వితియోపదేశకాండము:  29:5
5. న్యాయాదిపతులు:  15:15
6. 1 సమూయేలు :  17:37,49
7. 1 రాజులు:  17:6
8. 2 రాజులు :  10:9
9. కీర్తన 106:9

Please visit my website for a list of all topics. 
Website: http://biblestudynavigator.ml/
Mail id: jyothsnamedidhi@gmail.com

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...