ప్రియమైన స్నేహితులారా,
మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సందర్భంలో నేను ఒక విత్తనాన్ని తీసుకొని ఇంత చిన్న విత్తనం మహావృక్షంలా యెలా మారిపోయింది? అనే ఆలోచనలో పడ్డాను. అది దేవుని కార్యమని తెలుసు కాని ఆవిత్తనంలో జరిగిన మార్పు ఏమై ఉంటుంది? automatic గా అంతా జరిగిపోయిందా?
లేదే! జాగ్రత్తగా చూస్తే అది పగిలింది. ఇంకా చెప్పాలంటే చచ్చిపోయింది. ఒకవేళ విత్తనం నేను నేనుగానే వుంటాను అని అనుకుంటే మనకు చెట్టేది.. ఫలమేది? విత్తనం భూమిలోకి వెళ్ళాలి అది పగలాలి అంటే చావాలి అప్పుడు అది మొలకగా మారుతుంది. అది మొక్కై చెట్టై ఫలాలనిస్తుంది. ఇది మనకు తెలియని విషయం కాదు గాని ఈ సందర్భాన్ని మన జీవితానికి అన్వయిస్తూ యేసయ్య యెన్నోసార్లు యెందుకు చెప్పారో ఇప్పుడు బాగా అర్ధమవుతుంది. "యోహాను 12:24 గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును."
"1 కోరింథీయులకు 15:36. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా."
- మనం మారాలి. యెప్పటిలాగే ఉంటే ఏం ఉపయోగం. పర్వాలేదులే అని అనుకుంటే మనవల్ల పెద్ద ప్రయోజనం ఏముంది నాటని విత్తనంలాగ.
- ఎన్నో సంవత్సరాలు మనల్ని దాటి వెళ్లి పోతున్నాయి. కాని మన ప్రయాణం యెప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు అలాగే ప్రభువు రాకడ యెప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. మరి అలాంటప్పుడు మనం ఎప్పటిలాగానే ఉండిపోకుండా ప్రభువు మనకు అవకాశం ఇచ్చినకొలది ఆయన అడుగు జాడలలోనికి మహోన్నతుడైన సర్వశక్తుని నీడలోనికి చేరిపోయి మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో అవసరం కదా!
- విత్తనంగా ఉన్నప్పుడు దానికేమి అవసరం లేదు. కాని అది తన రూపం మార్చుకున్నప్పుడు మాత్రం సంరక్షణ కావాలి. నీరు, యెండ మరియు సరియైన నేల. మనం కూడా పూర్వపు స్థితిలోనే ఉంటే ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకున్నప్పుడు ఏది చేసిన తప్పు అనిపించదు. అలాగే సంతోషం కూడా ఉండదు. ఫలం ఉండదు. ఇంకా చెప్పాలంటే దాని వల్ల ఉపయోగం కూడా ఏమాత్రం ఉండదు.
- అలాగే మనం కూడా మన రూపం మార్చుకుని క్రీస్తు రూపులోనికి మారినప్పుడు ఈ నిరాశ జీవితం ఉండదు. నిరీక్షణలో ఉండే ఆనందం అర్ధమవుతుంది. ఆయన సహవాసంలో ఆయన కనుసన్నలలో మనం ఉంటే నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు లాగా ఫలించే ద్రాక్షావల్లిలాగా ఊరెడి నీటి బుగ్గగాను ఉంటామట. మొక్కకు మాదిరిగానే మనకు కావలసిన సంరక్షణ... ప్రభువుతో మాట్లాడటం ముఖ్యంగా ఆయన మాటవినటం అంటే ప్రార్ధన మరియు వాక్య ధ్యానం.
- నిజమే కదా ఆయన సహవాసంలో చాలా సంతోషంగా ఉంటుంది. ఈ లోకంలో యెన్ని ఉన్నా లేకపోయినా ఆయన మాట్లాడితే చాలు అనిపిస్తుంది కదా! ఎందుకంటే కష్టంలో కన్నీటిలో ఒంటరితనంలో ఆదుకునేది ఆదరించేది తనకౌగిటిలో హత్తుకునేది ఆయన మాత్రమే. ఈజీవితం మీద అలాగే అది ముగిసిన తరువాత కూడా భరోసా ఇచ్చేది ఆయన మాత్రమే.

- దేవుడు మనకి మరో సంవత్సరం అనే అవకాశాన్ని ఇచ్చారు. బహుశ కొంతమందికి ఇది చివరి అవకాశం కావచ్చు. కళ్ళుమూసుకుని పరిపూర్ణ విశ్వాసంతో ఆయన అడుగుజాడలలో నడిచి వెళ్ళిపోదాం. "యోహాను 12:26. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును"

- నేను గతజీవితంలోలాగా ఉండను అనుకున్న రోజున దాని పేరు ఇక విత్తనం అనబడనట్లుగానే మనలో మార్పు ప్రారంభమయి ప్రభువు సారూప్యంలోనికి కొంచెం కొంచెంగా మారిపోతాం... అలాగే మారిపోదాం. "1 కొరింధి15:38. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు."

- అలాప్రభువు రూపులోనికి ఆయన అడుగుజాడలలో ఆయన బిడ్డగా మారిపోయిన రోజున ఆయన లక్షణాలతో ఎదుగుతాం. ఫలిస్తాం. మనలాంటి ఆనేకమందికి ఫలభరితంగా మారిపోతాం. "2 కొరింధి 9:10 విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును."
- ఇప్పటికే మనలో అనేకమంది ఆయన అడుగుజాడలలో నడుస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇకమీదట జీవించేది గతంలోఉన్న నేనుకాను... నేను నాలా ఆలోచించను.. నాలా మాట్లాడను.. నాలా ప్రేమించను.. నాలా బద్దకించను.. నాలా భయపడను... నాలా ఆగిపోను... నాలా వెళ్ళిపోను... నాలా అసలు ఉండనే ఉండను. ప్రభువా నీలా నీ బిడ్డలా నీకొరకే... నన్ను మార్చు... అచ్చం నీలా... అని ఒకమంచి నిర్ణయం తీసుకుంటే ఇది ఖచ్చితంగా మనకు Happy New Year.
జీవించునది నేను కానని నాయందు క్రీస్తే జీవించునని బ్రతుకుట క్రీస్తే చావయితే లాభమని పౌలు పలికినట్లు పలికే సమయమిదే.
"గలతియులకు 2:20 నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను."
తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పౌలు అంటున్నాడు.
I Wish You All a BLESSED NEW YEAR. May God Be with YOU.