18, డిసెంబర్ 2020, శుక్రవారం

7. పనిముట్లు (Part 2)

 ప్రియమైన స్నేహితులారా, 

ఆకాశమందున్ననక్షత్రరాశులను పేర్లు పెట్టి  పిలిచే దేవుడు,  తన నోటి మాటతో సమస్తాన్ని సృజించిన ఆ సర్వశక్తిమంతుడు,  తన   దృష్టికి  ఏమి లేనట్టుగా  ఉండే  దూళిని  తీసుకుని  మట్టిముద్దగా చేసి ప్రాణంపోసి అతనిని ప్రేమించి తనతో పాటు ఆ నిత్య  పరలోకంలో  జీవించాలని  సంకల్పించి  జాగ్రత్తగా  కాపాడుతూ,   బుద్ధినేర్పిస్తూ,   బలవంతంగా  కాక   ప్రేమతో ఇష్టపూర్వకముగా తనదగ్గరకు  రావాలని  చేసే  ప్రయత్నంలో  ఎన్నో  వస్తువులు,  జీవులు,  అనేకమంది విశ్వాసులు ఆయన చేతిలో   పనిముట్లుగా,  బలమైన  సాధనాలుగా  వాడబడిన   విధానాలను   మనం   ధ్యానం  చేసుకుంటున్నాము.  ఆ  క్రమంలో మరికొన్ని పనిముట్లను దివ్యగ్రంధం లో  వెతుకుదాం రండి.  

పనిముట్లు ( Part 1 - https://bit.ly/34tOlS7 ) లో మనము ధ్యానము చేసిన రీతిగా 1. ఎఱ్ఱ సముద్రం, 2. మోషే చేతి కర్ర.  3. గార్దభము 4. సూర్యుడు మరియు చంద్రుడు 5. గాడిద దవడ ఎముక 6. దావీదు వదిసెలలో రాయి 7. కాకులు అనునవి చాలా పాటాలను మనకు నేర్పిస్తున్నాయి కదా, అదే విధంగా ప్రభువు చేతిలో వాడబడిన మరికొన్ని పనిముట్ల గురించి ధ్యానం చేసుకుందాం. 

8. సింహాలు

 రాజైన దర్యావేషు పరిపాలన చేస్తున్న కాలములో దానియేలును ఒక ప్రధానమైన ఉద్యోగములో నియమిస్తారు.  అయితే ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్దికలిగి ప్రధానులలోను, అధిపతులలోను ప్రఖ్యాతినొంది ఉండటంవలన రాజ్యమంతటికి పైగా అధికారిగా నియమించాలని రాజు ఉద్దేశ్యం కలిగి ఉంటాడు. అక్కడ ఉన్న అధిపతులందరికి ఆ విషయం నచ్చక అతనిమీద నిందమోపడానికి ప్రయత్నం చేస్తారు. కాని ఈ దానియేలు నమ్మకస్తుడుగా ఉండి నేరమయినను తప్పయినను చేయువాడుకాడు గనుక అతనిలో లోపము వారికి దొరకలేదు.  కాబట్టి దేవుని విషయములో అతనిమీద తప్పుమోపడానికి అలోచన చేస్తారు. 

వారు ఒక చెడ్డ అలోచన రాజగు దర్యావేషుకు చెప్పి అతని అనుమతి తీసుకుంటారు. అది ఏమిటంటే 30 రోజులపాటు ఆ రాజు దగ్గర తప్ప ఏ మనుష్యుని దగ్గరగాని దేవుని దగ్గరగాని మనవి చేయకూడదు మరియు ప్రార్ధన కూడా చేయకూడదు.  ఒకవేళ అలా చేస్తే వాళ్ళు సింహపు బోనులో త్రోయబడతారు.  అయితే ఆవిషయం తెలిసినప్ప్పటికి కూడా దానియేలు యధాప్రకారముగా ప్రతిదినము 3 సార్లు మోకాళ్ళూని తన దేవునికి ప్రార్ధన చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ అధికారులు దీనిని అవకాశంగా తీసుకొని రాజుకి ఇష్టము లేకపోయినప్పటికి ముందుగా తీసుకున్న రాజాజ్ఞ ప్రకారం దానియేలుని  సింహపు బోనులో వేయిస్తారు.

అయితే రాజు అనుదినము తప్పక సేవించుచున్న నీదేవుడే నిన్ను రక్షించునని  దానియేలుతో  చెప్పి  ఆరాత్రంతా  ఉపవాసము ఉండి నిద్రపట్టక  తెల్లవారుజామునే    బయలుదేరి   గుహ  దగ్గరికి   చేరి దానియేలుని   పిలిచినప్పుడు   దానియేలు   పలుకుతాడు. జీవముగల దేవుడు నిన్ను రక్షించాడా  అని రాజు    అడిగినప్పుడు దానియేలు ఏమన్నాడో తెలుసా... నా దేవుడు తన దూతను పంపి సింహపు నోళ్లను   మూయించారు  అని అంటాడు.   అప్పుడు రాజు దానియేలు ను సింహాల బోనులో వేయించమని పురికొల్పిన అధికారులను వారి  కుటుంబాలతో  సహా  అదే  సింహపు బోనులో  వేయగానే  ఆ  శరీరాలు  నేలను  పడకముందే  వారందరిని  తినేస్తాయి. సింహములు  వారి    యెముకలను సహితము పగులగొరికి పొడిచేసాయంట.   "నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు  ఏహానియు  చేయకుండ వాటి నోళ్లు మూయించెను.  రాజా,  నీ  దృష్టికి  నేను  నేరము చేసినవాడను కాను గదా అనెను. దానియేలు 6:16".

దానియేలు యొక్క  evidence ప్రకారం యెహోవా దూత దిగివచ్చి దేవుని సేవకుడైన దానియేలు వస్తున్నాడు గనుక మీరు నోరు తెరిచి అతనిని ముట్టకూడదు అని చెప్పిఉంటాడు. దేవుడు ఇప్పుడు నోరుతెరవవద్దని చెప్పారు కదా! మరి ఆకలేస్తే ఎలా?   తగిన కాలంలో మరలా ఆయన సమృద్ధిగా ఆహరం పెట్టగల సమర్థుడని ఆ సింహాలకు తెలుసు గనుక కళ్ళముందు ఆహారం కనిపిస్తున్నా రాత్రంతా నోరుతెరవలేదు.  ఆయన ఆజ్ఞ వచ్చినప్పుడు మాత్రమే తెరిచాయి. దేవుని మాటకు లోబడడం అంటే అలా ఉండాలి. దానియేలుకున్న విశ్వాసాన్ని దేవునితో అతనికున్న సహవాసానికి  నిదర్శనంగా ఇక్కడ సింహాలు దేవుని చేతిలో పనిముట్లుగా వాడబడ్డాయి. దానియేలు వాటి దగ్గర ఉన్నంతసేపు నోరు తెరవవద్దు అన్నారు అవి ఆయన మాటకు లోబడ్డాయి.

 9. ఎండిన ఎముకలు

దేవుడైన  యెహోవా  ఇశ్రాయేలు  జనాంగమును  వారి  పితరులకు  వాగ్దానము  చేసిన  రీతిగా  వాగ్దాన  దేశమునకు నడిపించనుద్దేశించినది మొదలు వారికి యెన్నో అద్భుతాలు  కనబరుస్తూ  వారిని కంటి పాపలా కాపాడుతూ  కనాను దేశములో యెంతో సమృద్దితో పోషించినప్పటికీ ప్రభువును విస్మరించి అన్యసహవాసమునకునూ విగ్రహములకునూ లోనై నాశనమైన ఇశ్రాయేలు జనాంగమునకు తండ్రి తన ప్రేమను కనబరచడానికి ఇక్కడ యెండిపోయిన వెముకలను పనిముట్లు గా వాడుకున్నారు.

దేవుడు యెహెజ్కేలును పిలిచి యెండిపోయిన యెముకలతో నిండిన ఒక లోయలో అతనిని దింపి ఈ యెండిన ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగినప్పుడు అది నీకేతెలియును ప్రభువా అని అంటాడు. అప్పుడు ఆయన యెండిపోయిన ఎముకలమీద ప్రవచించి వాటితో మాట్లాడమని చెప్పారు. అప్పుడు యెహెజ్కేలు యెండిపోయిన యెముకలారా, నరములనిచ్చి మీమీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను  మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ప్రభువు చెప్పుచున్నాడని యెహెజ్కేలు అంటూ ప్రవచించు చుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుంటూ అతను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చి, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేదు. అప్పుడు దేవుడు మరలా వాటిలోకి జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము అని యెహెజ్కేలుతో చెప్పినప్పుడు, యెహెజ్కేలు,  ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము అని  ప్రవచింపగానే జీవాత్మ వారిలోనికి వచ్చి వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి..

అప్పుడాయన యెహెజ్కేలుతో, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండి పోయెను,   మన   ఆశ    విఫలమాయెను,    మనము    నాశనమై    పోతివిు   అని  అనుకొనుచున్నారు  గదా,  ఇప్పుడు  నేను  యెహోవానై   యున్నానని  మీరు తెలిసికొందురు,  మీరు   బ్రదుకునట్లు  నా   ఆత్మను  మీలో  ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు  తెలిసికొందురు అని యెహోవా వాక్కు ఇచ్చి యెహెజ్కేలు ద్వారా  వారికి  ఇంత గొప్ప సూచన చూపించారు.

ఒకటి కాదు రెండు కాదు ఒక మహాసైన్యము మరణించిన తరువాత వాటి యెముకలు యెండి పోయి ఏమాత్రం జీవించడానికి అవకాశం లేనప్పుడు కూడా వాటిని తిరిగి ఒక్క క్షణంలో జీవింప చేయగల సమర్దుడైన దేవుడు మనతో ఉన్నాడని మరొక్కమారు రుజువు చేస్తున్నారు. ఆ సూచన అప్పటి వారికొరకు మాత్రమే కాదు ఇప్పుడు మనలను కూడా విశ్వాసంలో బలపరుస్తుంది.  దాని కొరకు ఆ యెండిన యెముకలు పనిముట్లుగా వాడబడ్డాయి.
నేను  యెహోవానై  యున్నానని  మీరు  తెలిసికొందురు,  మీరు బ్రదుకునట్లు  నా ఆత్మను  మీలో  ఉంచి  మీ  దేశములో  మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు. యెహెజ్కేలు 37:1-14

10. మహా మత్స్యము

దేవుడైన యెహోవా దృష్టికి నినివె పట్టణప్రజల యొక్క పాపము చాలా ఘోరంగా కనబడినప్పుడు అయన భక్తుడైన యోనాను పిలిచి వారి పాపమునకు ప్రతిఫలము రాబోతుందని చెప్పమన్నారు.  దానికి యోనా అంగీకరించలేక తర్షీషునకు పారిపోవాలని ప్రయత్నము చేస్తాడు.  అప్పుడు యొప్పేకు పోయి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కి ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రలోకి జారిపోయాడు.
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ నావికులు యెవరివలన ఈ పరిస్థితి వచ్చిందో తెలుసుకోవడానికి చీట్లు వేసినప్పుడు యోనా పేరు వస్తుంది.  అతనిని లేపి కారణం అడిగితే,సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను. కాని ఆయన మాటకు లోబడక యెహోవా సన్నిధిలోనుండి పారి పోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసినప్పుడు యోనా సలహామేరకు అతనిని యెత్తి సముద్రములో పడవేస్తారు. 
అప్పుడు దేవుని చేతిలో వాడబడడానికి ఒప్పుకున్న పనిముట్టు ఏంటో మన అందరికి  తెలుసు.  జీవముగల దేవుని  గొప్పతనం  తెలిసిన  మనిషి   మాత్రం దేవుని చేతిలో వాడబడడానికి సిద్దపడక తప్పించుకుని పారిపోతున్నాడు కాని ఒక తిమింగలం మాత్రం సిద్దంగా ఉంది.  యోనా  పడీ  పడగానే  అతనిని catch చేయాలని    నియమించారు.  పడేది  ఎవరో,  ఏ క్షణంలో  పడతాడో,  అతనిని పట్టుకున్నాక ఏంచెయ్యాలో ఆ చేపకు clarity ఇచ్చారు.  
యోనా 1:17
ఏదైన ఆహార పదార్దాన్ని  మనం  నోటిలో  పెట్టుకోగానే   ఏంజరుగుతుంది? నోటిలో ఆహారమును అరిగించుకోవాడానికి జీర్ణరసాలు ఊరతాయి. అలాగే ఆపదార్దం నోటిలో యెంతసేపు ఉంటుంది? కొన్ని సెకనులు మాత్రమే కదా! అలా  గొంతు   దాటిన   తరువాత   అది   అరగకుండా  ఆపడం   మనవల్ల అవుతుందా?  మానవులమైన మనవల్ల సాధ్యంకాని పని ఆ తిమింగలం వల్ల సాధ్యమయ్యింది. వొక నిమిషం కాదు,  వొక గంట  కాదు  పూర్తిగా  మూడు దినాలు.  ఎందుకంటే ఆ తిమింగలం దేవుని  చేతిలో  వాడబడుతున్న  పనిముట్టు.   ఆ పనిముట్టు యెంతగొప్పగా వాడబడిందో ఆలోచిస్తే చాలా అశ్చర్యం కలుగుతుంది కదా! 

1. ఆ మూడు దినాలు యోనాతో పాటు ఆ మత్స్యం కూడా ఉపవాసంతో ఉంది.
2. పోని వేరే చేపలను తింటే లోపలున్న యోనా కూడా అరిగిపోతాడు కాబట్టి తినలేదు.
3. ఆహారం కడుపులో పడింది కాబట్టి జీర్ణరసాలు ఊరతాయి.  అలా ఊరకుండా జాగ్రత్త పడాలి. 
4. అలాగే దేవుడిచ్చిన map ప్రకారం తిన్నగా నినివే చేరి ఆయన యెప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు యోనాగారిని కక్కి వేయాలి.
ఖచ్చితముగా ఆ పనిముట్టు ప్రభువు చిత్తమును నెరవేర్చినట్టు ప్రత్యక్ష సాక్షి అయిన యోనా భక్తుడే వివరించాడు. 

11. చేప (అర షెకెలు దొరికిన చేప)

జెరూసలెంలో ఆలయ నిర్వహణకు నిధులు సమకూర్చడానికి రోమన్ సామ్రాజ్యం అంతటా యూదులందరూ యూదుల ఆలయ పన్ను చెల్లించవలసి ఉంది.  యేసు ప్రభువు వారు మరియు ఆయన శిష్యులు పెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడిగితే చెల్లిస్తారు అని చెబుతాడు. 

అప్పుడు ప్రభువు పేతురుని పిలిచి సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెబుతారు. దీని గురించి ఒక్క క్షణం ఆలోచించండి, వాస్తవానికి ఇది జరిగే అవకాశాలు ఏమిటి? పీటర్ ఒక మత్స్యకారుడు కాబట్టి, మొదటగా వచ్చిన చేపను పట్టుకోవడం అలాగే దాని నోటిలోనే నాణెం దొరకడం అనేది  యాదృచ్ఛికంగా జరిగే అవకాశం లేదు అని అతనికి స్పష్టంగా తెలుసు.

దేవుడు చేసిన కార్యాలన్నీ అద్భుతంగానే ఉంటాయి. యోనా 1:17 ప్రకారం దేవుడు యోనాని మింగడానికి ఒక గొప్ప చేపను పంపించినట్టుగానే ఇక్కడ యేసు చేపలను అందించడమే కాదు, చేపలను పీటర్ యొక్క హుక్ పైకి నేరుగా సరైన సమయంలో నడిపించాడు, యేసు చెప్పినట్లుగా పేతురు చేసినప్పుడు మరియు నోరు తెరిచినప్పుడు, అతను ఒక వెండి షెకెలుకు సమానమైనదాన్ని కనుగొన్నాడు, ఇది వారిద్దరికీ ఆలయ పన్ను చెల్లించడానికి అవసరమైన ఖచ్చితమైన మొత్తం .
ఒక చిన్న చేప యెక్కడనుండి వచ్చిందో తెలియదు. దానికి ఒక identity కూడా లేదు.  కాని దేవుని చేతిలో వాడబడడానికి సిద్దమైపోయింది. 
ఆ చేప నోటిలోనికి ఆ నాణెం యెలా వచ్చిందో మనకు తెలియదు గాని ప్రభువు తనకు ఒకపని అప్పగించారు. ఏమిటంటే పేతురు వచ్చి గేలము వేసినప్పుడు మొదటగా నువ్వే వెళ్ళి ఆ హుక్ కి తగలాలి.  పేతురు చేప నోటిలోనుండి ఆనాణెం తీసుకునేంత వరకు అది ప్రభువు మాట కొరకు కనిపెడుతూ ఉంది. దానిని మింగకోడదు అలాగే వేరే దేనిని తినే అవకాశం లేదు. ప్రభువు చెప్పిన పనిని జాగ్రత్తగా నెరవేర్చిన ఒక చిన్న పనిముట్టు.   చాలా చిన్న విషయంలాగే అనిపిస్తుంది కాని అక్కడ జరిగిన కార్యం నిజంగా ఒక అద్భుతం. మత్తయి 17:24-27

12. నీరు (నీరు ద్రాక్షారసముగా)
యోహాను 2:8-9
యోహాను సువార్తలో యేసు చేసిన మొదటి అద్భుతం నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం. 2: 1-12 ప్రకారం, ఒక వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ఇది వరుడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యేసు నిశ్శబ్దంగా జోక్యం చేసుకున్నారు. అంచులవరకు  కుండీలను నింపాలని ఆయన సేవకులను ఆదేశించారు. తరువాత యేసయ్య చెప్పిన ప్రకారం సేవకులు నీటితో మారిన ద్రాక్షారసం‌ను విందు యజమాని వద్దకు తీసుకువచ్చినప్పుడు, అతను రుచి చూసి ఆశ్చర్యపోయాడు.
కేవలం తననోటి మాటతో ప్రపంచములను మరియు ఈ సృష్టిని నిర్మించిన యేసు ప్రభువువారు మానవ రూపంలో భూమిమీదికి వచ్చినప్పుడు  తనను నమ్మినవారి కోసం ఒక అద్భుతం చేసే అవసరం వచ్చింది. కాని ఇప్పుడు నోటి మాట కూడా వాడినట్టు ఆ సందర్బంలో లేదు. పనివారిని ఆయన నీళ్ళతో నింపండి అనగానే ఆ ఆజ్ఞ నీటికి చేరింది. ప్రభువు మాట యొక్క అద్భుత శక్తికి ఆ నీటియొక్క రంగు, రుచి, వాసన కూడా మారిపోయాయి. యెప్పుడూ ఇంత గొప్ప ద్రాక్షరసాన్ని వారు త్రాగలేనంత అధ్బుతంగా అదిమారిపోయింది.  నేటికి కూడా ఈ సంధర్బాన్ని గురించి ధ్యానించినప్పుడు అది ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచడమే కాకుండా మనకు ఒక మాదిరికరమైన సందేశాన్ని కూడా ఇవ్వడానికి ఆ నీరు ప్రభువు చేతిలో పనిముట్టు గా మారింది.

13. గాలియు సముద్రమును
 ఒక రోజు యేసుప్రభువు వారు తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి వెళ్దామని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరుతారు. వారు వెళ్లు చుండగా ఆయన ఓడ అమరమున నిద్రిస్తూ ఉంటారు. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండి పోవడం వలన వారు అపాయకరమైన స్థితిలో ఉంటారు. అప్పుడు ఆ శిష్యులు భయపడి ఆయనను లేపి ప్రభువా ప్రభువా,  మేము చచ్చిపోయేలా ఉన్నాము నీకు చింత లేదా అని అడుగుతారు. అప్పుడు ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమవుతుంది. 
ఆ ఓడలో ఉన్నది యెవరు? స్వయాన ఆ నీటిని గాలిని సృష్టించిన యేసయ్య.  మరి వాటికి తెలియదా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టకూడదని? తెలుసు! కాని ఆయన శిష్యులలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయనే వాటిని నియమించారు. ఇప్పుడు అవి ఆయన చేతిలో పనిముట్లుగా వాడబడుతున్నాయని వాటికి అర్ధమయ్యింది. కాని గాలిని నీటిని control చేయగల సమర్దుడు వారితో ఉన్నాడని శిష్యులకి అర్దం కాలేదు. ఒకవేళ అర్దమైన పరిస్తితులను చూచి, తెలియనట్టుగా బయపడిపోయారు. 
"అప్పుడాయన లేచి మీ విశ్వాసమెక్కడ అని వారితో అన్నారు. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడతారు. లూకా 8:22-25."


ఇంకా ధ్యానిస్తూ ఉంటే ప్రభువు   కోసం   పనిచేసి   ఆయన   చిత్తమును   నెరవేర్చిన  పనిముట్లు  లేఖనాలలో యెన్నో ఉన్నాయి. అలాగే తండ్రి మాటకు లోబడి ఆయన చిత్తమును నెరవేర్చిన న్యాయాధిపతులున్నారు. ప్రవక్తలు, రాజులు ఉన్నారు. దైవ సేవకులు, మిషినరీస్ వీరందరూ ప్రభువు చేతిలో వాడబడుతున్న పనిముట్లే. 
  • విలియం కేరి ఈ పరిశుద్ద గ్రంధం మన చేతులలోనికి రావడానికి ఒక పాత్రగా వాడబడ్డాడు.
  • మార్టిన్ లూధర్ సంఘ సంస్కరణ చేసే పనిముట్టుగా వాడ బడ్డాడు.     
                              ఇంకా యెందరో ఉన్నారు.......

ఇప్పుడు మన ఒంతు.

  • మన కుటుంబంలో తల్లిగా, చెల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా ఏ స్తితిలో మనం ఉన్నామో ఆ భాధ్యత ప్రభువు ఇచ్చిన పనిగా భావించి ఆ role ని లోపంలేకుండా  నిర్వర్తించడమే ఆయన చేతిలో పనిముట్టుగా వాడబడడం. 
  • అంతేకాదు ప్రభువు ప్రేమని ప్రకటించవలసిన భాధ్యత కూడా మనమీద మోపబడి ఉంది.  మనం వెలిగించబడిన మీదట అనేక మందికి వెలుగుగా ఉండాలి కదా! మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభువు అన్నమాటకు మనమే కదా రుజువులం.
మనల్ని మనం ఆయనకు అప్పగించుకొంటే ఆయన ఏవిధముగానైనా వాడుకుంటారు. మన జీవితమే ఒక సువార్తగా మారిపోతుంది.  
2 తిమోతికి 2:21 ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.
  •  నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. యోహాను 13:15."
  • "నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనువాడగు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యోహాను 13:20"
  • "రోమా 9:23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,"
 సిద్దముగా ఉంటే మనము కూడా అయన చేతిలో పనిముట్టుగా వాడబడతాము..
అది యేపని అయినా...ఆయన కోసం....
నేను ముగిస్తున్నాను... సిద్దపడదాం....వాడబడదాం... 


ప్రార్దన చేద్దాం

 ప్రభువా! నేను సిద్దమే! నన్ను వాడుకో! 
ఆమెన్!!

ప్రభువా నే సిద్ధముగా ఉన్నాను నన్ను వాడుకో 
ఈ దీన పాత్రను వాడుకో 
నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నింపి...... వాడుకో 

Please visit my website for a list of all topics. 
Website: http://biblestudynavigator.ml/
Mail id: jyothsnamedidhi@gmail.com



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...