తన వాత్సల్యమును బట్టి "ప్రతి దినమును" మనకు ఒక బహుమతిగా ఇస్తున్న దేవాతి దేవునికి వందనాలు.
ప్రియమైన స్నేహితులారా,
మోషే గురించి మొదటి article నుండి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు కూడా చరిత్రలోని మోషే గొప్పతనం విని దేవున్ని స్తుతించారని నమ్ముతున్నాను. మోషే గురించి చరిత్రలోనే ఇంత గొప్పగా ఉందంటే ఇంక బైబిల్లో చూస్తే ఆ నాయకుడి జీవితం యెలా ప్రారంభమయ్యిందో, అతని బలమేంటో? బలహీనత ఏమిటో అతని వెనుక ఉన్నది యెవరో స్పష్టంగా అర్ధమవుతుంది. అతని మీద ఇప్పుడు చాలా గౌరవము పెరిగింది.
మోషే గురించి బైబిల్లో నుండి అనేక విషయాలు మనం చిన్నప్పటి నుండి విన్నవే అయినా ఒకసారి మరలా నెమరు వేసుకుందాము. యెందుకంటే అతని జీవితమంతా పోరాటమే. కాని ప్రతిసారి గెలుస్తూనే ఉన్నాడు. చనిపోయే క్షణం వరకు వెనక్కి తిరిగి చూడలేదు.
మనం కూడా ఇప్పుడు పోరాటంలో ఉన్నాము. యెక్కడయినా ఓడిపోయి ఆగిపోతామేమో అనే భయంలో ఉన్నాము. ఈ సమయంలో ఇతను మనకి సహాయపడగలడేమో చూద్దాం. అతనిని అడిగి యెవరి సహాయంతో నడిచాడో...యెవరి వైపు చూస్తూ బ్రతికాడో తెలుసుకుని మనం కూడా follow అయిపోదాం.
2. నాయకుడు.. (లేఖనాలలో మోషే) Part-2
3. నాయకుడు.. (గమ్యం చేరని యాత్రికుడు) Part-3
ముందుగా బైబిల్లో మోషే ఎన్నివిధాలుగా సంభోదించబడ్డాడో చూద్దాం.
2. మధ్యవర్తి - నిర్గమ 24:3
3. ఫరోకి దేవుడు - దేవునిచే ఫరోకి దేవుడుగా నియమించబడ్డాడు. నిర్గమ 7:1
4. నా సేవకుడైన మోషే - అని దేవుని చేతే సాక్ష్యం పొందిన వాడు. సంఖ్యాకాండము 12:6 - దేవుని సంభోధన
5. మోషే ధర్మశాస్త్రము - ధర్మశాస్త్రముకే ఒక పేరు పెట్టారు - అది మోషే ధర్మశాస్త్రము.
6. మిక్కిలి సాత్వికుడు - భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు- దేవుని సాక్ష్యం సంఖ్యాకాండము12:3
7. నాయకుడు. - ఆరు లక్షలకంటే యెక్కువైన జనాంగమును నడిపించిన నాయకుడు.
8. దేవుని యాజకుడు. - కీర్తన 99:6
9. దేవుడు ఏర్పరచుకొనిన వ్యక్తి. కీర్తన 106:23
10. దేవుని తీర్పును ప్రజలకు చెప్పువాడు - నిర్గమ 18:15
11. నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. - అతడు నాయిల్లంతటిలో నమ్మకమైనవాడు. దేవునిసాక్ష్యం సంఖ్యా.12:7
ఇన్ని విధాలుగా బైబిల్లొ మోషే పిలువబడ్డాడు అంటే, ముఖ్యంగా దేవాది దేవుడే స్వయంగా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంటే ఖచ్చితముగా మోషేలో చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉండేఉండాలి. అవేంటో కాస్త పరిశీలనగా చూసి నేర్చుకుందాం.
- గుర్తించాడు: మోషే రాజకుటుంబములో పెరుగుతున్నాడు. సకల భోగబాగ్యాలు అనుభవించే అవకాశం ఉంది. కాని తాను యెవరో, తన ప్రజలెవరో ఇక్కడ యెందుకు ఉండవలసి వచ్చిందో గుర్తించాడు.

- నడిపించాడు: ఒకరిని.. ఇద్దరిని కాదు ఆరు లక్షల పైబడిన జనాంగాన్ని. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా 40 సంవత్సరాలు. తన స్వరముతో లేక గంభీరమైన వాక్స్చాతుర్యముతో నడిపించాడా? లేదు.. నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడు అయినా నడిచాడు... నడిపించాడు.
- నిందలు భరించాడు:
దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు ఎన్ని అద్భుతాలు జరిగించినప్పటికీ, నడిపిస్తున్న మోషే మీద మరియు బానిసత్వం నుండి విడిపించిన దేవుని మీద ఏదోవిధంగా అసహనంగా మాట్లాడేవారు. ఆలా ఎన్నోమార్లు అవమానించినప్పటికీ దేవా నాకెందుకు ఈ పని అప్పజెప్పావు... వీళ్ళు చేసిన పాపానికి నేనెందుకు 40 సంవత్సరాలు ఈ అరణ్యములో బాధపడాలి అని ఒక్కసారి కూడా దుఃఖపడలేదు.
ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనులమీద సణిగెను. 16:2
అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి. 17:3
మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచుమీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సంఖ్యాకాండము 16:41
- నమ్మకస్తుడుగా ఉన్నాడు: యెహోవా సాక్ష్యం
దేవుడు తనకు ప్రత్యక్షమై అప్పగించిన ప్రతి పనిని కచ్చితముగా నెరవేర్చాడంట. ఆ మాట స్వయానా మన ప్రభువే సాక్ష్యామిస్తే ఇంక అందులో doubt ఏముంటుంది.
అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. సంఖ్యాకాండము 12:7
యెహోవా మోషేకి అజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. యెహోషువ 11:15
దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, హెబ్రీయులకు 10:21
ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. హెబ్రీయులకు 3:2-5
- అడ్డుపడ్డాడు:
ప్రజలు తన మీద సణిగినప్పటికీ ఓర్చుకుంటూ, దేవునికి కోపం వచ్చి వారిని నాశనం చెయ్యాలి అనుకున్న ప్రతిసారి దేవునిని బ్రతిమాలుకొనేవాడంట. ఆయన సన్నిధిలోనికి వెళ్లి ఆయన కోపము చల్లారే విధముగా ఒక ప్రేమికుడి లాగా ఆయనతో మాట్లాడేవాడంట.
అప్పుడు ఆయన నేను వారిని నశింప జేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే అయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. కీర్తన 106:23
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? 32:11
దేవుడు పిలిచినప్పుడు ఆయనను గుర్తించి, వెంబడించి, ఆయనకు లోబడి ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చినందుకు ఆయన మోషేకి ఇచ్చిన ఆదిఖ్యత ఏమిటో తెలుసా.....
1. నేను మనస్పూర్తిగా స్పష్టంగా అతనితో మాట్లాడతాను, అతనికి నన్ను చూసే అవకాశాన్ని కూడా ఇస్తాను అని ప్రభువు అన్నారు. నిర్గమకాండము 12:8 నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును.
33:9 మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.
మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. 33:11
2. ఆ సీనాయి పర్వతం మీద ప్రభువు సన్నిధిలో ఉండిపోయి ఆయన మాటలు వింటూ ఒక గొప్ప ధర్మశాస్త్రాన్ని ప్రజలకు పరిచయం చేసే భాగ్యం దక్కించుకున్నాడు.
3. ఏసు ప్రభువు వారు భూమి మీదికి మనుష్య కుమారునిగా వచ్చినప్పుడు... ఏలీయాతో పాటు మోషే కూడా వచ్చి కొంత సేపు ఆయనతో మాట్లాడే అవకాశం దక్కింది. "మోషే మరియు ఏలీయా వారికీ కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. మార్కు 9:4"
ప్రభువునందు ప్రియులారా,
నమ్మకముగా ఉండువానికి దీవెనలు మెండుగా కలుగును అనే మాటకు అర్ధం ఇదే అని రుజువవుతుంది కదా! ఇదెంత గొప్ప భాగ్యం. మోషే గారు చాలా విషయాలు నేర్పించారు. అతను ఇశ్రాయేలు జనులకు మాత్రమే కాదు ఇప్పుడు మనకు కూడా మార్గదర్శి గా కనిపిస్తున్నాడు.
మన ప్రయాణం కూడా ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఈ సమయంలో మోషే దేవుని పర్వతం వైపుగా వెళ్ళినప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినట్లుగానే.... మనం వాక్యం వైపుగా అడుగులు వేసినప్పుడు ఆయన మనతో మాట్లాడతారు.
మన తండ్రిలో మార్పు లేదు. ఆయన అప్పుడు ఇప్పుడు అదే మనస్సుతో ఉన్నారు. మోషేకి తోడై ఉన్నట్లు మనకు కూడా తోడై ఉన్నారు. మోషే కర్ర పైకి ఎత్తితే విస్తార జలాలు పక్కకి తొలగి నిలబడ్డాయి. ఎన్నో అద్భుతాలు జరిగిపోయాయి. చేతులు పైకి ఎత్తితే యుద్దాలు ఆగిపోయాయి. ఈ రోజు మన జీవితంలో ప్రతి రోజు ఒక అద్భుతమే... ప్రభువు గొప్పతనమే... మనము కూడా మోషే లాగా ప్రభువు వైపు విశ్వాసముతో మన హృదయాన్ని పైకెత్తినప్పుడు అవసరమైతే ఏ పరిస్థితి ఎలా ఉన్నా మనకోసం పరిస్థితులు అన్ని మార్చగల సమర్థుడు మన ప్రభువు.
నిన్న నేడు నిరంతరం ఏకరితిగా ఉన్న సర్వోన్నతునికి కోటనుకోట్ల వందనాలు.
మోషే విశ్వాస యాత్ర గురించి మరికొన్ని సంగతులు ధ్యానం చేస్తూ మరలా కలుస్తాను.
ప్రభువు మనతో ఉండు గాక. ఆమెన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి