2, డిసెంబర్ 2021, గురువారం

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా,

ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను.

ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పటికీ, ఆయన తన ప్రేమ లేఖను మానవాళికి అందించడానికి 40 మందిని నియమించారు. యోహాను 1:1,9 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; 

2 పేతురు 1:20-21 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.

మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంధము, ప్రభువు మనస్సు. ఆయన వాక్కు. ఇది మన జీవితాల్లోకి రావడం ఎంత అవసరమో మన తండ్రికి తెలుసు.

ఆయనను ప్రేమించే వారు కూడా తెలుసు కున్నారు. అందుకే మనకు అందించడానికి వారు అంత పోరాటం చేసారు. ఆకలం ప్రభువుదే.. అయితే అది గ్రంధస్థముగా మన చేతిలోనికి రావడానికి వీరందరూ ఎలాంటి పరిస్థుతులు ఎదుర్కున్నారో, ఎలాంటి ప్రదేశాలలో ఎంత పోరాటం అనుభవించారో మనము తెలుసుకోవాలి.
ఏమిటవి?
చారిత్రక గ్రంధాలు  (ఆదికాండము - ఎస్తేరు)

ఆదికాండము నుండి ప్రారంభిస్తే Pentateuch అంటే బైబిల్ యొక్క మొదటి ఐదు పుస్తకాలు. పెంటట్యూక్ అనే పదం రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది, అంటే "ఐదు పుస్తకాలు" లేదా "ఐదు స్క్రోల్స్". ఈ ఐదు పుస్తకాలు యూద మరియు క్రైస్తవ బైబిల్‌ల ప్రారంభం.
1) ఆదికాండము                : (హీబ్రూ: బెరీషిట్),
2) నిర్గమకాండము             : (హీబ్రూ: షెమాట్),
3) లేవికాండము                : (హీబ్రూ: వాయిక్రా, వెయిడ్),
4) సంఖ్యాకాండము           : (హీబ్రూ: బెమిడ్‌బార్) మరియు
5) ద్వితీయోపదేశకాండము : (హీబ్రూ: Devarim)

ఎవరు? ఎప్పుడు?

వాస్తవానికి  మోషే 1500-1400 BC లో ఈ ఐదు పుస్తకాలను  వ్రాసాడని వివిధ వర్గాలకు చెందిన విభిన్న పండితులు,   చరిత్ర ఆధారంగా ఒప్పుకున్నారు.

దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, 'సివాన్ నెల 6వ తారీఖున, మోషే సినాయి పర్వతాన్ని అధిరోహించాడు. పర్వతంపై 40 రోజుల కాలంలో,  దేవుడు అతనికి పది ఆజ్ఞలను మాత్రమే కాకుండా తోరాను (ఐదు కాండాలు అనగా ధర్మశాస్త్రము), అలాగే  అందులో మరికొంత భాగాన్ని ప్రత్యక్ష గుడారంలోనూ అనుగ్రహించారని ప్రముఖ యూదుల చరిత్ర వివరిస్తుంది.

అదంతా దేనిమీద రాసాడు?

తోరా scrolls పూర్తిగా ఆవు అనబడే (హీబ్రూలో కోషెర్) జంతువు నుండి తీయబడిన చర్మము మీద మన  writer  చేత చేతితో వ్రాయబడ్డాయని పరిశీలనలో తేలింది. ఇది సాధారణమైన ఆవు. జంతు చర్మాల సంక్లిష్ట తయారీ నుండి చివరి పదాలను వ్రాయడం వరకు మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి 18 నెలల వరకు పట్టవచ్చు. సోఫర్ స్క్రోల్ వ్రాసేటప్పుడు గొప్ప ఖచ్చితత్వం అవసరం. అతను ఏదైనా తప్పులు చేస్తే అది మొత్తం స్క్రోల్ చెల్లనిది అవుతుంది. పూర్తి చేసిన స్క్రోల్‌ను సెఫెర్ తోరా అని పిలుస్తారు, ఇది పూర్తిగా Hebrew  భాషలో వ్రాయబడింది.

ఇప్పుడవి ఎక్కడ ఉన్నాయి?

 హిబ్రూ భాషలో రాయబడిన పాత నిబంధన manuscripts ప్రపంచంలో అతిపెద్ద Organized collection సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్ నేషనల్ లైబ్రరీ ("సెకండ్ ఫిర్కోవిచ్ కలెక్షన్")లో ఉంది . 

మరి కార్బన్- డేట్ చేసారా?

ఇప్పటికీ వాడుకలో ఉన్న అత్యంత పురాతనమైన పంచ కాండాల  స్క్రోల్ దాదాపు క్రీ.శ. 1250 లో కార్బన్-డేట్ చేయబడింది. అది ఇప్పుడు ఉత్తర ఇటాలియన్ పట్టణం బియెల్లాకు చెందిన యూదుల సంరక్షణలో ఉంది. 

అసలేముంది అందులో?

పంచ కాండాలలో  ప్రపంచ సృష్టి నుండి మోషే మరణం మరియు కనాను దేశంలోకి ప్రవేశించడానికి ఇశ్రాయేలీయుల సన్నద్ధత వరకు ఉంటుంది. కథ మూడు భాగాలుగా చెప్పబడింది.

మొదటి భాగం (ఆదికాండం 1-11) సృష్టి మరియు భూమిపై మనుషుల ప్రారంభం గురించి.

రెండవ భాగం (ఆదికాండము 12-50) ఇజ్రాయెల్ యొక్క పూర్వీకుల కథలు, ప్రధానంగా అబ్రహం, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు అనేవి.

నిర్గమకాండము పుస్తకంతో ప్రారంభమైన మూడవ భాగం, ఇజ్రాయెల్ ఈజిప్టును ఎలా విడిచిపెట్టిందో మరియు ఒక దేశంగా ఇజ్రాయెల్ ప్రజల ప్రారంభ చరిత్రను వివరిస్తుంది. ఇజ్రాయెల్ వారి సమాజాన్ని ఎలా నిర్మించాలి అనే దాని గురించి అనేక చట్టాలు కూడా ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము ఎక్కువగా మోషే తన ప్రజలకు చేసిన చివరి ప్రసంగం మరియు ఐదు కాండాల సారాంశము ఉంటుంది.

మరి ద్వితియోపదేశకాండము 34 వ అధ్యాయం సంగతేంటి?

ద్వితియో. 34 వ అధ్యాయములో మోషే యొక్క మరణం గురించి రాయబడిఉంది.  ఎలా చనిపోయాడో అని తానే స్వయంగా రాయడం సాధ్యపడదు కాబట్టి, ఆ అధ్యాయం ఎవరు రాసారు అన్నది ప్రశ్న.  బాగా పరిశీలిస్తే మోషేని వెన్నంటి నడుస్తున్న యెహోషువయే అయి ఉండాలి.  పరిశీలకుల ఉద్దేశం కూడా అదే.

నాలుగు కాండాలలో అనేకమైన laws వివరించడం వలన ప్రస్తుతం యూదులు మోషేని "lawgiver of Israel" గా గౌరవిస్తున్నారు. 

కొత్త నిబంధనలో, మోషే ఇతర పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకంటే  ఎక్కువగా ప్రస్తావించబడ్డాడు. అలాగే క్రైస్తవులకు,  దేవుని ధర్మశాస్త్రం అనగానే మోషే జ్ఞాపకం వస్తాడు. యేసు ప్రభువు వారు కూడా తన బోధలలో ఆ విషయాన్ని  ప్రస్థావించడం వలన మోషే ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది.

పంచ కాండాలే కాకుండా మోషే మరి కొన్ని కీర్తనలను కూడా రాసాడు.

6) యెహోషువ గ్రంధము

యెహోషువ గ్రంధము 1400 - 1370 B.C. లో వ్రాయబడి ఉండవచ్చని అంచనా. ఇందులో, దేవుడు వాగ్దానం చేసిన  దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలు జనాంగము చేసిన పోరాటం వివరించబడింది. తన మరణము గురించి తప్ప మిగిలిన భాగమంతటికీ యెహోషువయే writer.

దేవుడు, తాను అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేశంలోకి    ఇశ్రాయేలీయులను   తీసుకుని  రావడానికి  వారితో చేసిన  నిబంధన పట్ల దేవుడు ఎంత నమ్మకముగా ఉన్నారో ఈ యెహోషువ గ్రంధం వివరిస్తుంది.

దేవుడు యెహోషువని ఎందుకు ఎంచుకున్నారు?

దేవుని పట్ల అతనికున్న విశ్వాసాన్ని చూచి దేవుడు మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి యెహోషువను  ఏర్పరచుకున్నారు.

యెహోషువ ఏ సంవత్సరంలో ఎరికోను ఓడించాడు?

బైబిల్ ప్రకారం, దాదాపు 1,400 BC సమయంలో,  యెరికో    ఇశ్రాయేలీయులు   యోర్ధాను  నదిని  దాటి   కనానులోకి ప్రవేశించిన తర్వాత వారిచే దాడి చేయబడిన మొదటి నగరం. ఇశ్రాయేలీయులు నిబంధన  మందసాన్ని మోస్తూ ఏడు రోజుల పాటు ఈ ఎరికో గోడ  చుట్టూ తిరుగుతూ జయధ్వనులు చేసినప్పుడు అది  ధ్వంసమైంది.

7) న్యాయాధిపతులు - (సమూయేలు /నాతాను ప్రవక్త /గాదు ప్రవక్త - 1000 - 900 B.C.)

సమూయేలు ప్రవక్త యొక్క వివరణ ప్రకారం, న్యాయాధిపతుల గ్రంధము మరియు సమూయేలు గ్రంధాలను, సమూయేలు తన మరణం వరకు వ్రాసాడు, ఆ  తరువాత నాతాను మరియు గాదు అనబడే ప్రవక్తలు  వాటిని   కొనసాగించారు.

న్యాయధిపతుల గ్రంధాన్ని సమూయేలు ప్రవక్త రాసాడని యూదా చారిత్రక సాక్ష్యాలు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, 721 B.C.లో చుట్టూ ఇజ్రాయెల్ యొక్క ఉత్తర తెగలను అస్సిరియా స్వాధీనం చేసుకున్న తర్వాత  కాలం గురించి కూడా ఈ పుస్తకం ప్రతిబింబిస్తుంది. (న్యాయాధిపతులు 18:30).

8) రూతు గ్రంధము - (సమూయేలు /నాతాను ప్రవక్త /గాదు ప్రవక్త - 1000 - 900 B.C.)

యూదుల కధనం ప్రకారం, రూతు గ్రంధ రచయిత, ఇశ్రాయేలీయులకు చిట్టచివరి న్యాయాధిపతి మరియు దావీదును రాజుగా అభిషేకించిన సమూయేలు ప్రవక్త అని స్పష్టమవుతుంది. 

9 & 10) 1 & 2 సమూయేలు - (సమూయేలు /నాతాను ప్రవక్త /గాదు ప్రవక్త - 1000 - 900 B.C.)

Original హీబ్రూ ప్రతుల ప్రకారం , 1 మరియు 2 సమూయేలు గ్రంధాలు  ఒకటే పుస్తకం. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం రెండవ భాగంలో, 70 మంది లేఖకులు హీబ్రూ భాషలో ఉన్న పాత నిబంధనను గ్రీకు భాషలోకి అనువదించారు. ఆ సమయంలో స్క్రోల్స్‌లో తగినంత స్థలం లేనందున, అది రెండు పుస్తకాలుగా విభజించబడింది. సమూయేలు యొక్క పుస్తకాలు మరియు అనువాదాలు ఎన్ని ఉన్నా, అసలు జీవిత కథను పరిశుద్దాత్మ నడిపింపుతో రాయబడింది. 1 మరియు 2 సమూయేలు పుస్తకాలను ఒక పుస్తకంగా చదివి అధ్యయనం చేయాలి.

Gad1 మరియు 2 సమూయేలు గ్రంధాలు సమూయేలు గురించి ప్రారంభమయ్యి  దావీదు పాలనతో ముగుస్తాయి. వెనుకకు లెక్కిస్తే, దావీదు 971 BC లో మరణించాడు, అతను ఇజ్రాయెల్ మొత్తం మీద 33 సంవత్సరాలు మరియు యూదాపై 7 సంవత్సరాలు పాలించాడు (2 సమూయేలు 2:5-6). దావీదు కంటే ముందు, సౌలు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి సౌలు 1051 BCలో రాజుగా అభిషేకించబడి ఉండాలి. వివిధ తదుపరి ప్రేరణల ద్వారా సమూయేలు 1124-1121BCకి సమీపంలో ఎప్పుడైనా జన్మించి ఉండాలి. ఈ విధంగా సమూయేలు గ్రంధము యొక్క చారిత్రక పరిధి సుమారు 150 సంవత్సరాలు.

సమూయేలు,  న్యాయధిపతులు గ్రంధము మరియు సమూయేలు గ్రంధాలను సమూయేలు తన మరణం వరకు రాయగా, నాతాను మరియు గాదు అనబడే ప్రవక్తలు వాటిని కొనసాగించారు.

11 & 12) 1 & 2 రాజులు గ్రంధాలు  (యిర్మియా - 600 B.C.)

1 మరియు 2 రాజుల గ్రంధాలను యిర్మియా ప్రవక్త 600 BC లో వ్రాసాడని యూదా చరిత్ర చెబుతుంది. బబులోను ద్వారా యూదా రాజ్యం నాశనం చేయబడడం మరియు బబులోను చెర నుండి తిరిగి రావడం వంటి సంఘటనలను వేదాంతపరమైన వివరణనతో అందించడానికి రాజుల గ్రంధాలు వ్రాయబడ్డాయని బైబిల్ పండితులు నమ్ముతున్నారు. మరియు రాజుల యొక్క రెండు పుస్తకాలు పురాతన ఇశ్రాయేలు మరియు యూదా యొక్క చరిత్రను అందించాయి, దావీదు రాజు మరణం తరువాత, బబులోను చెర నుండి యెహోయాకీను విడుదల వరకు దాదాపు 400 సంవత్సరాల కాలం.

13 & 14) 1 & 2 దినవృత్తాంతములు, ( ఎజ్రా - 450 B.C.)

యూద మరియు క్రైస్తవ చరిత్ర ఎజ్రాను క్రీస్తు పూర్వం  5వ శతాబ్దపు రచయితగా గుర్తించింది, అతను 1 మరియు 2 దినవృత్తాంత గ్రంధాలను స్వయంగా రాసాడని చరిత్ర చెబుతుంది.

15) ఎజ్రా ( ఎజ్రా - 450 B.C.) 

ఎజ్రా అనబడే ఈ బైబిల్ రచయిత  మోషే అనంతరం చాలా కాలం తర్వాత జన్మించాడు. ఎజ్రా కూడా మోషేవలె ఇశ్రాయేలు జానంగమును చెరపట్టబడిన దేశం నుండి తిరిగి వాగ్దాన దేశానికి నడిపిస్తాడు.

ఎజ్రా ఒక లేఖకుడు (పత్రాలను చదివే, వ్రాసే మరియు వివరించే వ్యక్తి), మరియు అతను ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు (ఎజ్రా 7:6). అతను నిజానికి మోషేకి బంధువు: ఎజ్రా మోషే సోదరుడైన అహరోనుకి ముది మనుమడు అంటే అతనిలో కొంత యాజకుని రక్తం కూడా ఉంది (7:1–5). ఎజ్రా బబులోనులో పెరిగాడు, కానీ అతను తన స్వదేశానికి మిషనరీగా మారాలని నిశ్చయించుకున్నాడు (7:10), కాబట్టి అతను యూద జనాంగాన్ని తిరిగి యెరూషలేముకు తీసుకెళ్లి ప్రజలకు దేవుని మార్గాన్ని బోధించడం ప్రారంభించాడు.

ఎజ్రా మరియు నెహెమ్యా పుస్తకాలలో ఎజ్రా కీలక పాత్రధారి. అతను యెరుషలేములో ఒక మత నాయకుడు, అతను తన చుట్టూ ఉన్న ప్రజలను దేవుని మార్గములో నడవాలని హెచ్చరిక చేస్తూ ఉంటాడు.

ఎజ్రా, 1 & 2 దినవృత్తాంతములు (ఒకే పుస్తకంలోని రెండు భాగాలు) మరియు ఎజ్రా పుస్తకాలను వ్రాసినట్లు యూద మత విశ్వాశం చెబుతుంది. ఇదే జరిగితే, బైబిల్ యొక్క రెండవ అత్యంత ముఖ్య రచయితగా ఎజ్రాను గుర్తించవచ్చు. మనము ఎప్పుడూ ఈ విషయాన్ని గమనించలేదు కదా!

16. నెహెమ్యా (నెహెమ్యా , ఎజ్రా - 450 B.C.)

ఈ గ్రంధ రచయిత నెహెమ్యా.  అతను  అర్థహషస్త అను రాజుకు  
పానదాయకుడుగా ఉంటున్న సమయంలో అతనికి కొన్ని కలతపెట్టే వార్తలు వచ్చాయి. అప్పుడు రాజు  సహాయంతో యెరూషలేముకు తిరిగి వచ్చి చాలా కష్టాల్లో ఉన్న అతని దేశస్థుల యొద్దకు మరియు శిథిలావస్థలో ఉన్న నగరానికి చేరుకున్నాడు (నెహెమ్యా 1:3). నెహెమ్యా పట్టణ గోడలు మరియు ద్వారాలను పునర్నిర్మించడానికి జెరూసలేంకు బయలుదేరాడు.

గొప్పసంగతి ఏమిటంటే నెహెమ్యా కేవలం 52 రోజుల్లో గోడను పునర్నిర్మించాడు (6:15).

అర్తహషస్త అతన్ని యూదా గవర్నర్‌గా చేస్తాడు (నెహెమ్యా 5:14), మరియు నెహెమ్యా ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ఈ స్థానాన్ని ఉపయోగించాడు. దేవాలయంలో సైనికులను ఉంచడం, గాయకులను నియమించడం మరియు ఆలయం శుభ్రంగా ఉండేలా చూసుకోవడం... అంతా నెహెమ్యానే. అయితే, అతను ప్రజలను దేవునిలో తిరిగి నిలబెట్టడానికి ఎజ్రాతో కలిసి పనిచేసాడు(10:28-39).

నెహెమ్యా వ్రాసిన పుస్తకానికి తన పేరే పెట్టాడు. నెహెమ్యా చాలా పారదర్శకమైన (స్పష్టమైన) రచనా శైలిని కలిగి ఉన్నాడు, అతను దేవునికి చేసిన ప్రార్థన... మన ప్రార్ధనా జీవితానికి గొప్ప మాదిరి.

17. ఎస్తేరు - (మొర్దెకై - 400 B.C.)

చరిత్ర ప్రకారం, వాస్తవానికి ఎస్తేరు గ్రంధము రెండు సార్లు వ్రాయబడిందంట. ఆ పుస్తకంలో మనము చదివిన సంఘటనలన్నీ జరిగిన తరువాత ఎస్తేరు మరియు తన బంధువైన Mordecai కలిసి దేవుని నడిపింపుతో దాదాపుగా తొమ్మిది సంవత్సరాల పాటు మొత్తం కథను 400 BC లో record చేసారు.
అయితే ఇది సంఘటనల చారిత్రక రికార్డు మాత్రమే.
వాస్తవానికి, కొందరి అభిప్రాయం ప్రకారం, ఎస్తేర్ పుస్తకంలో God గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే పర్షియన్లు ఈ వృత్తాంతాన్ని తీసుకుని వారి స్వంత దేవతల పేర్లు పెట్టి వారి చరిత్ర పుస్తకాలలో చేర్చుకున్నారు. తరువాత, Queen Esther 24 పవిత్ర గ్రంథాలలో భాగంగా ఎస్తేర్ పుస్తకాన్ని చేర్చమని వారిని అభ్యర్థించింది. అప్పుడు "The men of the great Assembly" వారు దానిని దైవ ప్రేరణతో తిరిగి వ్రాశారు. అప్పుడు అది గ్రంథంలోని 24 పుస్తకాలలో ఒకటిగా చేర్చబడింది.

మనం ముందు అనుకున్నట్లుగా, దేవుని పేరు ఈ పుస్తకంలో ఎక్కడా లేదు. అదే సమయంలో, అంతర్లీన సందేశం ఏమిటంటే, యూదా జనాంగము కఠినమైన దినాలను ఎదుర్కొంటున్నప్పుడు వారిని విమోచించడంలో దేవుని మరుగైన హస్తం అక్కడ కనిపిస్తుంది. అందుకనే ఆ కాలంలో ఎస్తేరు గ్రంధము చాలా విలువైన పుస్తకంగా భావించబడేది.

ఈరోజు మన చేతిలో ఉన్న gadgets పై మన వేళ్ళు గంటలకొద్దీ కదులుతూనే ఉంటాయి.  లోపల నుండి మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా Technology పేరుతో మన సమయం మంచులా కరిగిపోతూ ఉంటుంది. మన జీవితం ముగిసే సమయానికి ప్రభువు కోసం ఏంచేసాము అని లెక్కలు వేసుకుంటే balance sheet ఎప్పటికీ tally అవ్వదు.
మరి వాళ్లకు ఏ అవకాశము లేదు, ప్రభువుకోసం ఏదో చెయ్యాలనే తపన తప్ప.  అప్పుడే దొరికాయి రాళ్లు, చర్మపు కాగితాలు, రాతిగోడలు. హింసలు పొందుతూ, వ్యతిరేకతను ఎదుర్కుంటూ రాసారు ఇప్పుడు కూడా జీవముగల దేవుని గురించి సాక్ష్యమిస్తూ.....

ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మనముందుంచిన దేవాది దేవునికి కృతజ్ఞతలు.  మనం కూడా ప్రభువుకోసం పని చేద్దాం ఏదోవిధంగా... బ్రతికున్నంత వరకు....

మరి కొంత మంది రచయితల సమాచారంతో మళ్ళీ కలుస్తాను త్వరలో....

Blessed be the name of the Lord.

23, సెప్టెంబర్ 2021, గురువారం

16. బైబిల్ ని ఎందుకు నమ్మాలి? - Part 1

ప్రియమైన స్నేహితులారా,

వాక్యమైయున్న యేసయ్య నామంలో మీకు వందనాలు.

బైబిల్ని, అందులో ఉన్న వాక్యాలను మనము పూర్తిగా విశ్వసిస్తున్నప్పటికీ... ఎవరినైనా ప్రభువులోనికి నడిపించే క్రమంలో చాలామంది అసలు బైబిల్ ని ఎందుకు నమ్మాలి? అనే ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు.  

నిన్ను హేతువు అడుగు ప్రతివానికి సమాధానమిమ్ము అని ప్రభువు చెప్పినట్లుగా,  వారు అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పవలసిన బాధ్యత మనకుంది. బైబిల్    యాదర్థమైనదని రుజువు చేసే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి.  అందులో నేను సేకరించిన కొన్ని విషయాలు  మీతో పంచుకుంటాను.

బైబిల్ చాలా కాలం క్రితం వ్రాయబడింది కదా.... అది నిజమని మనం ఎందుకు నమ్మాలి?
నిజమే.....బైబిల్ నేడు మన సంస్కృతి  మరియు  మన జీవనవిధానంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, అలా అని బైబిల్ నమ్మదగినదని మనము ఎలా అనుకోగలం??

చాలా సంవత్సరాల పాటు ప్రజలు బైబిల్ యొక్క ప్రామాణికతను, అలాగే దానిలోని సత్యాలను పెద్దగా నమ్మలేదు. కాని నమ్మదగిన ఆధారాలు దొరికినప్పుడు నమ్మి తీరాల్సిందే.  మనము బైబిల్‌ని విశ్వసించగల 10 కారణాలు మీ ముందుకు తెచ్చాను. ఆధారం లేని వట్టి మాటలను మనము నమ్మడం లేదు, జీవముగల దేవున్ని పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో పరిశీలనగా తెలుసుకొని వెంబడిస్తున్నామని ప్రాణం ఉన్నంత వరకు ప్రకటిద్దాం రండి. 

1. మొదటగా.... బైబిల్, దేవుని నుండి వచ్చినదని బైబిలే చెబుతుంది.

 మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంధము దేవుని ద్వారా మాత్రమే మనకు  ఇవ్వబడిందని  బైబిల్లో ఉన్న  అనేక వచనాలే రుజువు చేస్తున్నాయి. లేఖనాలలో "యెహోవా సెలవిచ్చునదేమనగా" అనే మాట 400 కన్నా ఎక్కువ

సార్లు కనిపించటమే దానికి ఒక ఉదాహరణ. ఆ మాటలు అప్పుడు మాట్లాడిన సందర్బమే కాకుండా భవిష్యత్తు తరాలు చదవడానికి బైబిల్లో వ్రాయబడింది.

అలాగే, 2 తిమోతి 3:16-“దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము”....అనే మాట ఎటువంటి సందేహము

లేకుండా మన గ్రంధము కేవలము దేవుని నుండి మాత్రమే వచ్చిందని రుజువు చేస్తుంది.

2. బైబిల్  ఉన్నది ఉన్నట్లుగా శతాబ్దాలను దాటి వస్తూఉంది 

 ఇప్పటివరకు కనుగొన్న అన్ని ప్రాచీన గ్రంథాలలో, బైబిల్

మాత్రమే అన్ని original  వ్రాత పత్రాలను కలిగి ఉంది అనేది మనము బైబిల్ని విశ్వసించగల 10 కారణాలలో ఒకటి.

ఈ రోజు మనము చదువుతున్న బైబిల్, దాని యొక్క

అసలు వ్రాత పత్రాల (original documents) నుండి సేకరించబడింది. 


3. బైబిల్ యొక్క ఐక్యత (ఏకాభిప్రాయం)

ఈ పుస్తకాన్ని 40 మందికి పైగా రచయితలు, వారి messages  అన్నీ ఏకాభిప్రాయంతో వ్రాసారని మీరు ఊహించగలరా?

బైబిల్ విభిన్న మూలాలను కలిగి ఉన్నప్పటికీ, దాని

పుస్తకాలు 3 విభిన్న ఖండాలలో (ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా) వ్రాయబడినప్పటికీ, దానిలో అంతర్లీన ఉద్దేశ్య ఐక్యత మరియు ఆలోచన యొక్క స్థిరత్వం ఉంది.

4. బైబిల్ నిజమైనదని (accuracy) పురావస్తు శాస్త్రం మరియు చరిత్ర ద్వారా కూడా నిర్ధారించబడింది

 అనేక సంవత్సరాలుగా, పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు పురాతన ఆచారాలు, నగరాలు, పట్టణాలు

మరియు యుద్ధాల గురించి బైబిల్ ఏమి చెబుతుందో ఆ ప్రకారమే జరిగిందని నిర్ధారించే ఆవిష్కరణలు ఎన్నో చేసారు.

బైబిల్ చెప్పేదంతా ఖచ్చితమైనది కాబట్టి, బైబిల్  తరచుగా పురావస్తు త్రవ్వకాలకు మార్గదర్శిగా కూడా ఉపయోగించబడుతూ ఉంది.  అంటే కొన్ని విషయాలు   

study చేస్తున్నప్పుడు వారికి అర్ధం కాని సందర్భంలో బైబిల్,  పురావస్తు శాస్త్రవేత్తలకు rootmap లా ఉండేదనమాట.

5. ఇప్పటికే నెరవేరిన ప్రవచనాల గురించి బైబిల్ చెప్పింది.

బాబిలోనియన్లు, పర్షియన్లు, గ్రీకులు మరియు రోమన్ల పెరుగుదల మరియు పతనం వంటి సంఘటనలు

జరగడానికి చాలా సంవత్సరాల ముందే దానియేలు గ్రంధములో ఖచ్చితంగా ప్రవచించబడ్డాయి.

అలాగే, యేసుక్రీస్తు జననం, జీవితం, పరిచర్య, ఆయనకు జరిగిన ద్రోహం, మరణం మరియు ప్రభువు  పునరుత్థానం గురించి పాత నిబంధనలో చెప్పబడిన  ప్రవచనాలు అన్నీ నెరవేరాయి.

6. బైబిల్ మరియు సైన్స్ ఏకీభవిస్తున్నాయి 

మొదటిగా... ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల స్థానాలు బైబిల్ వాటిని వివరించిన విధంగానే

ఉంటుంది. రెండవది, ఖగోళ శాస్త్రవేత్తలు తరచుగా నక్షత్రాలు ఇంకా పూర్తిగా లెక్కించబడలేదని చెప్పారు, ఈ విషయం యిర్మియా 33:22 లో వివరించబడింది - "ఆకాశంలోని నక్షత్రాల వలె లెక్కలేనన్ని".

మూడవది, భౌగోళిక అధ్యయనాలు గొప్ప వరద సంభవించినట్లు సూచిస్తున్నాయి. చివరగా, ఈ రోజు శాస్త్రవేత్తలకు తెలిసిన నీటి (హైడ్రోలాజికల్) చక్రం యోబు 36: 27-28 మరియు ప్రసంగి 1: 6-7లో ఖచ్చితంగా వివరించబడింది. మనకు ఇంకా ఏ రుజువు కావాలి!

7. బైబిల్ ప్రత్యక్ష సాక్షులచే వ్రాయబడింది

బైబిల్ రచయితలు, ప్రత్యేకించి కొత్త నిబంధనలో ప్రతిదానిని తాము ప్రత్యక్షంగా చూశామని సూచిస్తూ, చాలా చిన్న సంఘటనలే అయినా ప్రతిదానినీ అందరూ 

 ఒకేలా వివరించారు. ఈ ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాలు  యాదర్ధమైనవని రుజువు చేసే విధంగా, వారు వేరే వేరే ప్రదేశాలలో వ్రాసినప్పటికీ అవన్నీ ఓకే విధంగా ఉండడమే నిజ నిర్ధారణ.

8. లేఖనాలను నిర్ధారించిన క్రీస్తు భోదలు 

మనము బైబిల్‌ని విశ్వసించగల 10 కారణాలలో మరొకటి ఏమిటంటే, లేఖనాలలో యేసయ్య చెప్పింది చెప్పినట్టు  నెరవేరింది. ఆయన చనిపోయే ముందు తన పునరుత్థానాన్ని ముందే చెప్పారు, అదేవిధంగా ఆయన చనిపోయిన మూడు రోజుల తర్వాత, సమాధి ఖాళీగా ఉంది!

ఆయన పునరుత్థానం తరువాత, యేసు తన శిష్యులకు కనిపించారు, మరియు ఆయన వారిని దేవుని వాక్యములోనికి నడిపించారు. తత్ఫలితంగా, చాలా మంది మొదటి విశ్వాసులు ఆయన మరణం మరియు పునరుత్థానం యొక్క వాస్తవాలను ఒప్పుకుని మరియు వాటిని అనేకమందికి సాక్ష్యామిచ్చే క్రమంలో మరణానికి కూడా వారు భయపడలేదు.

9. జీవితాలను మార్చే శక్తి బైబిల్‌కు ఉంది

బైబిల్లోని పదాలు జీవితాలను మార్చేంత శక్తివంతమైనవి, వీరిలో కొందరు అపొస్తలుడైన పాల్, CS లూయిస్, మార్టిన్ లూథర్ మొదలైనవారు ఉన్నారు. అంతే కాదు

రాస్తున్న నేను, చదువుతున్న మీరు ఆ వాక్యము చదవడము ద్వారా మన జీవితాలు మారాయనడానికి సాక్షులము కాదా?

యుగయుగాలుగా జీవితాలను మలుపు తిప్పిన కొన్ని భాగాలలో దావీదు కీర్తనలు (ముఖ్యంగా కీర్తన 23), పది ఆజ్ఞలు, ధన్యతలు మరియు 1 కొరింథియన్స్ 13 (ప్రేమను గురించిన పౌలు బోధన) ఉన్నాయి.

10. నమ్మకమైన సత్యసాక్షియైన మన ప్రభువే  బైబిల్ యొక్క ప్రాథమిక గ్రంధకర్త 

ఈ పుస్తకం యొక్క ప్రాథమిక గ్రంధకర్త ప్రభువే అని ఎందుకన్నానంటే, మొదటి నుండి చివరి వరకు దాని ఐక్యత అది మనుష్యులవల్ల సాధ్యమయ్యేది కాదు. పాత

నిబంధనలోని వాగ్దానం నుండి క్రొత్త నిబంధనలో నెరవేర్పు వరకు, మన నిరీక్షణ, విడుదల   వైపు చూపుతూ, మానవజాతి కోసం ఇది స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉంది.

యేసుప్రభు జీవితం మరియు మరణం ద్వారా, దేవుడు ప్రేమించేవాడు మరియు నమ్మదగినవాడు అని బైబిల్ మానవజాతికి రుజువు చేసింది.


Glory to God!  మనచిన్న హృదయంతో ఇంత గొప్ప దేవునిని ఆరాధించే భాగ్యం దొరికినందుకు మనం ధన్యులం. 

ఇప్పటికి ముగిస్తున్నాను బైబిల్ గురించి మరికొన్ని విషయాలు share చెయ్యడానికి మళ్ళీ కలుస్తాను.

May God Be with you


4, సెప్టెంబర్ 2021, శనివారం

15. ఏదెను.. Part 2(ఎక్కడ ఉండేది?)-Reading time 6 minutes

ప్రియమైన స్నేహితులారా,   

ప్రభువు కృప మీతో ఉండు గాక!

మనము ముందుగా అనుకున్నట్టుగానే ఏదెను గురించి మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేఖనాల నుండి తెలుసుకుందాం రండి.
1. దేవుడు ఆ చెట్టు పండు తింటే ఆ రోజే చచ్చిపోతావు అని ఆదాముతో అన్నారు కదా మరెందుకు ఆ రోజు చావలేదు?

ఆదినమే కాదు ఇంకా చూస్తే బైబిల్లో అత్యధిక కాలం బ్రతికిన వ్యక్తి వయస్సు 969 సంవత్సరాలు. ఆదాము 930 సంవత్సరాలు, నోవహు 950 సంవత్సరాలు బ్రతికాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ దినం లోనే చనిపోవలసిన మనిషి ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నాడు??

"ఆది 5:27. మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను."

ఇక్కడ ఒక విషయం మనము తెలుసుకోవాలి. పరలోకంలో ప్రభువు లెక్కలు... భూమిమీద ఉండే మనిషి లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. 

"2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి."

అనగా భూమి మీద మనిషి దినాలు గాని, మనిషి కొలిచే కొలత గాని ప్రభువు దృష్టికి చాలా తక్కువ అనమాట. అందుకే ఆయన మనమీద కోపించేటప్పుడు మనలెక్కప్రకారం... దయ చూపించేటప్పుడు ఆయన లెక్కప్రకారం చూస్తారనే కదా దీని అర్ధం. ఆయన తన లెక్కప్రకారం గనుక మనలను శిక్షిస్తే ఏ ఒక్కరు మిగలరు.

అందుకే తిను దినము అంటే ఆయనకు వెయ్యి సంవత్సరాలు ఒక దినం కదా ఆ లెక్కప్రకారం మనిషి జీవించాడు. వెయ్యి సంవత్సరాలు దాటి బ్రతికినవారు ఎవరు లేరు కదా! అంటే ఆయన లెక్కలో తిను దినములోనే మనిషి చనిపోయాడు.  ఆ అతిక్రమము మనకు కూడా వచ్చింది గనుక మనము కూడా ఆ దినములోనే చనిపోతున్నాము. "ఇంత కన్నా ఏంకావాలి ఆయన ఉన్నతమైన ప్రేమకు నిదర్శనం??"

"కీర్తన 30:5. ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును."

2. ఏదెను ఇప్పుడు ఎక్కడ ఉంది? 

ఏదెను అనే మాట "అరమిక్" భాషకు చెందినదని చాలామంది విశ్వసిస్తున్నారు.  దీని యొక్క అర్ధం "ఫలించడం" లేదా "నీరు కట్టబడి ఉండడం."

ఆదికాండంలో ఉన్న సృష్టి, నోవహు జలప్రలళయం, బాబేలు గోపురం లాంటి సంఘటనలు చరిత్రలో వేరే వేరే కధలుగా ఎలా ఉన్నాయో అదేవిధంగా ఏదెను సంఘటన కూడా మెసొపొటేమియలో ఒక రాజు యొక్క కధను ప్రతిధ్వనిస్తుంది. ఒక ఆదిమ మనిషిగా, అతను ఒక వృక్షాన్ని కాపాడటానికి ఒక దైవిక తోటలో ఉంచబడ్డాడు అనేది ఆకధ.  

ఆదికాండంలో ఈతోట ఎక్కడ ఉందో పూర్తి వివరణ లేదు గాని అది తూర్పున ఉన్నట్లుగా ఉంది.  ఆది. 2:8. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.

ఏదెనులో తూర్పున ఆ తోట వేసారో లేక ఏదెనే తూర్పున ఉందో మనకు స్పష్టంగా వివరించబడలేదు గాని, ఒక clue ఆధారంతో పరిశోధనలు కొనసాగాయి.  అదే ఏదెను నుండి బయలుదేరిన నది. ఆధారాలు స్పష్టంగా లేకపోవడం వలన ఏదెను ఎక్కడ ఉండేదో గుర్తించడం కాస్త కష్టమే అయినప్పటికీ అనేక మతపరమైన సంస్థలు దానిని map లో గుర్తించడానికి చాలా ప్రయత్నాలు చేసారు. 

పర్షియన్ గల్ఫ్ లోని ముఖ్యబాగమైన  దక్షిణ మెసొపొటేమియాలో (ఇప్పుడు ఇరాక్)  మరియు అర్మేనియాలో... టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదులు సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. అయితే అసలు ఏదెను.. లెబనాన్, ఇరాక్, పెర్షియన్ గల్ఫ్ లేదా ఆఫ్రికాలో ఉండవచ్చునని చాలామంది నమ్ముతారు.

అయితే మనం ఇప్పుడు యెహెజ్కేలు చెప్పిన వివరణ జాగ్రత్తగా వింటే  ఏదెను యెక్కడుండేదో మనకే స్పష్టముగా అర్ధమైపోతుంది.  

"యెహెజ్కేలు 28:13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి."

"యెహెజ్కేలు 28:14 అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి."

ఆదికాండములో మరుగు చేయబడి యెహెజ్కేలులో మాత్రమే చెప్పబడిన ఈ "దేవుని పర్వతం" యూదుల లెక్క ప్రకారం యెరుషలేములోనే ఉంది.  అదే "సియోను పర్వతం"  Mount Zion.  దీనిని బట్టి ఏదెను తోట యెక్కడ ఉండేదో స్పష్టమైపోతుంది కదా!

2. ఏదెను కొలత ఎంత? 

 ఏదెను తోట ప్రాథమికంగా లెబనాన్ ఈశాన్య పర్వతాల నుండి ఉప్పు సముద్రానికి దక్షిణాన మరియు జోర్డాన్ నదికి తూర్పున మెడిటరేనియన్ దక్షిణానికి ఈజిప్ట్ వరకు ఉంది. "ఇది దేవుని దృక్కోణం నుండి ఒక తోట కానీ మానవుని కోణం నుండి ఒక పెద్ద జాతీయ ఉద్యానవనం". 

తోట పెంపకం మరియు సంరక్షణ మనిషికి అప్పగించబడిన భాధ్యత. ఏదెను చెట్లు మరియు మొక్కలలో సుందరమైన అందాన్ని అందించే వాటితో పాటు అనేక రకాల ఆహారాన్ని అందించేవి కూడా ఉన్నాయి. (ఆది 2: 9, 15) ఈ వాస్తవం మాత్రమే తోట గణనీయమైన పరిమాణంలో విస్తరించి ఉందని సూచిస్తుంది.

ఈ తోట అనేక రకాల జంతువుల జీవితానికి సరిపోయేంత పెద్దది, వాటన్నిటికీ పేర్లు పెట్టడానికి దేవుడు  వాటిని ఆదాము దగ్గరకి రప్పిస్తారు.

 ఏదెను తోట చుట్టూ సహజంగా ఏర్పడిన పర్వతాలే ప్రహరీ గోడలాగా అలంకరించబడి ఉంటాయి. యెహోవా వారిని తోట నుండి బయటకు పంపినప్పుడు తిరిగి రాకుండా ఉండటానికి కెరీబులను తోట “ప్రవేశద్వారం” వద్ద మాత్రమే ఎందుకు ఉంచాల్సి వచ్చిందో ఇది వివరిస్తుంది. ఉదాహరణకు, ఇది పర్వత భూభాగం చుట్టూ విశాలమైన లోయలో తోట చుట్టూ సహజ గోడలాగా ఏర్పడి ఉండవచ్చు.

"ఆది. 2:10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలు దేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను."

2:11. మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.

2:12. ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికము లును దొరుకును.

2:13. రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.

2:14. మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు.

ఇలా తోట మొత్తాన్ని తడపడానికి పంపబడిన నాలుగు నదులను అంచనాగా తీసుకొని ఏదెను తోట ప్రాథమికంగా 200 x 150 చదరపు మైళ్లు అయిఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఆగ్నేయ ఇరాక్‌లోని మార్ష్ అరబ్బులు టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల సంగమం వద్ద జలమార్గాలను దాటి వెయ్యేళ్లు గడిపారు. అయితే, కొన్ని చోట్ల ఆనదులు బలవంతముగా పొడినేలలుగా మార్చబడ్డాయని ఆధునిక పరిశోధన చెబుతుంది. 

1995 నాటికి, పచ్చటి విస్తరణలు పోయాయి. 2001 నాటికి కొన్ని వందల చదరపు మైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2003 లో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పొరుగున ఉన్న ఇరాన్‌తో యుద్ధం తరువాత కొన్ని సంవత్సరాలకు చిత్తడి నేలలను తడపడానికి డ్యామ్‌లను ఏర్పాటు చేశారు.  అప్పుడు ఆ ప్రదేశమంతా నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది.

కొందరు ఈ చిత్తడినేలలను బైబిల్లో ఉన్న ఏదెను తోటగా పరిగణిస్తారు. అది 2016లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరు పొందింది. చారిత్రక చిత్తడి నేలల్లో పురోగతిని satilites ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

3. ఏదెను తోట ఇంకా ఉందా?

ఏదెను తోట ఇక్కడ ఉండిఉండవచ్చు..అక్కడ ఉండిఉండవచ్చు అనే అంచనాలే తప్ప అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవ్వరూ కనుగొనలేక పోయారు.

"ఆదికాండము 3:24 అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను."

దేవుని ఆజ్ఞను దిక్కరించినందుకు మనిషిని ఆ తోటనుండి బహిష్కరించిన తరువాత మనం మాత్రం యెలా కనుగొనగలం? 

ఆదికాండము మొదటి రెండు అధ్యయాలను గమనించిన తరువాత నాకు అర్ధమైన విషయం ఏమిటంటే... "ఏదెను తోట అనేది మొదటి మానవుని పాఠశాల".  దేవుని ప్రేమను, ఆయన సహవాసాన్ని పొందుకొని ఇష్టపూర్వకముగా ఆయనను చేరుకోవడానికి వారికొరకు మాత్రమే ఏర్పాటు చేయబడిన ప్రణాళిక.

దేవుడు ఆదామును పిలిచి ఈ మహాద్భుతమైన ఏదెను వనాన్ని అప్పగించి దానిని ఏలమన్నాడు.  అక్కడ ఉన్న సమస్త జంతువులకు పేర్లు పెట్టమన్నాడు.  ఏ కష్టం లేకుండా దేవుడిచ్చిన ఆహారాన్ని తింటూ ఆనందించమన్నాడు. అంటే దేవుడు అతనిని ఈ భూమి మీద ఒక రాజుగా నియమించాడనమాట. 

"యెహెజ్కేలు 31:9 విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను."
అంటే ఖచ్చితముగా అది చాలా సొగసైన రాజ వనమే అయిఉంటుంది. 
ఆదాము హవ్వ... దేవుని ఆజ్ఞను అతిక్రమించారు.  అద్భుతముగా సిద్ధపరచిన royal garden ని కోల్పోయారు.
కాని దేవుడు భూమి మీద ఒక  temporary తోటకు రాజుగా చేసిన మనిషి గురించే ఇంత ఆలోచిస్తే... "క్రీస్తు రక్తములో కడుగబడిన మనలను రాజులైన యాజక సమూహం అన్నాడు." 
అంటే క్రీస్తు ద్వారా పరలోకంలోకి వెళ్ళబోతున్న మనకు నిత్య రాజ్యములో మనకొరకు చేసిన సిద్దపాటు ఊహకు కూడా అందనంత గొప్పగా ఉంటుంది.
నిజానికి ఆ ఏదెను తోటను ఆదాము హవ్వల కోసం మాత్రమే సిద్దపరచారు గనుక మనము అది ఎక్కడుంది? దాని సంగతేంటి? అని పెద్దగా ఆలోచించక్కరలేదు గాని దాని వెనుక ఆయన ప్రేమ మనపట్ల ఆయన ప్రణాళిక తెలుసుకోవడంలో తప్పు లేదు.

కాని దేవుడు ఇంత ఆనందాన్ని ఇలా రుచి చూడబోతుఉండగా (చేసిన తప్పుకి) అలా దూరం చేశాడంటారా?

లేదు కదా!.... మన ప్రభువు న్యాయము తప్పనివాడు. ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమమునకు, అతను మరియు
అతని ద్వారా సమస్త మానవకోటికి సంక్రమించిన పాపమును బట్టి, ఆయన ఇచ్చిన ఆనందాన్ని ఏమాత్రం తీసివేయలేదు. మనకోసం శాశ్వతమైన ఆనందం ఎదురు చూస్తుంది. "2 కోరింధి 5:1 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము."

4.అంత బావుంటుందా?

"సామెతలు 8:31 ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని."

5.అక్కడికి మనలను ఎవరు తీసుకెళ్తారు?

మన ప్రియమైన యేసయ్య మన కోసం మళ్ళీ వస్తారు. ఆ శాశ్వతమైన తన నిత్య రాజ్యములోకి తనతో పాటు
తీసుకువెళ్తారంట. "అపో.కార్యములు 1:11: మీ యొద్దనుండి నుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే,ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి."
"ఎఫెసీ 2:7 క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను."

Woww.... ఎంత గొప్ప

ఆదిఖ్యత.
6. అక్కడ ప్రభువు మనకి ఎలా కనిపిస్తారు?

ఇక్కడ ఒక సామాన్యుడుగా జీవించి..... ఇప్పుడు మనతో
ఒక స్నేహితునిలా మాట్లాడుతూ... మన గుమ్మము దగ్గర నిలబడి ఎవరు తలుపు తీస్తారా అని ఎదురు చూస్తున్న ఆయన అక్కడ కనబడబోయే రారాజు.

"ప్రకటన 21:22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు.

21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము."

అద్భుతం... చాలా anxiety గా ఉంది కదా! దీనిని ఊహించుకుంటూనే భక్తులందరు ఈ భూమిమీద వారివారి పోరాటాలు ముగించారు.
మనం ఇప్పుడు ఆ పరీక్షలో నిలిచివున్నాము. విశ్వాసపోరాటం పోరాడుతున్నాము. గెలుస్తాము. ఓడిపోము. ప్రభువులా... ప్రభువుతో... ప్రభువు కోసం... ఈ జీవితం. పరలోకంలో ఆయనతోనే ఉండిపోతాము.
ఈ శుభవార్తను ప్రకటించకుండా ఉండగలమా? మనవారిలో ఎవ్వరిని కోల్పోకుండా ప్రయాస పడదాం. ప్రభువుతో జీవిద్దాం.  మరో topic తో మళ్ళీ కలుస్తాను.

GOD IS GOOD ALL THE TIME.

21, ఆగస్టు 2021, శనివారం

14. ఏదెను.. Part 1(ఎలా ఉండేది?)-Reading time 4 minutes

ప్రియమైన స్నేహితులారా,

ప్రభువు నామంలో మీ అందరికి వందనములు.

మనము బైబిల్ చదవడం start చెయ్యగానే ఎన్నో ప్రశ్నలు మనస్సులోకి వస్తూ ఉంటాయి.  ముఖ్యంగా ఏదెను తోటలో హవ్వ ఆదాము గురించి చదివితే కొంతమంది అక్కడే ఆగిపోతారు. మరికొంతమంది, ఇలాగే ఎందుకు జరిగింది? మరోలా జరగవచ్చు కదా! అనుకుంటూ కాస్త భాధపడుతూ మెల్లగా చదవడం continue చేస్తారు. 

ప్రశ్నించే కంటే ముందు మనము తెలుసుకోవాలని దేవుడు దాచివుంచిన విషయాలు చాలాఉన్నాయి. ఏదెను గురించి బైబిల్లో మనము తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని లేఖనాలను అధ్యయనం చేసాక నాకు అర్ధమయ్యింది.  
దేవుడు ఏదెనులో ప్రత్యేకముగా ఒక తోట వేసారు అంటే, అందునా అది "దేవుని తోట" అని ప్రత్యేకముగా పిలువబడింది అంటే అది యెలా ఉండి ఉంటుందో అని యెప్పుడైనా అలోచించారా?
ఏదెను గురించి జాగ్రత్తగా observe చేస్తూ ఉంటే నాకు చాలా విషయాలు అర్ధమయ్యాయి. No doubt మీతో కూడా share చేస్తాను.
ముందుగా ఒకమాట. దేవుడు ఏదేను  గురించి మనకు కూడా చాలా చక్కగా వివరించారు తెలుసా?? ఆ విషయం ఇప్పుడు తెలుసుకోవలసిన అవసరం ఏంటి అంటారా? అవసరమే. ఎందుకంటే మన చాలా ప్రశ్నలకు సమాధానాలు వాటిలోనే దాగున్నాయి మరి. అసలు ఏం జరిగింది అని జాగ్రత్తగా అర్ధం చేసుకుని మనమేమైనా నేర్చుకోవాలేమో చూద్దాం.

మొదటి మానవులైన హవ్వ ఆదాము జీవించిన మొట్టమొదటి అద్భుతమైన ప్రదేశమే ఈ ఏదేను తోట.

ఏదెనులో దేవుడు వేసిన తోట ఎలా ఉండేది?
  •  సృష్టికర్త దృష్టికి చాలాబాగుంది అని అనిపించిందంటే అది ఖచ్చితముగా మన ఊహకు అందనంత అందముగా ఉండే ఉంటుంది. అంటే అది ఒక అద్భుతం.
  • నిరాకారమైన భూమికి రూపము ఇచ్చారు. దానిని అందమైన ప్రకృతితోను, పక్షులు, జంతువులు, జలచారాలతోను అందముగా అలంకరించి దానిని చూచి చాలా సంతోషించారంట, అది మంచిదిగా ఆయనకు అనిపించిందంట. అలాగే అక్కడ నాటిన ప్రతి చెట్టు చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు యోగ్యమైనవిగా ఉన్నాయంట.  (ఆది. 2:9. మరియు దేవుడైన యెహోవా చూపు నకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను). అంటే మనము ఆతోటలోకి అడుగుపెట్టామనుకోండి... ఇక ప్రతి మొక్క, ప్రతి చెట్టు వైపు చూస్తూ అబ్బ... ఎంతబాగుందో అని ఆశ్చర్యపోతూ ఉంటామనమాట. "యెషయా51:3 యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును."
  • ఏనాడూ వాన కురవని, సేద్యపరచని నేలమీద మంటిని తీసుకుని నరునిగా తయారుచేసి, ఆ  మట్టి బొమ్మను తన దివ్యమైన ముఖమునకు దగ్గరగా పెట్టుకొని తన నోటితో జీవవాయువుని ఊదగా ఆ బొమ్మ జీవించే మనిషిగా అయ్యాడు.
  • ఆమనిషిని తీసుకొని అందమైన ఈ ఏదెను తోటలో ఉంచినప్పుడు ఆదాము ఒక్కొక్క చెట్టును చూస్తూ పరవశించిపోతూ ఉండిఉంటాడు.  ఆ time లో దేవుడు ఆదామును పిలిచి ఇక్కడ ఉన్న పండ్లన్నీ ఆహారమునకు యోగ్యమైనవే. నువ్వు నిరభ్యంతరముగా తినొచ్చు. కాని మంచి చెడ్డల తెలివినిచ్చు ఒక చెట్టును చూపించి ఈ చెట్టు పండు మాత్రము ముట్టుకోవద్దు. అది తింటే నువ్వు చచ్చిపోతావు అనిచెప్పారు.
  • అందులో బాధపడడానికేముంది? అన్ని చెట్లు చూపుకి రమ్యముగా, వాటిపండ్లు మధురముగా ఉన్నప్పుడు... అలాంటి అందమైనదే మరో చెట్టు... దాని పండ్లు తింటే చచ్చిపోతాము అని తెలిసినప్పుడు దానిని తినవలసిన అవసరం ఏముంది? అయ్యో దీనిని miss అయ్యాము అని feel అవ్వాల్సిన పనే లేదుకదా!
  • అలాగే అనుకున్నాడు ఆదాము. దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నాడు. కాని అదే కదా మరి సాతాను తట్టుకోలేని విషయం. మెల్లగా enter అయ్యాడు. హవ్వను ప్రలోభపెట్టాడు.  అంతే.... అక్కడ ఉన్న ప్రతి చెట్టు అందంగానే ఉంది.  కాని హవ్వ దేవుడు ఏ చెట్టు అయితే ముట్టొద్దు అన్నాడో ఆ చెట్టును చూసి చాలా బాగుంది అనుకుంది. (స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను; ఆది 3:6). మోసానికి గురయ్యింది. ఆజ్ఞను అతిక్రమించింది.
ఆచెట్టును ముట్టుకుని దాని పండు తింటే ఇంత ఉపద్రవం మీదకు వస్తుందన్నప్పుడు దేవుడు ఆ చెట్టుని అక్కడెందుకు పెట్టారన్నది మన సందేహం కదా!
దేవుడు మనిషిని చేసిన తరువాత తన ప్రేమనంతా కనపరచి, ఆ ప్రేమను పొందుకొని ఇష్టపూర్వకముగా తన మాటకు లోబడి ఆయనతో సహవాసం చేసి, నిత్యము ఆయనతోపాటు మనము ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం.  అందులో భాగమే ఈ చెట్టు.  చెట్టులో యే విశేషమూ లేదు గాని, ఆయన ఆజ్ఞకు లోబడడమే విషయం.

ఇందులో మనం తెలుసుకోవలసిన విషయం ఏముంది?

మోసం.  అవును మోసమే. హవ్వమ్మకు జరిగిన మోసం.  ఈ రోజుకి మనము కూడా ఎన్నో విషయాలలో అలాగే మోసపోతున్నాము.
తోటంతా చూపుకి రమ్యముగా ఉన్నప్పటికీ దేవుడు వద్దని చెప్పి అజ్ఞాపించిన చెట్టుని చూపించి అదొక్కటిమాత్రమే రమ్యముగా ఉన్నట్లు సాతాను హవ్వమ్మను బ్రమింపచేసినట్లుగానే....
1. దేవుడిచ్చిన  సంతోషం, ప్రేమ మన చుట్టూ ఉండగా... నువ్వు ఏదో miss అయ్యావు అన్నట్లు ఈ లోక ప్రేమలవైపు నడిపించి దేవుని ఉద్దేశం నుండి దూరమయ్యేలా చేస్తున్నాడు.
2. నిత్యమైన బంగారు వీధులలో నడవబోతుండగా... ఆశాశ్వతమైన ఈ లోక బంగారం కోసం పరితపించేలా చేస్తున్నాడు.
3. ప్రభువుతో గడపవలసిన విలువైన సమయంలో అంతకన్నా interesting విషయాలు చాలా ఉన్నాయి mobile పట్టుకో అంటాడు. అలా మోసపోయే ప్రభువుతో సహవాసాన్ని  కోల్పోతున్నాము.  ఇలా ఎన్నో ఉన్నాయి.
"యోహాను 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు."

కాని ఒక్కటి మాత్రం నిజం.

ఈ లోకంలో ఉండే ఆనందం అంతా యేసులో దొరుకుతుంది.  కాని యేసయ్యలో ఉండే ఆనందం మాత్రం ఈ లోకంలో దొరకదని ఆయన ప్రేమలో జీవిస్తున్న మనందరికి తెలుసు.
నిత్యము మన హృదయాన్ని వాక్యముతో నింపుకుంటున్నప్పుడు ఇలాంటి ప్రలోబాలనుండి తప్పించుకోగలుగుతాం. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించినప్పుడు ఆకువాడని చెట్టులా ఉంటాము.

 ఏదెను గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.  తక్కువ time gap లో publish చెయ్యాలని చిన్న చిన్న parts గా divide చేసి మీ ముందుకు తెస్తున్నాను.  
1. దేవుడు ఆ చెట్టు పండు తింటే ఆ రోజే చచ్చిపోతావు అని ఆదాము తో అన్నారు కదా మరెందుకు ఆ రోజు చావలేదు? 
2. ఏదెను ఇప్పుడు ఎక్కడ ఉంది? దాని size ఎంత?
ఆధారాలతో మళ్ళీ కలుస్తాను.  దేవుని కృప మీతో ఉండుగాక.

28, జులై 2021, బుధవారం

13. నాయకుడు.. (గమ్యం చేరని యాత్రికుడు) Part-3

ప్రియమైన స్నేహితులారా,

ఆశ్చర్యకరుడైన  యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు.

మొదటి, రెండు parts చూసిన తర్వాత దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అనిపించుకున్న గొప్ప దైవజనుని జీవితాన్ని మనకు స్పష్టముగా వివరించి అతనిని మనకి ఒక మాదిరిగా పెట్టిన దేవాదిదేవున్ని ఘనపరుస్తున్నాను.

ముందుగా అనుకున్న ప్రకారం రెండు parts ముగించుకొని మూడవ part లోకి అడుగుపెట్టాము. వాటిని చూడాలి అనుకుంటే వాటి లింక్స్ కూడా ఇస్తున్నాను గమనించండి.

1. నాయకుడు... (చరిత్రలోని మోషే) Part -1  https://biblestudynavigatortelugu.blogspot.com/2021/03/10-part-1-new.html -    ఈ link click చేస్తే first topic దొరుకుతుంది.

2. నాయకుడు.. (లేఖనాలలో మోషే) Part-2  https://biblestudynavigatortelugu.blogspot.com/2021/06/12-part-2.html

3. నాయకుడు.. (గమ్యం చేరని యాత్రికుడు) Part-3

ఇక విషయంలోకి వస్తే మోషే ప్రతి విషయంలోనూ నమ్మకముగా ఉండి దేవుని చేతే సాక్ష్యం పొందాడు గనుక అతను పొందుకున్న వాటిలో ఏమి తక్కువ కాలేదు అనుకున్నాము కదా! కానీ ఒక విషయంలో నేను చాలా disappoint అయ్యాను. అదేంటో మీకు కూడా తెలుసు. 40 సంవత్సరాలు అవిశ్రాంతముగా, అవమానాలు నిందలు భరిస్తూ ఏ వాగ్దాన దేశంలో అడుగుపెట్టాలని ఆశతో నడిచాడో ఆ నేలమీద కాలు కూడా పెట్టలేదంట. ఆ దేశాన్ని కళ్ళతో చూడు కానీ అక్కడికి వెళ్లొద్దు అని దేవుడు చెప్పారు. (ద్వితీయ. 34:4).   

అంటే ఇంత కష్టపడి ప్రయాణం చేసిన  ఈ యాత్రికుడు అనుకున్న గమ్యం చేరలేదు. ఎందుకు? అసలు ఏమయ్యింది?? అతని నమ్మకత్వాన్ని ఘనపరచి దేవుడు అతనికి ఇచ్చిన బహుమతి ఇదేనా?

ఆ విషయమే తెలుసుకోవాలని మరలా మోషే గురించి పరిశీలన మొదలు పెట్టాను.

మనం general గా ఆలోచిస్తే ఎక్కడికైనా వెళ్లాలని ప్రయాణం ప్రారంభించినప్పుడు ఒకవేళ ఆ trip cancel అయ్యిందని తెలిస్తేనే చాలా బాధపడతాము. లేదంటే ఒకరోజు journey చేసి వెళ్లి సరిగ్గా అనుకున్న చోటుకి వెళ్లకుండా వెనక్కి రావలసి వచ్చిందనుకోండి. ఇక ఆ భాధ అస్సలు చెప్పలేము.

మరి 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన మోషే గారు destination లో అడుగు పెట్టకుండా, అంటే గమ్యం చేరకుండా ఈ యాత్రికుడు తనువు చాలించాడు అని అంటే వినడానికే ఎంతో భాధగా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏమిటంటే మోషే గారు అస్సలు నిరుత్సాహపడలేదంట. సంతోషంగానే అంగీకరించాడంట. ఎందుకంటారా... Study చేద్దాం మరి అప్పుడే కదా మనం కూడా పాఠం నేర్చుకోగలం.

1. ఒకవేళ దేవుడు మోషేకి punishment ఇచ్చారా?

మోషే అన్ని విషయాలలోనూ నీతిగానే నడుచుకున్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనిపించుకున్నాడు  కాని ఒకవిషయంలో దేవుడు ఆజ్ఞాపించినట్టు కాకుండా తనకు తోచినట్టు చేసాడు. మరి ఆజ్ఞాతిక్రమము పాపమే కదా! దేవుడు న్యాయధిపతి కాబట్టి ఏ ఒక్కరి విషయంలోనూ నీతి తప్పిపోడు కదా! కాబట్టి వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టనివ్వకపోవడమే మోషేకి వచ్చిన తీర్పు.

2. అవునా!!... అయితే మోషే చేసిన ఆ తప్పు ఏమిటి?

ఇశ్రాయేలు జనాంగము మార్గమధ్యలో నీరు దొరకనప్పుడు దేవునిని ప్రార్ధించడం మానేసి మోషేని ప్రభువుని నిందించడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రభువు మోషేని పిలిచి అక్కడ బండతో మాట్లాడమన్నారు కానీ మోషే ప్రజలందరి ఎదుట బండను తన కర్రతో కొట్టాడు. ఒక   నాయకుడుగా దేవుని సహవాసంలో నడుస్తున్న వ్యక్తి అలాచేయడం  మరి తప్పే కదా! (ద్వితీయో. 32:51-52)

3. మరి మోషేగారు భాధ పడ్డారా?

మనకులాగే మోషేగారికి కూడా యెన్నో లక్ష్యాలు ఉండే ఉంటాయి. వాగ్ధాన దేశంలోకి అడుగు పెట్టాక ఇది చెయ్యాలి.. అది చెయ్యాలి.. నా కుటుంబానికి నా ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలి అని యెన్నో కోరికలతో ప్రయాణం సాగిస్తున్నాడు. చెప్పాలంటే వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం అనేది మోషేకి ఒక  dream. అందుకే అన్నీఓర్చుకున్నాడు.  యెన్నో పాఠాలు నేర్చుకున్నాడు. 

అలా నేర్చుకుంటున్నప్పుడు అతనికి, నేను వాగ్దాన భూమిలోకి వెళ్లినప్పటికీ అది కొంతకాలమే మరియు స్థిరమైన గమ్యస్థానం మరొకటి ఉంది దాని కొరకు ఎదురు చూడాలి అనే  విషయం స్పష్టంగా అర్ధమయ్యింది.  మోషే మాత్రమే కాదు.  ఆ విషయాన్ని గ్రహించిన అనేకమంది భక్తులు సంతోషంతో మృతిపొందారంట.

4.మోషే లాగా శాశ్వతమైన పరలోకాన్ని గర్తించిన వారు చాలామంది ఉన్నారు.

పౌలు: హెబ్రి 11:13-16 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.

14. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?

15. వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.

దావీదు: యెహోవా, నా ప్రార్థన ఆలంకిపుము నా మొఱ్ఱకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగానుండకుము నీ దృష్టికి నేను అతిథివంటివాడను నా పితరులందరివలె నేను పరవాసినైయున్నాను కీర్తనల గ్రంథము 39:12

యాకోబు: ఆదికాండము 47:9 9. యాకోబు-నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పెను.

పేతురు: 1 పేతురు 2:11 ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ లను విసర్జించి,

మరి  మనసంగతేంటి?

ఈ జీవిత ప్రయాణం ఏదో ఒక రోజు ముగిసిపోతుంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా... అనుకున్నవన్నీ సాధించినా సాధించకపోయినా... ప్రభువు పిలవగానే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.

మనకి మరణం అనే మాట వినిపిస్తేనే భయం.  కాని మనం కూడా ఆవిషయాన్ని గ్రహించాలని ప్రభువు ఉద్దేశ్యం. 

ఉదాహరణకి.... ఒక director ఒక సినిమా తీస్తున్నాడనుకోండి. ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క role అప్పగిస్తాడు. Shooting అవుతున్నంతసేపు ఎవరి పాత్ర వాళ్ళు సరిగ్గా పోషించాలి. Shooting పూర్తికాగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. మన జీవితం కూడా అలాంటిదే! 

సూర్యుని పొద్దు వాలిందంటే సూర్యుని కధ ముగిసిపోయినట్టేనా? మరో చోట ఉదయించడానికి వెళ్తున్నాడు కదా!  అలాగే ఇక్కడ మట్టిలో కలిసిన మనం ప్రభువు రాజ్యంలో మహిమ దేహంతో ఉదయిస్తాము. అదే మన నిరీక్షణ... నిగూఢ సత్యం.

మన జీవితంలో ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాము.  అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పాటుపడడంలో తప్పులేదు. నిజానికి అది మంచిదే. కానీ మట్టిలో కలిసిపోయే ఈ శరీరాన్ని తృప్తి పరిచే విపరీతమైన లక్ష్యాలు పెట్టుకోవడం వాక్య రీత్యా వ్యర్థం.

ఈ లోకంలో మనం అనుకున్న గమ్యం చేరలేదని విచారించడం బుద్ధిహినత.  ఇది యాత్రే కానీ మన గమ్యం ఇది కాదు. మన గమ్యస్థానం పరలోక రాజ్యం.

మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు 1 దినవృత్తాంతములు 29:15.

ఈ సందర్భంలో మనం నివసిస్తున్న భూమి గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితం అలాగే మనం నివసిస్తున్న ఈ భూమి అన్నీ కనుమరుగయిపోతాయి. పరలోకం మాత్రమే మనకు శాశ్వతం.  సృష్ట్యారంభం నుండి ఇంతవరకు భూమి ఎంతగా మారిపోయిందో తెలుసా??

భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు మెల్లగా దానిలో  చాలా  మార్పులు వచ్చాయి.  చాలా జీవులు అంతరించి పోయాయి. కొన్ని మార్పులు కొత్తగా అనిపించినప్పటికీ భూమి కూడా అంతమునకు సమీపిస్తుందని యెన్నో పరిశోధనల సారాంశము.  
యెషయా 51:6 ఆకాశమువైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును భూమి వస్త్రమువలె పాతగిలిపోవును అందలి నివాసులు అటువలె చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు.
2 పేతురు 3:10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును
ప్రకటన 21:1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.

మరి మన ప్రభువు మరియు ఆయన నివసించే పరలోకం?

2 కొరింధి 5:1 భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. 
కీర్తన 102:27  నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
మలాకి 3:6  యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.
మోషే గమ్యం చేరలేదని అనుకున్నామా!! కానీ మోషే ఏమన్నాడో తెలుసా?....అస్థిరమైన ఈ లోక లక్ష్యాలను... గమ్యాన్ని నేను చేరక పోయినా ఏమిపర్వాలేదు. యెందుకంటే నిత్యమైన పరలోకంలోకి నాకు అవకాశం వచ్చేసింది.

అవునా? రుజువేంటి?

మార్కు 9:4 మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి.
లూకా 9:30 మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అను వారు.

అవును నిజమే.... మోషే చేసిన పని దేవునికి విరోధమైనది కాబట్టి దేవుడు అతనిని తగుమాత్రము శిక్షించి అతను చూపిన నమ్మకత్వానికి శాశ్వతమైన బహుమతిని పరలోకమందు ప్రభువు అతని కొరకు సిద్ధపరచి ఉంచాడు.
భక్తులు నమ్మి ఎదురుచూస్తూ వారి భూలోక యాత్ర ముగించినట్టు మనము కూడా ఆబాటలోనే నడువవలసిన వారమై యున్నాము. "హెబ్రీ 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను."

  • మన నిజమైన గమ్యస్థానం అనగా పరలోకం గురించి అది ఎలా ఉండబోతుందో యేసు ప్రభువు వారు ఎన్నో ఉదాహరణలుగా వివరించారు.
  • ఆయన వివరించిన విధానాన్ని ఇప్పుడు అద్దంలో చూసినట్టు చూస్తున్నాము అయితే త్వరలో ప్రత్యక్షముగా మనకన్నులతో చూసి ఆ ఆనందములో పాలు పంచుకోబోతున్నాము.
  • ఈ భూమి, ఈ జీవితం, మన కుటుంబం, స్నేహితులు, ఇంకా ఎన్నో..... చాలా బాగున్నాయి కదా! ఈ బంధాలు... బాంధవ్యాలు... ప్రేమలు... అద్భుతం. నిజంగా వీటిని విడిచి వెళ్లాలని లేదు కదా! ఈ ఆనందములో కలకాలం ఉండిపోవాలనుంది కదా! నిజంగా నేను అలాగే feel అవుతున్నాను. కాని ఒక సత్యం నన్ను ఇంకా ఆనందముతో నింపేసింది.
Friends,

మన ముందు నుండి ఇలా కనబడి అలా మాయమైపోయే జీవితమే ఇంత ఆనందముగా ఉంటే..... ఎప్పటికీ చెరిగిపోని, తరిగి పోని, మారిపోని ఆనందములోకి అడుగుపెట్టబోతున్నాము, అది ఇంకెంత బాగుంటుందో. ఆ ఆనందాన్ని ఎవ్వరు మననుండి తీసివేయరు.  మనము ఎవ్వరిని కోల్పోము. Wow... అద్భుతం... 

కాకపోతే ఒక చిన్న హెచ్చరిక. మనము పరలోకానికి వెళ్ళడానికి యోగ్యత సాధించామని నమ్మకం వచ్చిన తర్వాత అనగా ప్రభువు రక్తములో కడుగబడి ఆయన మార్గములో నడుస్తున్నప్పుడు మన వారందరు కలసి అక్కడికి చేరాలన్నదే మన ప్రార్ధన.

ఈ యాత్ర ముగిసే వరకు ప్రభువు కోసం పనిచేద్దాం.. ఆయన పిలిచినప్పుడు అలనాటి భక్తుల్లా సంతోషంగా వెళ్ళిపోదాం.
మరో topic తో మళ్ళీ కలుస్తాను. ప్రభువు కృప మనతో ఉండుగాక. Amen!


17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...