26, ఆగస్టు 2020, బుధవారం

3. వెలుగు (THE LIGHT)

 ప్రియ స్నేహితులారా,

మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను.


గత 'సృష్ఠి కర్త సృష్ఠి' అనే అంశంలో మన దేవాతి దేవుడు చేసిన ఈ గొప్ప సృష్ఠి గురించి కొంతవరకు ధ్యానించు కున్నాము. ఆయన చేసిన కార్యములన్నిటి గురించి చెప్పుకోవడానికి మనకు మాటలు చాలవు, కాని కొన్ని సంగతుల గురించి ధ్యానించక తప్పదు. ఎందుకంటే, మన సృష్టికర్తయైన ప్రభువు, తాను చేసిన సృష్ట్యాలను (Creations) ఎన్నోవాటిని మనకు ఛాయా (Shadow) రూపముగా  ఉంచారు. వాటిని ధ్యానించడము ద్వారా మనలో విశ్వాసం ఇంకా బలపడుతుంది, కాబట్టి వాటిలో ఒక్కొక్కటిగా మీముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.

ఇప్పుడు మనము ఎంచుకున్న ధ్యానాంశం 'వెలుగు'  (THE LIGHT), లోనికి నడుద్దాం రండి. 

ముందుగా 'వెలుగు' అనే  అంశం గురించి లోకంలో ఉన్న మేధావులు, పరిశోధకులు ఏంచెబుతున్నారో చూసి, ఆ తరువాత లేఖనాలలో ఉన్న ప్రభువు వెలుగు యొక్క స్పష్టతను అవగాహన చేసుకుందాము.

మానవ జ్ఞానమునకు అందిన విషయాలను ప్రశ్న మరియు జవాబు రూపంలో ఈ క్రింద పొందు పరుస్తున్నాను చూడండి. 

1. వెలుగు లేక కాంతి అంటే ఏమిటి?

కాంతి అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి వీలు కల్పించే ఒక రకమైన శక్తి. మన దైనందిన జీవితంలో వెలుగు ఒక ముఖ్య అంశం. ఇది రోజంతా మనకు మార్గనిర్దేశం చేస్తుంది, ఉదయాన్నే మేల్కొలపడానికి మరియు రాత్రి నిద్రపోయేలా చేస్తుంది. కాంతి అనేది విలోమ, విద్యుదయస్కాంత తరంగం, దీనిని సాధారణ మానవుడు చూడగలడు. 

2. ఈ 'వెలుగు' ఎక్కడనుండి వస్తుంది? 

మన ప్రధాన సహజ కాంతి వనరులు సూర్యుడు, నక్షత్రాలు. సూర్యుడి నుండి వచ్చే కాంతి అంతరిక్షంలో ప్రయాణించిన తరువాత, వాతావరణంలోని వివిధ కణాలు మరియు అణువులను తగిలినప్పుడు అది “చెల్లాచెదురుగా” అవుతుంది. అప్పుడు ఆ  కాంతి  భూమి యొక్క ఉపరితలానికి చేరుకుంటుంది.

3 .మానవులు కాంతిని ఎలా ఉపయోగిస్తారు?

 సూర్యుడి  నుండి వచ్చిన  కాంతి మన చుట్టూ ఉంది. మనము దీన్ని భావ వ్యక్తీకరణ (Communicate) చేయడానికి, (Navigate) దిశానిర్దేశం చేయడానికి, నేర్చుకోవడానికి మరియు అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. మన కళ్ళతో మనం గుర్తించగలిగే దానికంటే కాంతి చాలా ఎక్కువ. అంతరిక్షంలో లేదా చంద్రునిపై కాంతిని విచ్చిన్నంచేసే వాతావరణం లేదు. సూర్యుడి నుండి వచ్చే కాంతి విచ్చిన్నమవ్వకుండా అన్ని రంగులు కలిసి సరళ రేఖలో ప్రయాణిస్తుంది. 

4. కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది?

శూన్యంలో కాంతి వేగం సెకనుకు 1,86,282 మైళ్ళు (సెకనుకు 2,99,792 కిలోమీటర్లు), మరియు సిద్ధాంతం ప్రకారం కాంతిని మించిన వేగం మరి దేనికి కూడా లేదు. గంటకు (మైళ్ళలో), కాంతి వేగం చాలా ఎక్కువ: సుమారు 670,616,629 mph.

5. వెలుగు లేకపోతే ఏమి జరుగుతుంది?

వెలుగు లేకపోతే మన కండ్లకు ఏమీ కనిపించదు. మన కన్నులు చూడడానికి శక్తినిచ్చేది వెలుగే కాబట్టి, వెలుగు లేకపోతే మనము అంధులమైపోతాము. కిరణజన్య సంయోగక్రియ జరగడం వలన మొక్కలు ఆక్సిజన్‌ను ఇస్తాయి, ఇది గురుత్వాకర్షణకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వెలుగు లేకపొతే, ఇదంతా సాధ్యపడదు. ఇప్పుడున్న మానవ జీవితం అగమ్యగోచరంగా ఉంటుంది.

ఇప్పుడు లేఖనాలలోకి వెళ్దాం రండి.

వెలుగు ఎలా వచ్చింది? అనే ప్రశ్న వేస్తే, దేవుడు "వెలుగు కలుగును గాక" అనే ఒక్క మాటతో వెలుగును సృష్టించెను అని వాక్యం చెబుతుంది. అప్పుడు ఆయన, వెలుగును చీకటిని వేరు పరచి, వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టిన తరువాత వెలుగును చీకటిని ఏలడానికి సూర్యుడిని, చంద్రుడిని చేసారు.

దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను." ఆదికాండము 1:16-18.

అంటే సూర్యుడిని సృష్టించడానికి ముందే దేవుడు వెలుగును చేసారు కదా! ఆ వెలుగు ఎక్కడినుండి వచ్చింది? దీనికి సమాధానం యోబు గ్రంధంలో దేవుడే ప్రశ్న రూపంలో చెబుతున్నారు. "వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?"  యోబు 38:19. అనగా వెలుగు నివసించే చోటు వేరే ఉందన్నమాట. అయితే అది ఎక్కడ? ఆ వివరణ దానియేలు దగ్గర ఉంది. "వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది." దానియేలు 2:22. దావీదు కూడా మరో స్పష్టత ఇస్తున్నాడు-"వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు." కీర్తన 104:2. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. 1యోహాను 1:5.

అంటే ఆయన తన  వెలుగునే  మనమీద ప్రసరింప జేస్తున్నారన్నమాట. "సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లు చున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది." హబక్కూకు 3:4 ; సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 1 తిమోతికి  6:16.

దీనిని బట్టి నాకు అర్ధమైన విషయం ఏమిటంటే- మన తండ్రియైన దేవుడు, తన వెలుగునే, చీకటి ఆవరించి ఉన్న ఈ మహా విశ్వంమీదకు కలుగును గాక అని పలికారు. తరువాత ఆ వెలుగును చీకటిని వేరు పరచి ఆకాశమండలమునకు కట్టడలను నియమించారు. యోబు 38:33 "ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?".

మనము ఏదో అనుకోకుండా పుట్టిన వెలుగులో ఉండలేదు. సర్వశక్తిమంతుడైన దేవుని చుట్టూ ఆవరించబడి ఉండే ఆ వెలుగులోనే ఉన్నాము. "యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగునను గ్రహించియున్నాడు" కీర్తన 118:27 అని ఆత్మ ద్వారా  ఆ విషయాన్ని గ్రహించినవాడై దావీదు "యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింప జేయుము." కీర్తన 4:6 అని బ్రతిమాలుకుంటున్నాడు.

మనము చూచుచున్న ఈ వెలుగు ఆయనది. ఆయన ముఖప్రకాశము. ఆయన సన్నిధినుండి, ఆయన మాటకులోబడి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి వస్తున్న వెలుగును మనము చూస్తున్నాము. మరికొంతకాలమైన తరువాత ఈ సూర్య చంద్రులు ఇక ఉండరు. ఇప్పుడు ఛాయగా చూస్తున్న ఆయన వెలుగును మనము కన్నులారా చూచి ఆయనలో అనందిస్తాము. "ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును." యెషయా 60:19,20.

ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. ప్రకటన 21:23

ఆయన సన్నిధినుండి వచ్చిన ఈ వెలుగే ఎంతో గొప్పగా మనకు కనిపిస్తూఉంటే, మరి ఒకవేళ ఆయన సన్నిధికి చేరి అక్కడే యుగయుగాలు ఆయనతో గడిపే అవకాశం వస్తే వదులుకుంటామా? అస్సలు వదులుకోము కదా! వదులుకోవద్దు. ఎందుకంటే, ఆ అవకాశాన్ని కూడా ఒక వెలుగు రూపంలో మన తండ్రియైన దేవుడే మన కోసం పంపించారు. "నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు." యోహాను 1:9,10.

ఆ విషయాన్ని గ్రహించిన కోరహు కుమారులు ఆత్మపూర్ణులై ఆయనను ఎలా స్తుతించారో చూడండి. 
"నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును." కీర్తన 43:3 

ఆ వెలుగు మనలను ఆయన నివాసస్థలమునకు తీసుకొని వెళ్ళాలని మనుష్యకుమారునిగా వచ్చి, "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను." యెషయా 60:1, అని చెప్పారు. ఇప్పుడు ఆయనను అంగీకరించి, ఆయనను వెదకిన యెడల, "నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి." కీర్తన 90:8, కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ఆ నిజమైన వెలుగు, సూర్యుని వెలుగైనను, చంద్రుని కాంతి అయినను అక్కరలేని ఆ నిత్యరాజ్యములో ప్రవేశించడానికి మనలను నడిపిస్తుంది.  "మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను." యోహాను 12:46.

ఆ వెలుగు మన ప్రభువైన యేసు క్రీస్తు. " యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. యోహాను 8:12, ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. యోహాను 1:4. "నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను." యోహాను 9:4; నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. యోహాను 12:46. 

"అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు." ఎఫెస్సీ 5:14. మనలను చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసి, మనము వెలిగింపబడిన మీదట అనేకులను ఆ వెలుగు లోనికి నడిపించాలని మనలను, ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజకసమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవునికి సొత్తయిన ప్రజలుగాను చేసి యున్నారు. మనము పరిపూర్ణముగా ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు........."అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు." మత్తయి 24:30,31.

ఆయన వెలుగులో పుట్టిన మనము, ఆత్మీయ చీకటిలో పడిపోయినప్పుడు, తన కుమారుణ్ణి వెలుగుగా పంపించి, ఆయన వెలుగులో వెలిగింపబడి, ఆయన వెలుగులోనే నడుస్తూ నిత్యరాజ్యములోనికి ప్రతి ఒక్కరు ప్రవేశించాలనే ఆ మహాఘనుని ప్రణాలిక అత్యద్భుతం. ప్రభువు మనకు ఏమాత్రం దూరంలో లేరు. మనతోనే ఉన్నారు, మనలోనికి ప్రవేశించి మనలను వెలిగించారు. ఆయన వెలుగుగా వచ్చి, మనలను వెలుగుగా చేసారు. 

ప్రభువు మాటలను చదువుతూ ఉంటే మనస్సు ఉప్పొంగి పోతుంది కదా! ఇప్పుడు సమయం ఆగష్టు 26 అర్ధరాత్రి 3 అయ్యింది. ఆ ప్రేమామయుని ప్రణాలికలను ధ్యానిస్తూ ఉంటే, ఆయన వెలుగులో పరవసిస్తున్నాను. ఇంకా చాలా చెప్పాలని ఉంది. దావీదు అన్నట్టు క్రొవ్వుమెదడు దొరికినట్లుగా నా ప్రాణము కూడా తృప్తి పొందుచున్నది.

మీరుకూడా ఆ లేఖనాలను ధ్యానించి ఆ దివ్యమైన వెలుగులో పరవసించండి. ప్రభువు కృప మీకు తోడుగా ఉండు గాక.

Light of the world

You stepped down into darkness

Opened my eyes, let me see

Beauty that made this heart adore You

Hope of a life spent with You

Here I am to worship

Here I am to bow down

Here I am to say that You're my God


"వెలుగు" అనే అంశం మీద వచనాలన్ని క్రింద ఉన్నాయి, గమనించండి.

1. ఆదికాండము: 1:3,4,5,15

2. యోబు        :22:28; 29:3, 29:24; 33:28,29; 36:30; 38:19,24.

3. కీర్తనలు       :4:6; 18:28; 27:1; 36:9; 37:6; 43:3; 44:3; 74:16; 78:14; 89:15; 90:8; 97:11; 104:2; 112:4; 118:27; 119:105,130

4. యెషయా    :2:5; 9:2; 42:7; 45:7; 60:1,3,19,20

5. దానియేలు   :2:22

6. మీకా          :7:8,9

7. హబక్కూకు : 3:4

8. మత్తయి      :5:14,16; 17:2; 24:30

9. లూకా          :1:79; 2:32

10. యోహాను  :1:4,5,7,9; 8:12; 9:4; 12:36,46

11. 2 కొరింధీ     :4:5 

12. ఎఫెస్సీ        :5:8,13,14

13. 1 థెస్స        : 5:5

14. 1 తిమోతి    :6:16

15. 1 యోహాను : 1:5

16. ప్రకటన        :21:23; 22:5.






:

18, ఆగస్టు 2020, మంగళవారం

2. సృష్ఠి కర్త సృష్ఠి


దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

ప్రియమైన స్నేహితులారా,

దేవాది దేవుడైన యెహోవా ఈ సృష్టి అంతటిని కలుగజేసాడని మనకు తెలుసు, అయినప్పటికీ, మనం ఆ క్రమమును  లేఖనాల నుండి  అధ్యయనం చేస్తున్నప్పుడు, మనలో చెప్పలేని ఆనందం మరియు ఆయనపై, ఆయన కార్యాలపై  స్థిరమైన విశ్వాసం కలుగుతుంది.

లేఖనాల అధ్యయనం ద్వారా నేను నేర్చుకున్న కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను.

దేవుడు ఈ సృష్టి అంతా ఎందుకు చేశాడు? ఎలా మరియు ఎప్పుడు జరిగింది? మనకు ఇలాంటి సందేహాలు చాలా కలుగుతూ ఉంటాయి. కానీ, మనకు ఎంతవరకు అవసరమో అన్ని విషయాలు,  ఇంకా ఇప్పటివరకు మనకు అర్థం కాని చాలా విషయాలు గ్రంథములో పొందుపరచబడ్డాయి. మనం వాటికి మించి ఆలోచిస్తే, అది మన జ్ఞానానికి అందనిది. కాబట్టి మనకు ఏ విషయాలు  బయలుపరచబడ్డాయో వాటినే ధ్యానించుకుందాం.

లేఖనాలను పరిశీలిస్తే, మొదట దేవుడు శూన్యమండలముపైన ఆకాశమును సృజించి దానిని విశాలపరిచెను అని యోబు భక్తుడు అంటున్నాడు. 'యెషయా' కూడా దేవుడు ఆకాశాలను సృష్టించి, వాటిని విస్తరించాడని చెప్పాడు. అప్పుడు దేవుడు నక్షత్రాల సమూహములను బయలుదేరజేసి, ఒక్కొక్కటిగా పేర్లు పెట్టి పిలుస్తాడంట(యెషయా40:26). తన అధికశక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచి పెట్టడు అని వాక్యం చెబుతుంది.

తరువాత, యోబు గ్రంధములో, దేవుడు భూమిని చాలా ప్రత్యేకమైనదిగా చేశానని ఆయనే వివరించాడు. ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మూలరాతిని వేశారంట. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు భూమిని సిద్ధం చేసి స్థిరపరిచారు.

దేవుడు భూమిని ఎంత ప్రత్యేకమైనదిగా చేశారంటే, నిరాకారంగా ఉన్నదానిని  తీసుకొని,  నివసించటానికి యోగ్యముగా నిర్మించారు. అప్పుడు భూమిపై, ఆయన ఉద్దేశించిన ప్రతిదాన్ని ఏర్పాటు చేసి, ఆ తరువాత మనలను తన స్వరూపంలో మనుషులుగా చేశారు. దేవుడు మనలను ఆశీర్వదించి, “ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోమన్నాడు. సముద్రంలోని చేపలు, ఆకాశంలోని పక్షులు మరియు భూమిపై కదిలే ప్రతి జీవిని ఏలమన్నాడు.”

మరియు ఈ సృష్టినంతటిని  మనకు అప్పగించి, ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నారు?

దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడా? మరియు మనకు నచ్చిన విధంగా మనము జీవించవచ్చా? సమాధానం - 'కాదు' అనే వస్తుంది. హెబ్రీ 4:13 ఏంచెబుతుందంటే : మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

ఆయన మౌనంగా లేడు. "నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే." అని చెప్పి మనకోసం యెదురుచూస్తున్నాడు. 

దేవుడు మన కోసం ఇంత అందమైన సృష్టిని చేసాడు, అయితే మనపట్ల ఆయన ఉద్దేశ్యం ఏమిటి? మనం ఏమి చెయ్యాలి?  దానికి పౌలు సమాధానము చెబుతున్నాడు. " మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము."  ఎఫెస్సీ 2:10 

ఇలాంటి కఠినమైన రోజుల్లో మనం ఇరుక్కున్నప్పుడు, కష్టాలు కన్నీళ్లతో నలిగిపోతున్నప్పుడు, వ్యాధులు మన చుట్టూ ఉన్నప్పుడు, దేవుడు మన గురించి పట్టించుకుంటాడా? అని అనిపిస్తుంది కదా!

ఈ సృష్టిని దేవుడు ఎంతో ప్రేమతో చేసాడు. మనము ఆయన  ప్రజలము. ఆయన మనల్ని ఎందుకు వదిలివేస్తాడు? మనం పాపంలో మునిగిపోతున్నప్పుడు, ఆయన పట్టించుకోకపోతే, మన పాపాలకు రక్తం చిందించడానికి ఆయన తన ప్రియమైన కుమారుడిని ఎందుకు పంపుతాడు?

ఈ శ్రమలు ముగిసిన తరువాత ఏమి జరుగబోతుందో ప్రభువు తన పిల్లలకు ముందే చెప్పాడు. అదేమిటో తెలుసా?
"ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు."యెషయా 65:17. ప్రియ స్నేహితులారా ఇది ఎంత గొప్ప వాగ్దానము!

తరువాత, ప్రభువు ప్రేమించిన శిష్యుడైన యోహాను, తను చూచిన దర్శనమును ప్రకటన గ్రంధంలో వివరించాడు. అదేమిటో చదువుదాము రండి. ఫ్రకటన 5:13 "అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో నున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి."            
అంటే  త్వరలోనే మనము ఈ చెడ్డ దినముల నుండి  విముక్తి పొంది, తండ్రిని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును,  సమస్త సృష్టితో కలిసి ఆరాధిస్తామని అర్థమవుతుంది కదా! ఈ సృష్టి మన తండ్రిది, మరియు మనము ఆయన ప్రజలము. విడిచి పెట్టబడ్డవారము కాదు. ఆయన మనలను ఎందుకు విస్మరిస్తాడు? 
కాబట్టి,  "ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై యున్నాడు.  హెబ్రీ 12:1"  అనుసరించి నడుచుకుందాము.

చారిత్రక సాక్ష్యాలు:

భూమి యొక్క ఉనికి: 

ఈ భూమి మరియు విశ్వంలో మానవత్వం యొక్క మనుగడ, ఇవన్నీ వాటిని ఉనికిలోకి తెచ్చిన మన తండ్రి అయిన సృష్టికర్తను స్మరణకు తెస్తున్నాయి. మానవ పరిశోధన మేరకు, భూమి మనము జీవించడానికి అనుకూలమైన అనేక పరిస్థితులతో  ఆవరించబడి, మరి ఏ ఇతర గ్రహంతో కుడా పోల్చ డానికి వీలులేకుండా ఉంది.


మనము ప్రత్యేకించి విశేషమైన ప్రదేశంలో నివసిస్తున్నాము. (Image:అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి రాత్రి సమయంలో మన భూమి ఇలా కనిపిస్తుందట) జీవించడానికి అవసరమైన అన్ని పదార్థాలను కలిగి ఉన్న ఒక గ్రహం మీద మనము నివసిస్తున్నాము, వీటిలో:

  • ఉష్ణోగ్రతలు జీవితానికి అనుకూలంగా ఉండేలా మన సూర్యుడి నుండి మనము సరైన దూరంలో ఉన్నాము.
  • మన ఉపరితలం వద్ద నీరు ద్రవరూపంలో ఉండడానికి సరైన వాతావరణ పీడనం ఉంది.
  • మనకు జీవించడానికి అనుకూలమైన పదార్థాలుగా చెప్పబడే  - భారీ మూలకాలు మరియు సేంద్రీయ అణువుల  సమతుల్యత సరిగ్గా ఉన్నాయి..
  • మహాసముద్రాలు మరియు ఖండాలు రెండింటినీ కలిగి ఉండటానికి మన ప్రపంచానికి సరైన నీరు ఉంది.
అందువలన ఈ  సృష్టి తనంతట తానుగా  ఏర్పడిందని చెప్పడానికి ఏమాత్రం వీలులేదు.  మనకు తెలిసిన ఇతర ప్రపంచాలను చూస్తే, వ్యత్యాసం అద్భుతంగా ఉంటుంది. 
మన భూమిలాగా ఉండే, Kepler 186f అనబడే మరో గ్రహం.

మానవ శరీర నిర్మాణం:

నాడీ వ్యవస్థ: ముఖ్యంగా మెదడు. దాని సంక్లిష్టత, మనిషికి దానిని తయారుచేయడానికి అస్సలు సాధ్యం కాదు, ఇది మన అద్భుత కరుడైన దేవుడు చేసిన అద్భుతం.
తల్లి గర్బంలో పిండం ఎదుగుదల యొక్క నిర్మాణం:


దేవుని సృష్టి యొక్క మరొక అద్భుతమైన ప్రతిబింబం, మనిషి తన తల్లి గర్భంలో పిండం గా అభివృద్ధి చెందుతున్న ఆశ్చర్యకరమైన ప్రక్రియ.
"నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను." కీర్తన 139:15-16.                                                                          
అంతేకాదు, మనం ప్రతిరోజూ చూసే పక్షులు, పువ్వులు, కొండలు,  లోయలు మరియు మరెన్నో మనకు కనిపించనివి మన దేవుని ప్రేమను, ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నాయి.

మన సృష్టికర్త నైపుణ్యం మరియు అతని హృదయాన్ని చూపించే ఈ పువ్వులను చూడండి. పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.  లూకా 12:27-32.

దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పరమగీతం 2:12
కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. లూకా 12:24


వీటి కంటే మనం గొప్పవారని దేవుడు చెప్పాడుకదా! మరి ఆ చిన్న పక్షులే సృష్టికర్తను వెతుకుతుంటే, మనం ఆయనను ఇంకా ఎక్కువగా వెతకాలి కదా? 


మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొని యున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. 1యోహాను 4:16                                                     
ఈ సృష్టి ఆయన హృదయాన్ని అనుసరిస్తుంటే, మరి మనము ఆయన పోలికలోకి మరి యెక్కువగా మరాలి కదా!

  నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరమగీతం 2:1-2

పువ్వులన్నీ అలా వాడిపోయినట్లు కనిపిస్తున్న కొమ్మలలోనుండి పుట్టుకొస్తూ, మనం సమస్తం పోగొట్టుకున్నాము, అలసిపోయాము, మన పని ఇక అయిపోయింది, అని అనుకుంటున్న మనకు మన బాధలలో కూడా చాలా ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని చూపిస్తున్నట్టుంది కదా!

ఈ అద్భుతమైన సృష్టి వెనుక మన సర్వశక్తిమంతుడైన దేవుని పరిపూర్ణ హస్తాన్ని చూడవచ్చు. ఈ విశ్వంలోని ప్రతి జీవినుండి వినిపించే పాట ....
లోకమ పాడి స్తుతించు ప్రభున్
శక్తి ప్రభావము రారాజుదే
సృష్టంతయూ వణకి లోబడున్ నీనామము ఎదుట
నీక్రియలన్ చూసి సంతసింతున్
నిన్నే ప్రేమింతు నే నిలతు నీకై
నీయందు నాకున్న వాగ్దానముల్ గొప్పవి.
  
All Glory to God.

 
ఇప్పుడు ఇక మీ వంతు. లేఖనాలను ధ్యానించండి మరియు దేవుడు మీకు బయలుపరచిన వాటిని నాతో పంచుకోండి.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

సృష్టి గురించి బైబిల్లోని వచనాలు క్రింద ఉన్నాయి.

1. ఆదికాండము       - 1:1,19,21,27
2. యోబు             - 9:6; 26:7-14: 28:24-27; 38:4,7
3. కీర్తనలు    - 89:11,12; 104:30; 148:5; 139:15,16
4. యెషయా           - 4:5; 40:26; 40:28; 42:5; 43:7; 45:7; 45:12; 45:18; 65:17
5. ఆమోసు           - 4:13
6. ఎఫెస్సీ            - 2:10; 4:24; 
7. కొలస్సీ          - 1:15,16
8. రోమా            - 8:19
9. హెబ్రీ             - 4:13
10. ప్రకటన        - 5:13
 




7, ఆగస్టు 2020, శుక్రవారం

1. నోవహు (దేవునికి విశ్వాసపాత్రుడు)

ప్రభువు నందు ప్రియమైన స్నేహితులారా,


నోవహు అనే అంశంతో ఈ Blog ని ప్రారంభించడానికి నేను ప్రేరేపించబడుతున్నాను.  ఈయన మన క్రైస్తవ జీవితానికి చక్కటి మాదిరి.  మనము ప్రస్తుతము ఉన్న పరిస్థితులలో ఈ అంశాన్ని అధ్యయనం చేయడము వలన, దేవుని పై మనకు అపారమయిన విశ్వాసము బలపరచబడుతుందని నేను ఆశపడుతున్నాను.

ఈ గొప్ప వ్యక్తి గురించి చదువుతున్నప్పుడు వ్యక్తిగతంగా నాకు చాలా విషయాలు భోధపడ్డాయి.  అందులో మీతో కొన్ని సంగతులు పంచుకోవాలని ఆశపడుతున్నాను.
నోవహు 950 సంవత్సరాలు ఈ భూమిపై నివసించాడు. ఈ గొప్ప వ్యక్తి బైబిల్లో ఎలా వర్ణించబడ్డాడో చూద్దాం ...
  • యెహోవా దృష్టిలో కృప పొందినవాడు.
  • నీతిపరుడును, తన తరములో నిందారహితుడు.
  • దేవునితో కూడా నడచినవాడు.
  • విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు.
  • నీతిని ప్రకటించిన వాడు.
నోవహు తన దగ్గర ధర్మశాస్త్రము గాని, యెహోవా కట్టడలు గాని లేనప్పటికి దేవునితో కూడా నడచి, యెహోవా దృష్టిలో కృప పొందిన వాడాయెను. ప్రభువు నోవహును చూచినప్పుడు, ఆ తరమువారిలో అతనొక్కడే నీతిమంతుడు గా కనిపించాడు. అంతే కాదు, అతనిని పిలిచి దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞాపించినదంతయు చేసాడు. 2 పేతురు 2:5 లో అతడు నీతిని ప్రకటించి తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లు కనిపిస్తుంది.

దేవుడు చెప్పినట్లుగా ఓడను తయారు చేయడానికి, లెక్కల ప్రకారం 120 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఎన్నో నిందలు, అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. అదే సమయంలో, తను అంతవరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి, భయభక్తులను విడిచి పెట్టకుండా ఓపికతో ఓడను కట్టుకున్నాడు. తాను ఏమి చేయబోతున్నాడో దేవుడు అతనికి చెప్పినప్పుడు, నోవహు దేవునిని నమ్మి ఓపికగా ఎదురు చూశాడు.

ఇప్పుడు ఓడ ready అయిపోయింది. దేవుడు చెప్పిన జీవులన్నీ అందులోకి చేరిపోయాయి. 8 మంది కుటుంబ సభ్యులు కూడా ఎక్కేసారు. అయినా, మరో 7 రోజులు ఓడలో అలా నిశ్శబ్ధముగా ఎదురు చూచాడు. అంటే, ఈ సమయంలో మిగతా వారిని రక్షించడానికి దేవుడు అనుమతించాడు. ఇంకా ఇంకా వారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. 1పేతురు 3:20 ప్రకారం, తన ప్రజలను రక్షించడానికి, దేవుడు సత్యాన్ని ప్రకటించి మరియు వారి మార్పు కోసం ఎదురు చూశాడు. నోవహుకు మొత్తం విషయం తెలియకపోయినా, అతను అలసిపోలేదు మరియు దేవుడు ఎప్పుడు ఏమి చెబుతారో అని ఎదురు చూచినట్లు కనిపిస్తుంది కదా!

అదే విధంగా, ఇప్పుడు కూడా దేవుడు కృపకాలం మన ముందుంచి వేచి ఉన్నాడు. 2020 సంవత్సర ప్రారంభంతో, పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడు, ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. దేవుడు నోవహు కాల ప్రజల కోసం మరో ఏడు రోజులు వేచి ఉన్నట్లే, మన రోజులు కూడా  పెరుగుతూనే ఉన్నాయి. ఈ జీవితం ఎప్పుడైనా ముగుస్తుంది, కాని దేవుని రాజ్యంలో ప్రవేశించడమే మన ముందు ఉన్న లక్ష్యం.
ఈ లోకం అశాస్వతం అని ఇప్పటికే బాగా అర్థమవుతుంది కదా! మన కళ్లముందు వేలాది మంది తనువు చాలిస్తున్నారు. మనం కూడా ఆ వoతులో చేరే సమయం దగ్గర పడుతుంది. యెహెజ్కేలు 14:14 ప్రకారం “నోవహు, ​దానియేలు, యోబు అనే ముగ్గురు మనుషులు దానిలో ఉన్నా, వాళ్లు తమ నీతి వల్ల కేవలం తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” నోవహు మాదిరిగానే మనం కూడా మన నీతిని కాపాడుకోవాలి. హీబ్రూ 11: 7 ప్రకారం, విశ్వాసమునకు కలుగు నీతికి నోవహు వారసుడైనట్లు, ఆ వారసత్వాన్ని మనం కూడా పొందుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
ఇవన్నీ నోవహు జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా నాకు అర్థమయిన కొన్ని విషయాలు. నోవహు గురించి లేఖనాల్లో నుండి  అన్ని వచనాలు క్రింద ఉన్నాయి. మీరు కూడా అధ్యయనం చేసినప్పుడు ప్రభువు మీతో మాట్లాడిన విషయాలు నాతో పంచుకోండి. ఈ విధంగా విశ్వాసంలో ఒకరినొకరు బలపరుచుకుందాం.
ఆదికాండము 5:29 - భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయము లోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.
ఆదికాండము 5:32 - నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
ఆదికాండము 6:8 - అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.
ఆదికాండము 6:9 - నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
ఆదికాండము 6:13 - దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.
ఆదికాండము 6:22 - నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.
ఆదికాండము 7:1- యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.
ఆదికాండము 7:5 - తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.
ఆదికాండము 8:1 - దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.
ఆదికాండము 9:1 - మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
ఆదికాండము 9:29 - నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.
యెషయా 54:9 - నోవహు కాలమున జలప్రళయమునుగూర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమిమీదికి ఇకను పొర్లుచురావని నోవహుకాలమున నేను ఒట్టుపెట్టుకొనినట్లు నీమీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
యెహెజ్కేలు 14:14 - “ ‘నోవహు, ​దానియేలు, యోబు అనే ముగ్గురు మనుషులు దానిలో ఉన్నా, వాళ్లు తమ నీతి వల్ల కేవలం తమ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలుగుతారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.”
హిబ్రూ 11:7 - విశ్వాస మునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాస మునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.
1 పేతురు 3:20 - దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
2 పేతురు 2:5 - మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
చారిత్రాత్మక ఆధారాలు:
1. నోవహు యొక్క ఓడ కొరకు శోధనలు కనీసం Eusebius సమయం (మ .275–339) నుండి నేటి వరకు చేయబడ్డాయి. ఏదేమైనా, అరారత్ పర్వతం, సాంప్రదాయకంగా నోవహు ఓడ యొక్క విశ్రాంతి ప్రదేశంగా పరిగణించబడుతుంది. దీనిని బైబిల్ పర్వతం అంటారు. అరారత్ పర్వతం 11 వ శతాబ్దం నుండి ఆదికాండం ఖాతాతో సంబంధం కలిగి ఉంది, మరియు అర్మేనియన్లు ఆ సమయంలో ఓడ యొక్క ల్యాండింగ్ ప్రదేశంగా గుర్తించడం ప్రారంభించారు.

2. 2007 మరియు 2008 లో ఏడు పెద్ద చెక్క కంపార్ట్మెంట్లు సముద్ర మట్టానికి 13,000 అడుగుల (4,000 మీటర్లు) ఎత్తులో, అరారత్ పర్వతం శిఖరం దగ్గర కనుగొన్నట్లు పరిశోధిస్తున్న బృందం పేర్కొంది. వారు అక్టోబర్ 2009 లో చిత్ర బృందంతో తిరిగి సైటుకి వచ్చారు.

3. అనేక ఇతర సంస్కృతులలో పురాతన వరద కథలు కూడా ఉన్నాయి. ఈ కథలను సాధారణంగా పురాణాలు లేదా నైతిక కథలుగా తీసుకుంటారు, కాని శాస్త్రవేత్తలు ఇప్పుడు 7,000 సంవత్సరాల క్రితం నల్ల సముద్రం ప్రాంతంలో గొప్ప వరద సంభవించినట్లు ఆధారాలు కనుగొన్నారు.

4. సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తలు నల్ల సముద్రం యొక్క గొప్ప వరదలో మరణించిన ప్రజల మొదటి సాక్ష్యాలను కనుగొన్నారు, అది నోవహు యొక్క ఓడ కథతో ముడిపడి ఉంది. రోబోట్ నీటి అడుగున వాహనాలను ఆ సముద్రపు ఉపరితలం కంటే 300 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉపయోగించడం ద్వారా, వారు రోలింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మ్యాప్ చేయడం ప్రారంభించారు, అవి 7,000 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వరదలతో నిండిన ప్రవాహాల ద్వారా తినిపించబడి, వాటిల్ మరియు డౌబ్ ఇళ్లతో ( గోడలు మరియు భవనాల తయారీకి ఉపయోగించే మిశ్రమ భవన పద్ధతి) గుర్తించబడ్డాయి.

5. . క్రియేషన్ మ్యూజియం (పీటర్స్బర్గ్, కెంటుకీ) వద్ద మరియు సమీపంలోని గిడ్డంగిలో మందసము యొక్క భాగాల ప్రతిరూపాలు(Replicas of portions of the ark ) ఉన్నాయి.
దేవుడు నోవహుకు ఇచ్చిన కొలతలతో యుఎస్ లో తయారైన మరో ఓడ ఇప్పుడు మనకు కనిపిస్తుంది.
పైన చెప్పినట్లుగా, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఇక్కడ పొందుపర్చాను.  ఈ అంశంపై మీ బైబిలు అధ్యయనంలో ఈ విషయాలు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను.

క్రింద ఇవ్వబడిన లింక్‌లలోని పుస్తకాలు మరింత తెలుసుకోవడానికి మనకు చాలా సహాయపడతాయి.
https://www.goodreads.com/book/show/1065303.Noah_s_Ark
https://www.getepic.com/book/13939719/noahs-ark-the-story-of-the-flood-and-after


God of goodness, give me yourself.
For you are sufficient for me
If I were to ask for anything less
I should always be in want,
for in you alone do I have all


                                                                                    Julian  of  Norwich    (?1342 - after 1413)

4, ఆగస్టు 2020, మంగళవారం

బైబిలు అధ్యయన దిక్సూచి (పరిచయం)


దేవుని నామమునకు మహిమ కలుగును గాక.

ప్రభువు నందు ప్రియులారా,

బైబిల్ ను సాధారణంగా చదవడానికి మరియు  ధ్యానపూర్వకముగా చదవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనము బైబిలుని అధ్యయనం చేసి చదివినప్పుడు, సాధారణ పఠనానికి కంటే చాలా విషయాలను చేసుకోగలుగుతాము. అప్పుడే మనం దేవుని వాక్యము యొక్క మాధుర్యాన్ని అనుభవించగలుగుతాము. 

వివిధ కారణాల వల్ల, క్రమం తప్పకుండా బైబిలు అధ్యయనం సాధ్యం కాకపోవచ్చు. కానీ మనం బైబిల్ గురించి ధ్యానం చేయకపోతే మన ప్రభువు మన కోసం దాచిపెట్టిన మర్మమైన సత్యాలను కోల్పోతాము. 'భైబిలు ధ్యయన దిక్సూచి' (Bible Study Navigator) ద్వారా, నేను మీకు వాక్య ధ్యానమునకు కొంతవరకు  సహాయం చేయగలను అనే అభిప్రాయముతో  ఈ Blog ను ప్రారంభించాను, తద్వారా దేవునితో సహవాసాన్ని మరింతగా మెరుగుపరచుకొగలము.

బైబిలు అధ్యయనం చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. నేను ఎంచుకున్న పద్ధతి సమయోచిత బైబిలు అధ్యయన విధానం(Topical Bible Study Method). ఇందులో నేను ఒక అంశాన్ని ఎన్నుకుంటాను, మరియు దానికి సంబంధించిన అన్ని వచనాలను ఇక్కడ బైబిల్ నుండి ప్రస్తావిస్తాను. ఆ పద్దతి, మనము ఎంచుకున్న topic ని అర్ధము  చేసుకుంటూ త్వరగా ముందుకు నడిపిస్తుంది. పరిమిత వ్యవధిలో మరిన్ని విషయాలను cover చేయడానికి, మరియు బైబిల్ నుండి చాలా విలువైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది.
అదే విధంగా ఆ ప్రత్యేక అంశానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను మీ ముందు ఉంచడానికి కూడా ప్రయత్నిస్తాను.


God bless u all...

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...