26, ఆగస్టు 2020, బుధవారం

3. వెలుగు (THE LIGHT)

 ప్రియ స్నేహితులారా,

మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను.


గత 'సృష్ఠి కర్త సృష్ఠి' అనే అంశంలో మన దేవాతి దేవుడు చేసిన ఈ గొప్ప సృష్ఠి గురించి కొంతవరకు ధ్యానించు కున్నాము. ఆయన చేసిన కార్యములన్నిటి గురించి చెప్పుకోవడానికి మనకు మాటలు చాలవు, కాని కొన్ని సంగతుల గురించి ధ్యానించక తప్పదు. ఎందుకంటే, మన సృష్టికర్తయైన ప్రభువు, తాను చేసిన సృష్ట్యాలను (Creations) ఎన్నోవాటిని మనకు ఛాయా (Shadow) రూపముగా  ఉంచారు. వాటిని ధ్యానించడము ద్వారా మనలో విశ్వాసం ఇంకా బలపడుతుంది, కాబట్టి వాటిలో ఒక్కొక్కటిగా మీముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.

ఇప్పుడు మనము ఎంచుకున్న ధ్యానాంశం 'వెలుగు'  (THE LIGHT), లోనికి నడుద్దాం రండి. 

ముందుగా 'వెలుగు' అనే  అంశం గురించి లోకంలో ఉన్న మేధావులు, పరిశోధకులు ఏంచెబుతున్నారో చూసి, ఆ తరువాత లేఖనాలలో ఉన్న ప్రభువు వెలుగు యొక్క స్పష్టతను అవగాహన చేసుకుందాము.

మానవ జ్ఞానమునకు అందిన విషయాలను ప్రశ్న మరియు జవాబు రూపంలో ఈ క్రింద పొందు పరుస్తున్నాను చూడండి. 

1. వెలుగు లేక కాంతి అంటే ఏమిటి?

కాంతి అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి వీలు కల్పించే ఒక రకమైన శక్తి. మన దైనందిన జీవితంలో వెలుగు ఒక ముఖ్య అంశం. ఇది రోజంతా మనకు మార్గనిర్దేశం చేస్తుంది, ఉదయాన్నే మేల్కొలపడానికి మరియు రాత్రి నిద్రపోయేలా చేస్తుంది. కాంతి అనేది విలోమ, విద్యుదయస్కాంత తరంగం, దీనిని సాధారణ మానవుడు చూడగలడు. 

2. ఈ 'వెలుగు' ఎక్కడనుండి వస్తుంది? 

మన ప్రధాన సహజ కాంతి వనరులు సూర్యుడు, నక్షత్రాలు. సూర్యుడి నుండి వచ్చే కాంతి అంతరిక్షంలో ప్రయాణించిన తరువాత, వాతావరణంలోని వివిధ కణాలు మరియు అణువులను తగిలినప్పుడు అది “చెల్లాచెదురుగా” అవుతుంది. అప్పుడు ఆ  కాంతి  భూమి యొక్క ఉపరితలానికి చేరుకుంటుంది.

3 .మానవులు కాంతిని ఎలా ఉపయోగిస్తారు?

 సూర్యుడి  నుండి వచ్చిన  కాంతి మన చుట్టూ ఉంది. మనము దీన్ని భావ వ్యక్తీకరణ (Communicate) చేయడానికి, (Navigate) దిశానిర్దేశం చేయడానికి, నేర్చుకోవడానికి మరియు అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. మన కళ్ళతో మనం గుర్తించగలిగే దానికంటే కాంతి చాలా ఎక్కువ. అంతరిక్షంలో లేదా చంద్రునిపై కాంతిని విచ్చిన్నంచేసే వాతావరణం లేదు. సూర్యుడి నుండి వచ్చే కాంతి విచ్చిన్నమవ్వకుండా అన్ని రంగులు కలిసి సరళ రేఖలో ప్రయాణిస్తుంది. 

4. కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది?

శూన్యంలో కాంతి వేగం సెకనుకు 1,86,282 మైళ్ళు (సెకనుకు 2,99,792 కిలోమీటర్లు), మరియు సిద్ధాంతం ప్రకారం కాంతిని మించిన వేగం మరి దేనికి కూడా లేదు. గంటకు (మైళ్ళలో), కాంతి వేగం చాలా ఎక్కువ: సుమారు 670,616,629 mph.

5. వెలుగు లేకపోతే ఏమి జరుగుతుంది?

వెలుగు లేకపోతే మన కండ్లకు ఏమీ కనిపించదు. మన కన్నులు చూడడానికి శక్తినిచ్చేది వెలుగే కాబట్టి, వెలుగు లేకపోతే మనము అంధులమైపోతాము. కిరణజన్య సంయోగక్రియ జరగడం వలన మొక్కలు ఆక్సిజన్‌ను ఇస్తాయి, ఇది గురుత్వాకర్షణకు ఉపయోగపడుతుంది. ఒకవేళ వెలుగు లేకపొతే, ఇదంతా సాధ్యపడదు. ఇప్పుడున్న మానవ జీవితం అగమ్యగోచరంగా ఉంటుంది.

ఇప్పుడు లేఖనాలలోకి వెళ్దాం రండి.

వెలుగు ఎలా వచ్చింది? అనే ప్రశ్న వేస్తే, దేవుడు "వెలుగు కలుగును గాక" అనే ఒక్క మాటతో వెలుగును సృష్టించెను అని వాక్యం చెబుతుంది. అప్పుడు ఆయన, వెలుగును చీకటిని వేరు పరచి, వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టిన తరువాత వెలుగును చీకటిని ఏలడానికి సూర్యుడిని, చంద్రుడిని చేసారు.

దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను." ఆదికాండము 1:16-18.

అంటే సూర్యుడిని సృష్టించడానికి ముందే దేవుడు వెలుగును చేసారు కదా! ఆ వెలుగు ఎక్కడినుండి వచ్చింది? దీనికి సమాధానం యోబు గ్రంధంలో దేవుడే ప్రశ్న రూపంలో చెబుతున్నారు. "వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?"  యోబు 38:19. అనగా వెలుగు నివసించే చోటు వేరే ఉందన్నమాట. అయితే అది ఎక్కడ? ఆ వివరణ దానియేలు దగ్గర ఉంది. "వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది." దానియేలు 2:22. దావీదు కూడా మరో స్పష్టత ఇస్తున్నాడు-"వస్త్రమువలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు." కీర్తన 104:2. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. 1యోహాను 1:5.

అంటే ఆయన తన  వెలుగునే  మనమీద ప్రసరింప జేస్తున్నారన్నమాట. "సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లు చున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది." హబక్కూకు 3:4 ; సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 1 తిమోతికి  6:16.

దీనిని బట్టి నాకు అర్ధమైన విషయం ఏమిటంటే- మన తండ్రియైన దేవుడు, తన వెలుగునే, చీకటి ఆవరించి ఉన్న ఈ మహా విశ్వంమీదకు కలుగును గాక అని పలికారు. తరువాత ఆ వెలుగును చీకటిని వేరు పరచి ఆకాశమండలమునకు కట్టడలను నియమించారు. యోబు 38:33 "ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింప గలవా?".

మనము ఏదో అనుకోకుండా పుట్టిన వెలుగులో ఉండలేదు. సర్వశక్తిమంతుడైన దేవుని చుట్టూ ఆవరించబడి ఉండే ఆ వెలుగులోనే ఉన్నాము. "యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగునను గ్రహించియున్నాడు" కీర్తన 118:27 అని ఆత్మ ద్వారా  ఆ విషయాన్ని గ్రహించినవాడై దావీదు "యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింప జేయుము." కీర్తన 4:6 అని బ్రతిమాలుకుంటున్నాడు.

మనము చూచుచున్న ఈ వెలుగు ఆయనది. ఆయన ముఖప్రకాశము. ఆయన సన్నిధినుండి, ఆయన మాటకులోబడి, ఆయన చిత్తమును నెరవేర్చడానికి వస్తున్న వెలుగును మనము చూస్తున్నాము. మరికొంతకాలమైన తరువాత ఈ సూర్య చంద్రులు ఇక ఉండరు. ఇప్పుడు ఛాయగా చూస్తున్న ఆయన వెలుగును మనము కన్నులారా చూచి ఆయనలో అనందిస్తాము. "ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును." యెషయా 60:19,20.

ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. ప్రకటన 21:23

ఆయన సన్నిధినుండి వచ్చిన ఈ వెలుగే ఎంతో గొప్పగా మనకు కనిపిస్తూఉంటే, మరి ఒకవేళ ఆయన సన్నిధికి చేరి అక్కడే యుగయుగాలు ఆయనతో గడిపే అవకాశం వస్తే వదులుకుంటామా? అస్సలు వదులుకోము కదా! వదులుకోవద్దు. ఎందుకంటే, ఆ అవకాశాన్ని కూడా ఒక వెలుగు రూపంలో మన తండ్రియైన దేవుడే మన కోసం పంపించారు. "నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు." యోహాను 1:9,10.

ఆ విషయాన్ని గ్రహించిన కోరహు కుమారులు ఆత్మపూర్ణులై ఆయనను ఎలా స్తుతించారో చూడండి. 
"నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును." కీర్తన 43:3 

ఆ వెలుగు మనలను ఆయన నివాసస్థలమునకు తీసుకొని వెళ్ళాలని మనుష్యకుమారునిగా వచ్చి, "నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను." యెషయా 60:1, అని చెప్పారు. ఇప్పుడు ఆయనను అంగీకరించి, ఆయనను వెదకిన యెడల, "నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి." కీర్తన 90:8, కనుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ఆ నిజమైన వెలుగు, సూర్యుని వెలుగైనను, చంద్రుని కాంతి అయినను అక్కరలేని ఆ నిత్యరాజ్యములో ప్రవేశించడానికి మనలను నడిపిస్తుంది.  "మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను." యోహాను 12:46.

ఆ వెలుగు మన ప్రభువైన యేసు క్రీస్తు. " యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. యోహాను 8:12, ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. యోహాను 1:4. "నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను." యోహాను 9:4; నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. యోహాను 12:46. 

"అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు." ఎఫెస్సీ 5:14. మనలను చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసి, మనము వెలిగింపబడిన మీదట అనేకులను ఆ వెలుగు లోనికి నడిపించాలని మనలను, ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజకసమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవునికి సొత్తయిన ప్రజలుగాను చేసి యున్నారు. మనము పరిపూర్ణముగా ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు........."అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు." మత్తయి 24:30,31.

ఆయన వెలుగులో పుట్టిన మనము, ఆత్మీయ చీకటిలో పడిపోయినప్పుడు, తన కుమారుణ్ణి వెలుగుగా పంపించి, ఆయన వెలుగులో వెలిగింపబడి, ఆయన వెలుగులోనే నడుస్తూ నిత్యరాజ్యములోనికి ప్రతి ఒక్కరు ప్రవేశించాలనే ఆ మహాఘనుని ప్రణాలిక అత్యద్భుతం. ప్రభువు మనకు ఏమాత్రం దూరంలో లేరు. మనతోనే ఉన్నారు, మనలోనికి ప్రవేశించి మనలను వెలిగించారు. ఆయన వెలుగుగా వచ్చి, మనలను వెలుగుగా చేసారు. 

ప్రభువు మాటలను చదువుతూ ఉంటే మనస్సు ఉప్పొంగి పోతుంది కదా! ఇప్పుడు సమయం ఆగష్టు 26 అర్ధరాత్రి 3 అయ్యింది. ఆ ప్రేమామయుని ప్రణాలికలను ధ్యానిస్తూ ఉంటే, ఆయన వెలుగులో పరవసిస్తున్నాను. ఇంకా చాలా చెప్పాలని ఉంది. దావీదు అన్నట్టు క్రొవ్వుమెదడు దొరికినట్లుగా నా ప్రాణము కూడా తృప్తి పొందుచున్నది.

మీరుకూడా ఆ లేఖనాలను ధ్యానించి ఆ దివ్యమైన వెలుగులో పరవసించండి. ప్రభువు కృప మీకు తోడుగా ఉండు గాక.

Light of the world

You stepped down into darkness

Opened my eyes, let me see

Beauty that made this heart adore You

Hope of a life spent with You

Here I am to worship

Here I am to bow down

Here I am to say that You're my God


"వెలుగు" అనే అంశం మీద వచనాలన్ని క్రింద ఉన్నాయి, గమనించండి.

1. ఆదికాండము: 1:3,4,5,15

2. యోబు        :22:28; 29:3, 29:24; 33:28,29; 36:30; 38:19,24.

3. కీర్తనలు       :4:6; 18:28; 27:1; 36:9; 37:6; 43:3; 44:3; 74:16; 78:14; 89:15; 90:8; 97:11; 104:2; 112:4; 118:27; 119:105,130

4. యెషయా    :2:5; 9:2; 42:7; 45:7; 60:1,3,19,20

5. దానియేలు   :2:22

6. మీకా          :7:8,9

7. హబక్కూకు : 3:4

8. మత్తయి      :5:14,16; 17:2; 24:30

9. లూకా          :1:79; 2:32

10. యోహాను  :1:4,5,7,9; 8:12; 9:4; 12:36,46

11. 2 కొరింధీ     :4:5 

12. ఎఫెస్సీ        :5:8,13,14

13. 1 థెస్స        : 5:5

14. 1 తిమోతి    :6:16

15. 1 యోహాను : 1:5

16. ప్రకటన        :21:23; 22:5.






:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...