ప్రియమైన స్నేహితులారా,
మీ అందరికి Christmas శుభాకాంక్షలు.

December నెల ప్రారంభం అయినప్పటినుండి మనందరి హృదయాలలో చెప్పలేని సంతోషం నిండిపోతుంది కదా! అయితే ఈ ఆనందానికి కారణం ఏమిటి?
ఎవరైనా ఇంత సంతోషంగా ఉంటే ప్రేమలో పడ్డావా అని అంటారు కదా మరి వయసుతో తేడా లేకుండా మనలో కనిపిస్తున్న ఈ ఆనందానికి కారణం ప్రేమేనా? అంతగా ప్రేమించడానికి.. ప్రేమించబడడానికి కారణమైన వ్యక్తి ఎవరు?
వ్యక్తి కాదు సర్వ శక్తి గల సర్వోన్నతుడు... ఆకాశ మహాకాశములు పట్టజాలని సర్వేశ్వరుడు ... ఆ దేవాది దేవుడు మనలను ప్రేమించాడంట...
"మలాకీ 1:2 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను మీయెడల ప్రేమ చూపియున్నాను."
మనము ఎవరినైనా ప్రేమించిన లేక ప్రేమించబడిన, ఆ ప్రేమకు గుర్తుగా ఏదయినా బహుమతి గాని లేక సహాయంగాని చేయాలనుకుంటాము కదా అదేవిధముగా మనలను ప్రేమించిన మన తండ్రి ఆయన ప్రేమను మన పట్ల ఎలా కనపరిచారో లేఖనాలు వివరిస్తున్నాయి.
1. సృష్టి ఆది నుండి తాను చేసిన మనిషిని ప్రేమించి మట్టినుండి పుట్టిన మానవుడు తిరిగి మట్టిగామారి నశించి పోకుండా మహిమ దేహం ధరించి తనతోనే నిత్యం ఉండాలని ఆయన సంకల్పించి ఈ భూమిమీద కూడా మనుషులు సంతోషంగా ఉండాలని మనపితరులకు వాగ్దానాలు చేసి ఆవాగ్దానం కొరకు మనము యెంతగా ఆప్రేమకు విరోధంగా జీవిస్తున్నా ఆయన మాటతప్పలేదు.
"ద్వితీయోపదేశకాండము 4:37 ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను."
2. ఆయన ప్రేమిస్తున్నాడు గనుక, వీరు మానవులు మాట ఇచ్చేదేంటి... నిలబెట్టుకునేదేంటి... అని అనికోలేదు గాని తాను మనపితరులకు చేసిన ప్రమాణం కోసం తన ప్రేమ చేత మన అవిధేయతను భరిస్తూనే వచ్చారు.
"ద్వితీయోపదేశకాండము7:8 అయితే యెహోవా మిమ్మును ప్రేమించు వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను."
"7:13 ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును."
3. దేవుడైన యెహోవాకు మనయెడల విపరీతమైన ప్రేమ కాబట్టి, ఈ లోక తలిదండ్రులు తమ బిడ్డలను చూచి మురిసిపోయినట్లుగానే ఆయన కూడా మనలను చూచి అంనందపడతారంట.
"ద్వితీయోపదేశకాండము10:15 అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారియందు ఆనంద పడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను."
4. తండ్రికి మనమీద అపారమైన ప్రేమ కాబట్టి మనక్రియల వలన కలిగిన శాపాలను ఆశీర్వాదముగా మారుస్తున్నారు.
"ద్వితీయోపదేశకాండము23:5 అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాప మును ఆశీర్వాదముగా చేసెను.
33:3 ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు."
5. దేవుడు మనలను ఎంతో ప్రేమించుచున్నాడు గనుక మన పొరపాట్లను బట్టి గద్దించి బుద్ది నేర్పిస్తున్నారు.
"సామెతలు 3:12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును."
"యెషయా 38:17 మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి."
6. ఆయన ప్రేమ శాశ్వతమైనది గనుక ఎన్నటెన్నటికి మన యెడల ఆయన కృప చూపిస్తూనే ఉన్నారు.
"యిర్మియా 31:3 చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను."
"1 కోరింథీయులకు 2:9 ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది."
"జెఫన్యా3:17 నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును."
7. తండ్రి తన ప్రేమను మనకు చూపించడానికి తాను చేయగలిగిందంతా చేసేసారు. చివరికి ఆయన తన ప్రియమైన
కుమారుణ్ణి కూడా మనకు కానుకగా ఇచ్చి తన ప్రేమకు అవధులు లేవని రుజువు చేసుకున్నారు. ఆ అద్భుతమైన కానుకయైన యేసుప్రభువు వారిని అనగా ఆయనకు ప్రియాతిప్రియమైన కుమారుణ్ణి మనకు ఎందుకిచ్చారు? పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఆయన కుమారుణ్ణే వారధిగా వేసి మనచేయి పట్టుకుని తన దగ్గరికి తీసుకోవాలనే గొప్పసంకల్పం ఆయన అంతులేని ప్రేమకు నిదర్శనం.
"యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను."
- తండ్రి ఆ కానుకను యెందుకు మనకు ఇచ్చారు? మనలనుండి యేమి ఆశిస్తున్నారు?
ఆయన ఇచ్చిన కానుకను స్వీకరించి ఆ బహుమతిని ప్రేమించి ఆయన మాటకు లోబడడం మాత్రమే ఆయన మనల నుండి ఆశిస్తున్నారు.
"యోహాను14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము."
- ఆయన మాటలను అంగీకరించి ఆయన చిత్తప్రకారము నడవడమే ఆయన చూపిస్తున్న ప్రేమకు బదులు మనప్రేమను కనబరచడం.
15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు."
- చివరకి తండ్రి ఇచ్చిన బహుమతి అయిన యేసయ్య కూడా మనలను ప్రేమిస్తున్నారు. అచ్చం తండ్రిలాగే....
"యోహాను15:9 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.
15:12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
రోమా 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
8:37 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము."
- ఈ వాగ్దానాలు చూడండి ఆనందంతో పరవశించిపోతాము.
"ఎఫెసీయులకు 1:6 మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
2:4 అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను.
"ప్రకటన గ్రంథం 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను."
- క్రిస్మస్ డిశంబరు 25న అవ్వచ్చు కాకపోవచ్చు. కాని ప్రభువు మనకోసం భూమి మీదకి నరావతారునిగా వచ్చి పాపంలో ఉన్న మన బ్రతుకులు మార్చి మనలను వెలిగించారు. ఇది నిశ్చయం. నా కోసం వచ్చి నన్ను వెలిగించిన నా ప్రభువు జన్మదినం నాకు పండుగ అనేది మన నినాదం. ప్రపంచమంతా ఏక మనస్సుతో ఆ సంతోషాన్ని పంచుకోవడంలో మనంకూడా ఒక దివిటీ. అదే మనలో ఇంత సంతోషానికి కారణం.
క్రిస్మస్ శుభవార్త... యేసయ్య మాటలలో....
నేను మరణించాను... మీరు మరణిస్తారు
నేను తిరిగి లేచాను... మీరు కూడా తిరిగి లేస్తారు
నేను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాను.... మీరు కూడా వస్తారు...
రండి నా అడుగు జాడలలో.....
ఇదే సువార్త మానము రాజుల రాజు క్రీస్తు
యేసు క్ర్రీస్తు జననము దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతి రూపము ప్రేమ మూర్తి జననము
యూదయ బెత్లెహేమందున రాజుల రాజుగ పుట్టెను
రక్షించును తనప్రజలను ఇలలో జీవము క్రీస్తు.
"ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
2 కోరింథీయులకు 13:14"
Praise the Lord. Prema sandesam briefga chakkaga chepparu. God bless you n happy christmas' n happy birthday.
రిప్లయితొలగించండిThank you very much sister
రిప్లయితొలగించండి