18, ఆగస్టు 2020, మంగళవారం

2. సృష్ఠి కర్త సృష్ఠి


దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

ప్రియమైన స్నేహితులారా,

దేవాది దేవుడైన యెహోవా ఈ సృష్టి అంతటిని కలుగజేసాడని మనకు తెలుసు, అయినప్పటికీ, మనం ఆ క్రమమును  లేఖనాల నుండి  అధ్యయనం చేస్తున్నప్పుడు, మనలో చెప్పలేని ఆనందం మరియు ఆయనపై, ఆయన కార్యాలపై  స్థిరమైన విశ్వాసం కలుగుతుంది.

లేఖనాల అధ్యయనం ద్వారా నేను నేర్చుకున్న కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను.

దేవుడు ఈ సృష్టి అంతా ఎందుకు చేశాడు? ఎలా మరియు ఎప్పుడు జరిగింది? మనకు ఇలాంటి సందేహాలు చాలా కలుగుతూ ఉంటాయి. కానీ, మనకు ఎంతవరకు అవసరమో అన్ని విషయాలు,  ఇంకా ఇప్పటివరకు మనకు అర్థం కాని చాలా విషయాలు గ్రంథములో పొందుపరచబడ్డాయి. మనం వాటికి మించి ఆలోచిస్తే, అది మన జ్ఞానానికి అందనిది. కాబట్టి మనకు ఏ విషయాలు  బయలుపరచబడ్డాయో వాటినే ధ్యానించుకుందాం.

లేఖనాలను పరిశీలిస్తే, మొదట దేవుడు శూన్యమండలముపైన ఆకాశమును సృజించి దానిని విశాలపరిచెను అని యోబు భక్తుడు అంటున్నాడు. 'యెషయా' కూడా దేవుడు ఆకాశాలను సృష్టించి, వాటిని విస్తరించాడని చెప్పాడు. అప్పుడు దేవుడు నక్షత్రాల సమూహములను బయలుదేరజేసి, ఒక్కొక్కటిగా పేర్లు పెట్టి పిలుస్తాడంట(యెషయా40:26). తన అధికశక్తి చేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచి పెట్టడు అని వాక్యం చెబుతుంది.

తరువాత, యోబు గ్రంధములో, దేవుడు భూమిని చాలా ప్రత్యేకమైనదిగా చేశానని ఆయనే వివరించాడు. ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మూలరాతిని వేశారంట. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు భూమిని సిద్ధం చేసి స్థిరపరిచారు.

దేవుడు భూమిని ఎంత ప్రత్యేకమైనదిగా చేశారంటే, నిరాకారంగా ఉన్నదానిని  తీసుకొని,  నివసించటానికి యోగ్యముగా నిర్మించారు. అప్పుడు భూమిపై, ఆయన ఉద్దేశించిన ప్రతిదాన్ని ఏర్పాటు చేసి, ఆ తరువాత మనలను తన స్వరూపంలో మనుషులుగా చేశారు. దేవుడు మనలను ఆశీర్వదించి, “ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోమన్నాడు. సముద్రంలోని చేపలు, ఆకాశంలోని పక్షులు మరియు భూమిపై కదిలే ప్రతి జీవిని ఏలమన్నాడు.”

మరియు ఈ సృష్టినంతటిని  మనకు అప్పగించి, ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నారు?

దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడా? మరియు మనకు నచ్చిన విధంగా మనము జీవించవచ్చా? సమాధానం - 'కాదు' అనే వస్తుంది. హెబ్రీ 4:13 ఏంచెబుతుందంటే : మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.

ఆయన మౌనంగా లేడు. "నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే." అని చెప్పి మనకోసం యెదురుచూస్తున్నాడు. 

దేవుడు మన కోసం ఇంత అందమైన సృష్టిని చేసాడు, అయితే మనపట్ల ఆయన ఉద్దేశ్యం ఏమిటి? మనం ఏమి చెయ్యాలి?  దానికి పౌలు సమాధానము చెబుతున్నాడు. " మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము."  ఎఫెస్సీ 2:10 

ఇలాంటి కఠినమైన రోజుల్లో మనం ఇరుక్కున్నప్పుడు, కష్టాలు కన్నీళ్లతో నలిగిపోతున్నప్పుడు, వ్యాధులు మన చుట్టూ ఉన్నప్పుడు, దేవుడు మన గురించి పట్టించుకుంటాడా? అని అనిపిస్తుంది కదా!

ఈ సృష్టిని దేవుడు ఎంతో ప్రేమతో చేసాడు. మనము ఆయన  ప్రజలము. ఆయన మనల్ని ఎందుకు వదిలివేస్తాడు? మనం పాపంలో మునిగిపోతున్నప్పుడు, ఆయన పట్టించుకోకపోతే, మన పాపాలకు రక్తం చిందించడానికి ఆయన తన ప్రియమైన కుమారుడిని ఎందుకు పంపుతాడు?

ఈ శ్రమలు ముగిసిన తరువాత ఏమి జరుగబోతుందో ప్రభువు తన పిల్లలకు ముందే చెప్పాడు. అదేమిటో తెలుసా?
"ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు."యెషయా 65:17. ప్రియ స్నేహితులారా ఇది ఎంత గొప్ప వాగ్దానము!

తరువాత, ప్రభువు ప్రేమించిన శిష్యుడైన యోహాను, తను చూచిన దర్శనమును ప్రకటన గ్రంధంలో వివరించాడు. అదేమిటో చదువుదాము రండి. ఫ్రకటన 5:13 "అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో నున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి."            
అంటే  త్వరలోనే మనము ఈ చెడ్డ దినముల నుండి  విముక్తి పొంది, తండ్రిని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును,  సమస్త సృష్టితో కలిసి ఆరాధిస్తామని అర్థమవుతుంది కదా! ఈ సృష్టి మన తండ్రిది, మరియు మనము ఆయన ప్రజలము. విడిచి పెట్టబడ్డవారము కాదు. ఆయన మనలను ఎందుకు విస్మరిస్తాడు? 
కాబట్టి,  "ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై యున్నాడు.  హెబ్రీ 12:1"  అనుసరించి నడుచుకుందాము.

చారిత్రక సాక్ష్యాలు:

భూమి యొక్క ఉనికి: 

ఈ భూమి మరియు విశ్వంలో మానవత్వం యొక్క మనుగడ, ఇవన్నీ వాటిని ఉనికిలోకి తెచ్చిన మన తండ్రి అయిన సృష్టికర్తను స్మరణకు తెస్తున్నాయి. మానవ పరిశోధన మేరకు, భూమి మనము జీవించడానికి అనుకూలమైన అనేక పరిస్థితులతో  ఆవరించబడి, మరి ఏ ఇతర గ్రహంతో కుడా పోల్చ డానికి వీలులేకుండా ఉంది.


మనము ప్రత్యేకించి విశేషమైన ప్రదేశంలో నివసిస్తున్నాము. (Image:అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి రాత్రి సమయంలో మన భూమి ఇలా కనిపిస్తుందట) జీవించడానికి అవసరమైన అన్ని పదార్థాలను కలిగి ఉన్న ఒక గ్రహం మీద మనము నివసిస్తున్నాము, వీటిలో:

  • ఉష్ణోగ్రతలు జీవితానికి అనుకూలంగా ఉండేలా మన సూర్యుడి నుండి మనము సరైన దూరంలో ఉన్నాము.
  • మన ఉపరితలం వద్ద నీరు ద్రవరూపంలో ఉండడానికి సరైన వాతావరణ పీడనం ఉంది.
  • మనకు జీవించడానికి అనుకూలమైన పదార్థాలుగా చెప్పబడే  - భారీ మూలకాలు మరియు సేంద్రీయ అణువుల  సమతుల్యత సరిగ్గా ఉన్నాయి..
  • మహాసముద్రాలు మరియు ఖండాలు రెండింటినీ కలిగి ఉండటానికి మన ప్రపంచానికి సరైన నీరు ఉంది.
అందువలన ఈ  సృష్టి తనంతట తానుగా  ఏర్పడిందని చెప్పడానికి ఏమాత్రం వీలులేదు.  మనకు తెలిసిన ఇతర ప్రపంచాలను చూస్తే, వ్యత్యాసం అద్భుతంగా ఉంటుంది. 
మన భూమిలాగా ఉండే, Kepler 186f అనబడే మరో గ్రహం.

మానవ శరీర నిర్మాణం:

నాడీ వ్యవస్థ: ముఖ్యంగా మెదడు. దాని సంక్లిష్టత, మనిషికి దానిని తయారుచేయడానికి అస్సలు సాధ్యం కాదు, ఇది మన అద్భుత కరుడైన దేవుడు చేసిన అద్భుతం.
తల్లి గర్బంలో పిండం ఎదుగుదల యొక్క నిర్మాణం:


దేవుని సృష్టి యొక్క మరొక అద్భుతమైన ప్రతిబింబం, మనిషి తన తల్లి గర్భంలో పిండం గా అభివృద్ధి చెందుతున్న ఆశ్చర్యకరమైన ప్రక్రియ.
"నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను." కీర్తన 139:15-16.                                                                          
అంతేకాదు, మనం ప్రతిరోజూ చూసే పక్షులు, పువ్వులు, కొండలు,  లోయలు మరియు మరెన్నో మనకు కనిపించనివి మన దేవుని ప్రేమను, ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నాయి.

మన సృష్టికర్త నైపుణ్యం మరియు అతని హృదయాన్ని చూపించే ఈ పువ్వులను చూడండి. పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడ ఇవి మీ కనుగ్రహింపబడును.  లూకా 12:27-32.

దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. పరమగీతం 2:12
కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు. లూకా 12:24


వీటి కంటే మనం గొప్పవారని దేవుడు చెప్పాడుకదా! మరి ఆ చిన్న పక్షులే సృష్టికర్తను వెతుకుతుంటే, మనం ఆయనను ఇంకా ఎక్కువగా వెతకాలి కదా? 


మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొని యున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. 1యోహాను 4:16                                                     
ఈ సృష్టి ఆయన హృదయాన్ని అనుసరిస్తుంటే, మరి మనము ఆయన పోలికలోకి మరి యెక్కువగా మరాలి కదా!

  నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లిపద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరమగీతం 2:1-2

పువ్వులన్నీ అలా వాడిపోయినట్లు కనిపిస్తున్న కొమ్మలలోనుండి పుట్టుకొస్తూ, మనం సమస్తం పోగొట్టుకున్నాము, అలసిపోయాము, మన పని ఇక అయిపోయింది, అని అనుకుంటున్న మనకు మన బాధలలో కూడా చాలా ఆశీర్వాదాలు దాగి ఉన్నాయని చూపిస్తున్నట్టుంది కదా!

ఈ అద్భుతమైన సృష్టి వెనుక మన సర్వశక్తిమంతుడైన దేవుని పరిపూర్ణ హస్తాన్ని చూడవచ్చు. ఈ విశ్వంలోని ప్రతి జీవినుండి వినిపించే పాట ....
లోకమ పాడి స్తుతించు ప్రభున్
శక్తి ప్రభావము రారాజుదే
సృష్టంతయూ వణకి లోబడున్ నీనామము ఎదుట
నీక్రియలన్ చూసి సంతసింతున్
నిన్నే ప్రేమింతు నే నిలతు నీకై
నీయందు నాకున్న వాగ్దానముల్ గొప్పవి.
  
All Glory to God.

 
ఇప్పుడు ఇక మీ వంతు. లేఖనాలను ధ్యానించండి మరియు దేవుడు మీకు బయలుపరచిన వాటిని నాతో పంచుకోండి.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక!

సృష్టి గురించి బైబిల్లోని వచనాలు క్రింద ఉన్నాయి.

1. ఆదికాండము       - 1:1,19,21,27
2. యోబు             - 9:6; 26:7-14: 28:24-27; 38:4,7
3. కీర్తనలు    - 89:11,12; 104:30; 148:5; 139:15,16
4. యెషయా           - 4:5; 40:26; 40:28; 42:5; 43:7; 45:7; 45:12; 45:18; 65:17
5. ఆమోసు           - 4:13
6. ఎఫెస్సీ            - 2:10; 4:24; 
7. కొలస్సీ          - 1:15,16
8. రోమా            - 8:19
9. హెబ్రీ             - 4:13
10. ప్రకటన        - 5:13
 




3 కామెంట్‌లు:

17. బైబిల్ - ఆ కలం ఎవరిది? (Part 2)

ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆధ్యంతము పరిశుద్ధ గ్రంధపు గ్రంధకర్త దేవుడే అయినప్పట...